సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్స్ ఇవే

Wednesday,November 20,2019 - 04:54 by Z_CLU

సంక్రాంతి సినిమాల విడుదల తేదీలు ఎట్టకేలకు కొలిక్కి వచ్చాయి. మొన్నటివరకు మహేష్, బన్నీ సినిమాల మధ్య ఉన్న సస్పెన్స్ వీడింది. తాజాగా రజనీకాంత్ మూవీ ఎప్పుడొస్తుందో కూడా ఫిక్స్ అయింది. వీటికి తోడు అసలు కల్యాణ్ రామ్ సినిమా వస్తుందా రాదా అనే సస్పెన్స్ కు కూడా ఈమధ్యే తెరపడింది.

సంక్రాంతి సినిమాల్లో ముందుగా వచ్చేది రజనీకాంత్ నటిస్తున్న దర్బార్. లెక్కప్రకారం ఈ సినిమాను జనవరి 11న విడుదల చేస్తారని అనుకున్నారు. కానీ 2 రోజులు ముందుగా 9వ తేదీనే థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. దీనికి కారణం మహేష్ బాబు మూవీ.

మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ చేస్తున్న అల వైకుంఠపురములో సినిమాలు రెండూ ఒకే తేదీకి ఫిక్స్ అయ్యాయి. అయితే ఇది ఒకప్పటి ముచ్చట. ఇంటర్నల్ గా జరిగిన చర్చల ప్రకారం, ఇప్పుడు మహేష్ బాబు సినిమా అనుకున్న తేదీ కంటే ఒక రోజు ముందే, అంటే జనవరి 11నే థియేటర్లలోకి వస్తోంది.

ఇక ముందుగానే ప్లాన్ చేసినట్టు జనవరి 12న బన్నీ సినిమా వస్తోంది. ఈ రెండు సినిమాలకు థియేటర్లు సర్దుబాటు చేసేందుకు రజనీకాంత్ మూవీని కాస్త ముందుగానే రిలీజ్ చేస్తున్నారన్నమాట.

ఇక ఇంత పోటీ మధ్య కల్యాణ్ రామ్ నటిస్తున్న ఎంత మంచివాడవురా వస్తుందా రాదా అనే డౌట్స్ చాలామందికి ఉన్నాయి. ఇప్పుడా సందేహాలు అక్కర్లేదు. కల్యాణ్ రామ్ సినిమా ఇంతకుముందే చెప్పినట్టు జనవరి 15న థియేటర్లలోకి వస్తోంది.