సంక్రాంతి సినిమాల సందడి

Monday,December 17,2018 - 04:02 by Z_CLU

సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యే సినిమాలపై ప్రేక్షకుల ప్రత్యేక దృష్టి ఉంటుంది.. తెలుగు పండగల్లో పెద్ద పండుగగా భావించే సంక్రాంతికి ప్రతీ ఏడాది మూడు, నాలుగు సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుంది. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. సంక్రాంతి కి రిలీజయిన సినిమా ఆవరేజ్ అనిపించుకుంటే చాలు కలెక్షన్స్ వచ్చేస్తాయి. ఇక హిట్ టాక్ వస్తే బ్లాక్ బస్టర్ రేంజ్ వసూళ్లు పక్కా.. అందుకే సంక్రాంతి సీజన్ పై ఎప్పుడూ కొందరు హీరోలు స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ సినిమాలు రెడీ చేస్తుంటారు. ఈ ఏడాది సంక్రాంతికి పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’, బాలయ్య ‘జై సింహ’, రాజ్ తరుణ్ ‘రంగుల రాట్నం’ సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి. ఇక  వచ్చే సంక్రాంతికి కూడా మూడు సినిమాలు సందడి చేయడానికి రెడీ అయ్యాయి.

 

ప్రతీ ఏడాది లాగే ఈసారి కూడా సంక్రాంతి పోటీలో నిలిచాడు బాలయ్య. ప్రతీ ఏడూ సంక్రాంతికి తన సినిమాతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసే బాలకృష్ణ ఈ సారి తండ్రి తారకరామారావు బయోపిక్ ‘NTR’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. బాలయ్య హీరోగా నటించిన ‘NTR కథానాయకుడు’ జనవరి 9 న రిలీజ్ కానుంది. నందమూరి తారక రామారావు గారి సినిమా కెరీర్ కి సంబదించిన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

బాలయ్య తర్వాత మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు రామ్ చరణ్.. బోయపాటి డైరెక్షన్ లో రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ జనవరి 11న రిలీజ్ కానుంది. లాస్ట్ ఇయర్ రంగస్థలంతో సంక్రాంతి సీజన్ ని మిస్ అయిన చరణ్ ఈ ఏడాది సంక్రాంతి పోటీలో నిలిచాడు. చరణ్ – బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నాడు చరణ్.

ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో థియేటర్స్ లోకి రానున్నారు విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్.. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఫన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ‘F2’జనవరి 12 విడుదల కానుంది. పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత మగాడి లైఫ్ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఫ్యామిలీ & కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా కూడా సంక్రాంతి సీజన్ లో స్పెషల్ గా ఎట్రాక్ట్ చేస్తుంది.

ప్రస్తుతానికి సంక్రాంతికి ఈ మూడు సినిమాలు ఫిక్స్ అయ్యాయి. ఇప్పటికే ప్రమోషన్ కూడా మొదలెట్టేసారు. మరి సంక్రాంతి సీజన్ లో వస్తున్న ఈ మూడు సినిమాలు ఏ రేంజ్ హిట్ సాదిస్తాయో ..చూడాలి.