'ఏబిసిడి' డైరెక్టర్ 'సంజీవ్ రెడ్డి' ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ

Tuesday,May 14,2019 - 04:17 by Z_CLU

టాలీవుడ్ లో ప్రతీ ఏడాది కొందరు కొత్త దర్శకులు మొదటి సినిమాతో సత్తా చాటుతుంటారు. ఈ ఏడాది అలా దర్శకులుగా పరిచయం అవుతున్న వారిలో సంజీవ్ రెడ్డి ఒకడు. అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన ‘ఏబిసిడి’ తో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు సంజీవ్. మే 17న ఈ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతున్న ఈ యంగ్ డైరెక్టర్ ‘జీ సినిమాలు’తో ప్రత్యేకంగా ముచ్చటించాడు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…

ఆయనే ఆదర్శం

చిన్నతనం నుండే సినిమా పట్ల ఆసక్తి ఉండేది. ప్రతీ శుక్రవారం చిత్రలహరిలో పాటలు చూస్తూ మురిసిపోయేవాణ్ణి.  ఒక స్టేజి వచ్చాక చేస్తున్న ఉద్యోగం మానేసి ఇండస్ట్రీలో ఏదో సాదించాలని ఫిక్స్ అయ్యాను. ఆ ప్రయత్నంలో ముందుగా ఒక మేనేజర్ ద్వారా కృష్ణవంశీ గారిని కలిసాను. కొన్ని టెస్టుల అనంతరం కృష్ణ వంశీ గారు ‘మహాత్మ’ కి అసోసియేట్ డైరెక్టర్ గా తీసుకున్నారు. ఆ సినిమా నుండే సినీ ప్రయాణం మొదలైంది. కృష్ణ వంశీ గారితో పనిచేయడం గొప్ప అనుభూతి కలిగించింది. ‘మహాత్మ’ కి వర్క్ చేస్తూ సినిమా గురించి చాలా నేర్చుకున్నాను.  దర్శకుడిగా మణిరత్నం గారే నాకు ఆదర్శం. ఆయన కోసమే సఖి ఎన్నో సార్లు చూసాను.

ఆమె మొదటి గురువు…

కృష్ణవంశీ గారి దగ్గర పనిచేయకముందు చునియా గారి దగ్గర ‘యువ’ అనే సీరియల్ కి వర్క్ చేసాను. ఆ తర్వాత ఆమెతో కలిసి మరో ప్రోగ్రాం చేసాను. ఇండస్ట్రీలో ఆమె నా మొదటి గురువు.

మొదటి ప్రయత్నం

‘మహాత్మ’ తర్వాత  ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్న టైంలో అప్పుడప్పుడే జనాలు ఫేస్బుక్ వాడటం దానితో ఎక్కువగా మమేకం అవ్వడం గమించాను. మరీ ఎక్కువగా వాడటం అందులో వ్యక్తులను నమ్మడం ఎందుకో కరెక్ట్ కాదనిపించింది. ఆ అంశం మీద ఒక స్క్రిప్ట్ రాసుకొని హిందీలో ‘లాగిన్’ అని ఇండిపెండెంట్ సినిమా చేసాను. అది ఇరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు చూసి సినీ మ్యాక్స్ వారితో టైయప్ అయి థియేటర్స్ లో రిలీజ్ చేసారు. ఆ ఇండిపెండెంట్ సినిమాకి మంచి అభినందనలు వచ్చాయి. అప్పుడే మధురా శ్రీదర్ గారు ఫోన్ చేసి తెలుగులో ఈ కథతో సినిమా చేద్దామని అడిగారు. ఆ సినిమా ద్వారానే శ్రీధర్ గారితో పరిచయమయింది.

బాలీవుడ్ లో కమిట్ మెంట్ … అందుకే మిస్ అయ్యా

లాగిన్ తర్వాత హిందీలో ఒక సినిమాకి కమిట్ అయ్యాను. సరిగ్గా అప్పుడే శ్రీధర్ గారు తెలుగులో ‘లాగిన్’ సినిమా చేద్దాం నువ్వు డైరెక్ట్ చేస్తావా..? అని అడిగారు. అప్పుడు టైం లేక ఆ ఛాన్స్ మిస్ అయ్యాను. అలా ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్’ సినిమాకు కథ మాత్రమే అందించగలిగాను. ఆ సినిమాతో నా మిత్రుడు మంజునాథ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమాకు మంచి ప్రశంసలొచ్చాయి.

వర్కౌట్ అవ్వలేదు

‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్’ తర్వాత ‘ఓం మంగళం మంగళం’ అనే రీమేక్ సినిమాకి స్క్రిప్ట్ చేశాం. అసలు ఆ సినిమాతోనే నేను దర్శకుడిగా పరిచయమవ్వాలి. రెడీ టు షూట్ అనే ప్రాసెస్ లో ఎందుకో ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు. ఆ టైంలో డిస్సపాయింట్ అయ్యాను.

ఆ కథతో.. ఈ ఛాన్స్

‘సంతాన ప్రాప్తిరస్తు’ అనే కథ సిద్దం చేసుకొని మధురా శ్రీధర్ గారి ద్వారా అల్లు శిరీష్ గారిని కలిశాను. శిరీష్ గారికి కథ బాగా నచ్చింది. కానీ ఆ క్యారెక్టర్ తనకి సూటవ్వదనే ఉద్దేశ్యంతో వద్దన్నారు. కొన్ని నెలల తర్వాత ఆయనే స్వయంగా ఫోన్ చేసి ‘ABCD’ గురించి చెప్పి ఈ ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత అందరం ఒక టీంగా ఫాం అయి ఈ సినిమా పూర్తి చేశాం.


కత్తి మీద సామే..కానీ

రీమేక్ అనేది ఎప్పుడూ కత్తి మీద సాము లాంటిదే.. కానీ రైటింగ్ మాత్రం ఈజి. రీమేక్ అంటే రైటింగ్ లో పెద్దగా వర్క్ ఉండదని నా ఫీలింగ్. అల్రేడీ ఉన్న కంటెంట్ నే అటు ఇటుగా మారిస్తే స్క్రిప్ట్ రెడీ అయిపోద్ది. కానీ ఒరిజినల్ సినిమాలో ఉన్న సోల్ మిస్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. అదొక్కటి చూసుకుంటే సరిపోద్ది. మర్పులనేవి సహజమే. నేటివిటీకి తగ్గట్టుగా మార్చుకోవాల్సిందే.

జస్ట్ హిట్ అంతే….

మళయాళంలో ‘ABCD’అనేది జస్ట్ హిట్ అంతే.. బ్లాక్ బస్టర్ కాదు. అందుకే అందులో సోల్ మాత్రమే తీసుకొని తెలుగుకి తగ్గట్టుగా చాలా మార్పులు చేసాం. ముఖ్యంగా లవ్ , కామెడీ సీన్స్ క్రియేట్ చేసాం. అదంతా అక్కడ జస్ట్ హిట్ అనిపించుకున్న సినిమాను ఇక్కడ సూపర్ హిట్ చేయడం కోసమే. ఈ సినిమా తర్వాత చూస్తే ఒరిజినల్ చూస్తే  మార్పు తెలుస్తుంది.

శిరీష్ సుపర్బ్

శిరీష్ గారితో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ సూపర్బ్. ఆయన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కూర్చొని మాట్లాడితే బోలెడన్ని విషయాలు తెలుసుకోవచ్చు. నటుడిగా  డైరెక్టర్ చెప్పింది చేసుకుంటూ వెళ్తాడు. ఈ సినిమాలో ఆయన రియల్ లైఫ్ ఎనర్జీ ,జెన్యునిటీ కనిపిస్తాయి.

ఛాయిస్ శిరీష్ గారిదే…

ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరితే బాగుంటుందా అని అనుకుంటుండగా శిరీష్ గారే జుధా సాంధీ ని సజిస్ట్ చేసారు. సాంధీ ఆల్బం విన్నాక నాకు కూడా పర్ఫెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడనిపించింది. మేం ఊహించినట్టే ఫ్రెష్ మ్యూజిక్ తో రిలీజ్ కి ముందే హైప్ తీసుకొచ్చాడు. మెల్ల మెల్లగా సాంగ్ ఊహించని విధంగా 25 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. సాంధీ ని తెలుగుకి పరిచయం చేసిన క్రెడిట్ శిరీష్ గారికే దక్కుతుంది. సాందీ కచ్చితంగా టాలీవుడ్ లో కూడా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు.

కెమిస్ట్రీ అదిరిపోద్ది

సినిమాలో శిరీష్ భరత్  కెమిస్ట్రీ అదిరిపోద్ది.  భరత్ తన కామెడీ టైమింగ్ తో బాగా నవ్విస్తాడు.  భరత్ గురించి ముఖ్యంగా ఒకటి చెప్పాలి. కెమెరా ఆన్ చేయకముందు చాలా సైలెంట్ గా ఉంటాడు. కెమెరా ఆన్ చేయగానే రెచ్చిపోతాడు. ప్రతీ సీన్ ని బాగా అర్థం చేసుకుని చేసే నటుడు. ఈ సినిమాతో మళ్ళీ భరత్ కి మంచి పేరొస్తుంది.

పర్ఫెక్ట్ అనిపించడం ఖాయం

సినిమా కోసం కొంత మంది హీరోయిన్స్ ని అనుకున్నాం. బట్ ఫైనల్ గా ఈ క్యారెక్టర్ కి రుక్సర్ అయితేనే బెటర్ అని ఫీలయ్యి  తనని  తీసుకుకోవడం జరిగింది. సినిమా చూసాక రుక్సర్ క్యారెక్టర్ పర్ఫెక్ట్ అనిపించడం ఖాయం.


పెద్ద రైటర్ అవుతాడు

సినిమాలో ప్రతీ డైలాగ్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. కథకు తగ్గుట్టుగా మంచి డైలాగ్స్ రాసాడు కళ్యాణ్ రాఘవ. కొన్ని సీన్స్ లో వచ్చే ఎమోషనల్ డైలాగ్స్ బాగా హత్తుకుంటాయి. కచ్చితంగా కళ్యాణ్ త్వరలో పెద్ద రైటర్ అవుతాడు.

శ్రీధర్ గారి సపోర్ట్ మరవలేను

శ్రీధర్ గారు నా మీద చూపించిన ప్రేమ , నన్ను ఎంకరేజ్ చేసిన విధానం చూస్తే ఆనందమేస్తుంది. ఆయన సపోర్ట్ మర్చిపోలేను.  ఈ సినిమాను ప్రెజెంట్స్ చేస్తున్న సురేష్ బాబు గారికి, అలాగే నన్ను నమ్మి ఈ సినిమాకు మరో నిర్మాతగా వ్యవహరించిన యష్ రంగినేని గారికి, అలాగే కో ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి స్పెషల్ థాంక్స్.

కాన్ఫిడెంట్ గా ఉన్నా.. రీజన్ అదే

ఈ సినిమాను ఓ భాద్యతగా ఫీలయ్యి చేసాను. మొదటి షో కే సూపర్ హిట్ టాక్ వస్తుందని నమ్ముతున్నా. దానికి రీజన్ కంటెంట్. ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా ఇది. పర్టిక్లర్ గా కామెడీ బాగా ఎంజాయ్ చేస్తారు. అందులో డౌటే లేదు.

నా దృష్టిలో ABCD అంటే

సినిమా మీద పిచ్చితో పని చేసుకుంటూ వెళ్తూ కాస్త ఓపిక పడితే ఎవరైనా డైరెక్టర్ అవొచ్చు. ఎని బడీ కెన్ డైరెక్ట్ అన్నమాట. నా జర్నీలో నేను బాగా గమనించింది తెలుసుకున్నది అదే.

నెక్స్ట్ … డిసైడ్ అవ్వలేదు.

నెక్స్ట్ సినిమా ఏంటనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. మూడు కథలు రెడీగా ఉన్నాయి. ‘ABCD’ట్రైలర్ చూసి నిఖిల్ కాల్ చేసి కలుద్దామని చెప్పాడు.