సంపత్ నంది ఇంటర్వ్యూ

Thursday,July 27,2017 - 05:32 by Z_CLU

గౌతమ్ నంద సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందంటున్నాడు దర్శకుడు సంపత్ నంది. కేవలం కథను నమ్ముకొని, ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమా తీశామని అంటున్నాడు. ఈ మూవీ హైలెట్స్ తో పాటు సినిమాకు సంబంధించిన కొన్ని రూమర్స్ పై క్లారిటీ ఇచ్చాడు సంపత్ నంది.

*ఓ మంచి మనిషి కథ

ఇది కూడా కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమానే. కాకపోతే కంటెంట్ బేస్డ్ కమర్షియల్ సినిమా. ఇదొక మంచి కాన్సెప్ట్ సినిమా. గోపీచంద్ ది ఇందులో డ్యూయల్ రోల్ కాదు.  కేవలం 2 షేడ్స్ మాత్రమే. గౌతమ్ ఘట్టమనేని అనేవాడు గౌతమ్ అనే మంచి మనిషిగా ఎలా మారాడన్నదే స్టోరీ. డబ్బున్నవాడు ఓ మంచి మనిషిగా మారే కథ ఇది.

 

*రచ్చలో చేసిన తప్పు ఇక్కడ చేయలేదు

కమర్షియల్ గా చేసినప్పుడు కథ మిస్ అయిందనే ఫీలింగ్ వచ్చింది. రచ్చ, బెంగాల్ టైగర్ సినిమాల్లో ఆ ఫీలింగ్ కలిగింది. ఓ బలమైన విషయాన్ని, ఫ్లాష్ బ్యాక్ ను గట్టిగా చెప్పలేకపోయానేమో, అందుకే ఆ రెండూ టాప్ ప్లేస్ కు వెళ్లలేకపోయాయని అనిపించింది. అందుకే గౌతమ్ నంద కోసం బలమైన కథ రాసుకున్నాను.

* ఇప్పటికీ అదే ఎనర్జీ

3-4 నెలలు కథపైనే కూర్చున్నాను. నిర్మాతలు భగవాన్, పుల్లారావుకు కథ వినిపించాను. వాళ్ల దగ్గర గోపీచంద్ డేట్స్ ఉన్నాయని చెప్పారు. గోపీచంద్ అయితే తన పాత్రకు బ్రహ్మాండంగా ఉంటుందని వెంటనే ఓకే చెప్పేశా. కథ విన్న గోపీచంద్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్దామని డైరక్ట్ గా అడగడంతో చాలా థ్రిల్ ఫీలయ్యాను. అదే ఎనర్జీని షూటింగ్ చివరి వరకు కొనసాగించాం. ఈ రోజుకి కూడా అదే ఎనర్జీ ఉంది.

* పవన్ స్టయిలిస్ట్ తో గోపీచంద్ లుక్

స్టోరీ రాసుకున్నప్పుడే గౌతమ్ ఘట్టమనేని ఎలా ఉండాలో స్కెచ్ లు వేయించుకున్నాను. 7-8 స్కెచ్ లు రెడీ చేయించాను. అన్నీ తీసుకెళ్లి గోపీచంద్ కు చూపించాను. అన్నీ బాగున్నాయన్నారు. పవన్ కు స్టయిలిస్ట్ గా చేసిన రాము దగ్గరకు వెళ్లి హెయిర్ స్టయిల్ సెట్ చేశాం. కాస్ట్యూమ్ డిజైనర్ భాస్కర్ దగ్గరకెళ్లి కాస్ట్యూమ్స్ ఫిక్స్ చేశాం. అలా 15-20 రోజులు కష్టపడి గోపీచంద్ లుక్ ఫిక్స్ చేశాం. మేం ఫైనల్ చేసిన లుక్ అందరికీ నచ్చింది.

 

*రిచ్ కిడ్ లుక్ కోసం భారీ రీసెర్చ్

గోపీచంద్ రిచ్ లుక్ కోసం చాలా కష్టపడ్డాం. ఫోర్బ్స్ లో చోటుసంపాదించిన ధనవంతుల పిల్లల లిస్ట్ తీశాం. వాళ్ల లైఫ్ స్టయిల్ ఎలా ఉంది, వాళ్ల హాబీస్ ఏంటి, వాళ్ల హెయిర్ స్టయిల్, దుస్తులు ఎలా ఉన్నాయి.. థ్రిల్ కోసం వాళ్లు ఏం చేస్తారు లాంటి అంశాల్ని రీసెర్చ్ చేసి గోపీచంద్ లుక్ తీర్చిదిద్దాం. సినిమాలో గోపీచంద్ కోసం వాడిన దుస్తులు, యాక్ససిరీస్ అన్నీ బ్రాండెడ్.

*ఘట్టమనేని ఇంటిపేరు వెనక రీజన్..

ఘట్టమనేని అనే ఇంటిపేరుకు ఓ గౌరవం ఉంది. సమాజంలో ఆ ఇంటిపేరు ఉన్న వ్యక్తులు గొప్ప స్థానంలో ఉన్నారు. అలాంటి పేరును వాడితే హీరో కూడా ధనవంతుడు, గొప్పోడు అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుందనే నమ్మకంతో ఆ పేరు పెట్టాం. గోపీచంద్ నుంచి ఎలాంటి సినిమా చూడాలని ఫ్యాన్స్ భావిస్తారో వాళ్లంతా హ్యాపీగా ఫీలవుతూనే, కొత్తదనం కూడా ఎంజాయ్ చేస్తారు.

*కుక్క కోసం బెంజ్ కారు

ఈ సినిమాలో ఓ కుక్క ఉంది. దానిది చాలా కీలకమైన పాత్ర. గౌతమ్ కు ఫ్రెండ్ లాంటిది. గౌతమ్ కు ఎదురైన కష్టాల్లో ఆ కుక్క సహాయపడుతుంది. ఆ సన్నివేశాలు తీయడానికి చాలా కష్టపడ్డాం. ఒక్కోసారి కుక్క కోపరేట్ చేయక ఓపిక నశించిపోయేది. 3 రోజులు చేయాలనుకున్న షూటింగ్ కు 6 రోజులు పట్టింది. కుక్క ఎపిసోడ్ కు భారీగానే ఖర్చయింది. షూటింగ్ కు మేమంతా నార్మల్ గా వస్తే, ఈవా అనే కుక్క మాత్రం బెంజ్ లో వచ్చేది.

*చెప్పిన బడ్జెట్ లోనే తీశా

ఈ సినిమా బడ్జెట్ పెరిగిపోయిందనే పుకారులో నిజం లేదు. కథ చెప్పినప్పుడు నిర్మాతలు, హీరోకు ఎంత ఖర్చు చెప్పానో.. అదే బడ్జెట్ లో సినిమాను పూర్తిచేశాను. దుబాయ్ లో చేసిన సాంగ్ గ్రాండ్ గా ఉండడానికి కారణం ముందుగానే పక్కా ప్లానింగ్ తో చేయడమే. అంతే తప్ప ఎక్కడా అనవసరంగా డబ్బు ఖర్చు చేయలేదు.

*హన్సిక, క్యాథరీన్ గురించి..

సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. హీరోకు ఓ స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది హన్సిక పాత్ర. ఓ బంగారం షాపులో చిన్న ఉద్యోగం చేస్తుంటుంది. కానీ చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకే హన్సిక క్యారెక్టర్ కు స్ఫూర్తి అని పేరుపెట్టాం. బాగా డబ్బున్న అమ్మాయిలా కనిపించిన క్యాథరీన్ పాత్రకు ముగ్ద అనే పేరుపెట్టాం. సినిమాకు వీళ్లిద్దరూ కీలకమే. క్యాథరీన్ అయితే తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. దాదాపు 8 గంటల్లో డబ్బింగ్ పూర్తిచేసింది.

 

*పవన్  పిలుపు కోసం వెయిటింగ్…

గౌతమ్ నంద కథను పవన్ కల్యాణ్ కు చెప్పలేదు. అప్పట్లో వచ్చిన వార్తల్లో నిజం లేదు. పవన్ తో సినిమా ఎప్పుడనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేను. పవన్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను రెడీ.

*నా స్టోరీ బ్యాంక్ నాకే నచ్చడం లేదు

నా దగ్గర స్టోరీ బ్యాంక్ ఉంది. కానీ అందులో ఉన్న కథలు నాకే నచ్చడం లేదు. ప్రస్తుతం నా మైండ్ లో ఒకట్రెండు కథలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతానికి ఏ హీరోను అనుకోలేదు. ఓ క్యారెక్టర్ అనుకొని, కథ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు హీరో గురించి ఆలోచిస్తా. కాస్త లేట్ అయినా, నెక్ట్స్ సినిమాకు కూడా మంచి కథ రాసుకుంటాను.