ఈరోజు క్రిస్టియన్ పద్ధతిలో సమంత, చైతూ పెళ్లి

Friday,October 06,2017 - 11:21 by Z_CLU

ప్రేమపక్షులు సమంత, నాగచైతన్య భార్యభర్తలుగా మారారు. గోవాలో వీళ్ల పెళ్లి సింపుల్ అండ్ స్వీట్ గా జరిగింది. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమైన మెహందీ ఫంక్షన్ తో చైతూ-సమంత వివాహ వేడుక షురూ అయింది. వెగ్టార్ బీచ్ లోని W-హోటల్ ఈ జంట పెళ్లికి వేదికగా మారింది. రాత్రి సరిగ్గా 11 గంటల 52 నిమిషాలకు సమంత మెడలో మూడుముళ్లు వేశాడు నాగచైతన్య.

చైతూ-సమంత పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది. కేవలం ఇరువర్గాలకు చెందిన బంధువులు మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. అటు దగ్గుబాటి, ఇటు అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు సమంత ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి దాదాపు 90 మంది ఈ పెళ్లిలో పాల్గొన్నారు.

ఈరోజు కూడా  ఈ జంట మరోసారి పెళ్లి చేసుకోబోతోంది. నిన్న హిందు సంప్రదాయంలో సమంతను వివాహమాడిన చైతూ.. ఈరోజు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకోబోతున్నాడు. గోవాలోని ఓ ప్రముఖ చర్చిలో సాయంత్రం 5.30 నిమిషాల నుంచి 6గంటల 30నిమిషాల మధ్య జరిగే కార్యక్రమంలో క్రిస్టియన్ స్టయిల్ లో రింగులు మార్చుకుంటారు సమంత-చైతూ.

పెళ్లి తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోవడం లేదు ఈ జంట. కేవలం వారం రోజులు మాత్రమే రిలాక్స్ అవుతున్నారు. ఈనెల 15 నుంచి చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమాను స్టార్ట్ చేస్తాడు నాగచైతన్య. అటు సమంత కూడా తన తమిళ, తెలుగు సినిమాలతో బిజీ అయిపోతుంది. పెళ్లి తర్వాత హైదరాబాద్ లో జరగబోయే రిసెప్షన్ తేదీని ప్రకటిస్తారు.