తెలుగులోకి సాయిపల్లవి సైకలాజికల్‌ థ్రిల్లర్‌

Tuesday,July 02,2019 - 11:38 by Z_CLU

మన ప్రేక్షకులకు సాయి పల్లవి తెలుగమ్మాయే. ‘ఫిదా’తో అంతలా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందామె. తొలి చిత్రానికి తెలుగు నేర్చుకోవడమే కాదు… తన పాత్రకు స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకుంది. తెలుగులో గలగలా మాట్లాడుతోంది. తెలుగు ప్రేక్షకుల కోసం సాయిపల్లవి నటించిన సూపర్‌హిట్‌ మలయాళ చిత్రం ‘అథిరన్‌’ను ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్‌ డబ్ చేస్తున్నారు.

సాయి పల్లవి, ఫహాద్‌ ఫాజిల్‌, ప్రకాశ్‌రాజ్‌, అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్‌హిట్‌ మలయాళ సినిమా ‘అథిరన్‌’. వివేక్‌ దర్శకత్వం వహించారు. కొన్ని రోజుల క్రితం మలయాళంలో విడుదలైన ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ భారీ విజయం సాధించింది. ఈ చిత్రాన్ని జయంత్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై తెలుగులో అనువదిస్తున్నారు.

కేరళలో 1970లలో వాస్తవంగా జరిగిన ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. ప్రస్తుతం ‘సాహో’కి నేపథ్య సంగీతం అందిస్తున్న జిబ్రాన్‌ ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్టు చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నారు. త్వరలోనే తెలుగు టైటిల్‌
ప్రకటిస్తారు.