రిషి కపూర్ ఇక లేరు

Thursday,April 30,2020 - 12:36 by Z_CLU

బాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరైన రిషి కపూర్ కన్నుమూశారు. కొంత కాలంగా కాన్సర్ తో బాధపడుతున్న రిషి కపూర్ రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను ముంబయిలోని హాస్పిటల్ కు తరలించారు. ఈరోజు ఉదయం రిషి కపూర్ మరణించారు.

రాజ్ కపూర్ నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు రిషికపూర్. రాజ్ కపూర్ కొడుకుగా, పృధ్విరాజ్ కపూర్ మనవడిగా రిషి కపూర్ కు ఎంట్రీ ఈజీగానే లభించింది. అయితే తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకోవడానికి రిషి చాలా కష్టపడ్డారు. అలా ఆయన తిరుగులేని రొమాంటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.

తన కెరీర్ లో సోలో హీరోగా 51 సినిమాలు చేశారు రిషి కపూర్. వీటిలో బాబి, నాగిన, చాందిని, కర్జ్, ప్రేమ్ రోగ్ లాంటి సూపర్ హిట్ సినిమాలున్నాయి. సోలో హీరోగా సక్సెస్ ఫుల్ గా ఉన్న టైమ్ లోనే మల్టీస్టారర్ సినిమాల్లో కూడా నటించారు. అలా కూడా హిట్స్ కొట్టారు. 2000 నుంచి రిషి కపూర్ కెరీర్ కొత్త టర్న్ తీసుకుంది. ఆయన హీరో స్థాయి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. ఇక అప్పట్నుంచి ఆయన కెరీర్ మరింత ఊపందుకుంది. దాదాపు పదేళ్ల పాటు బాలీవుడ్ లో హిట్టయిన ప్రతి సినిమాలో ఆయన ఉన్నారు. ఒక దశలో తమ సినిమాలో రిషి కపూర్ ఉంటే సినిమా సూపర్ హిట్టనే సెంటిమెంట్ కూడా బలపడింది.

తనతో 15 సినిమాల్లో కలిసి నటించిన నీతూ సింగ్ ను పెళ్లాడారు రిషికపూర్. వీళ్లకు ఇద్దరు పిల్లలు. కూతురు రిద్దిమా కపూర్ డిజైనర్ గా స్థిరపడగా, కొడుకు రణబీర్ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు.

2018లో రిషికపూర్ లో కాన్సర్ లక్షణాలు బయటపడ్డాయి. వెంటనే ఆయన అమెరికా వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకున్నారు. కాన్సర్ నుంచి కోలుకొని గతేడాది ఇండియా తిరిగొచ్చారు. అప్పట్నుంచి ఆరోగ్యంగానే ఉన్నారు. గతేడాది డిసెంబర్ లో ది బాడీ అనే సినిమా కూడా చేశారు. మరో సినిమా కూడా ఎనౌన్స్ చేశారు. అంతలోనే ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు.