మాస్ రాజా సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Friday,May 22,2020 - 03:36 by Z_CLU

మాస్ మహారాజా రవితేజ హీరోగా “ఏ స్టూడియోస్” పతాకంపై హవీష్ ప్రొడక్షన్‌లో ఒక చిత్రాన్ని నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు ప్ర‌ముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ స్ప‌ష్టం చేశారు. ఈ చిత్రానికి ‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలతో కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందించనున్నారు.

క‌రోనా వ్యాప్తి నిరోధంలో భాగంగా లాక్‌డౌన్ అమ‌ల్లోకి రావ‌డంతో దానికి సంబంధించిన ప‌నులు ఆగిపోయాయి. లాక్‌డౌన్ ముగిసి, సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్న వెంట‌నే గ్రాండ్‌గా సినిమాని లాంచ్ చేస్తామ‌ని నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ తెలిపారు.

సినిమా గురించి సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న గాసిప్స్ న‌మ్మ‌వ‌ద్ద‌ని ఆయ‌న తెలిపారు. బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ హీరోగా నిర్మించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘రాక్ష‌సుడు’ త‌ర్వాత ఒక చ‌క్క‌ని స్క్రిప్టుతో ర‌వితేజ‌, ర‌మేష్ వ‌ర్మ క‌ల‌యిక‌లో సినిమా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు.

భారీ బ‌డ్జెట్‌తో, ఉన్న‌త స్థాయి సాంకేతిక విలువ‌ల‌తో నిర్మాణం కానున్న ఈ సినిమాకు పేరుపొందిన టెక్నీషియ‌న్లు ప‌నిచేయ‌బోతున్నారు. ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్ల వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.