భ్రమరాంబ వెడ్స్ శివ...'రారండోయ్ వేడుక' చూద్దాం

Thursday,April 20,2017 - 01:15 by Z_CLU

నాగచైతన్య, రకుల్ ప్రీత్ జంటగా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా ‘రారండోయ్ వేడుక చూద్దాం’. దాదాపు 70శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నఈ సినిమాను ఈ నెలాఖరుకు పూర్తిచేయబోతున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమాలో హీరోహీరోయిన్ల క్యారెక్టర్లు ఏంటనేది తెలిశాయి.

చైతు,రకుల్ క్యారెక్టర్స్ అనౌన్స్ చేశారు యూనిట్. సినిమాలో చైతూ క్యారెక్టర్ పేరు శివ. ఒకప్పుడు కింగ్ నాగార్జున నటించిన ట్రెండ్ సెట్ మూవీ శివ. ఆ టైటిల్ నే ఈ సినిమాలో తన పేరుగా పెట్టుకున్నాడు నాగచైతన్య. నాగార్జున నటించిన ఎవర్ గ్రీన్ హిట్ మూవీ “నిన్నే పెళ్లాడతా” తరహాలో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే ప్రకటించింది యూనిట్. ఇప్పుడు చైతూ క్యారెక్టర్ నేమ్ తో ఈ సినిమాకు “శివ” కనెక్షన్ కూడా యాడ్ అయింది.

ఇక రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో రకుల్ ప్రీత్ పాత్ర పేరు భ్రమరాంబ. అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా రకుల్ ఈ సినిమాలో మెరవనుంది. రకుల్ ఎప్పీయరెన్స్ తో పాటు చైతూ-రకుల్ మధ్య వచ్చే లవ్ సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. సోగ్గాడే చిన్ని నాయనా లాంటి గ్రాండ్ హిట్ తర్వాత కల్యాణ్ కృష్ణ డైరక్ట్ చేస్తున్న మూవీ ఇది.

అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై కింగ్ నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మూవీలో చైతూ-రకుల్ మధ్య చిగురించిన ప్రేమ… ఆ ప్రేమ నుంచి పెళ్లి వరకు జరిగే వేడుక ఆడియన్స్ ను ఫుల్ లెంగ్త్ లో ఎంటర్ టైన్ చేస్తుందంటున్నారు నాగ్. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు అదిరిపోయే ట్యూన్స్ అందించాడు. త్వరలోనే ఆడియోను గ్రాండ్ గా రిలీజ్ చేసి, వచ్చేనెల మూడో వారంలో సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.