రానా నటించిన 'అరణ్య' స్టోరీలైన్ ఇదే!

Tuesday,February 11,2020 - 12:30 by Z_CLU

రానా హీరోగా నటిస్తున్న త్రిభాషా చిత్రానికి అడవి రాముడు అనే టైటిల్ చాన్నాళ్లుగా ప్రచారంలో ఉంది. అయితే ఇప్పుడీ సినిమా టైటిల్ మారింది. అరణ్య అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళ్ లో ‘కాండన్’‌, తెలుగులో ‘అరణ్య’ టైటిల్ ఫిక్స్ చేశారు.

మావటివాడు, ఏనుగుకి మధ్య ఉన్న అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా అరణ్య. కజిరంగ, అస్సోమ్‌ ప్రాంతాల్లోని ఏనుగులు నివసించే ప్రాంతాలను కూడా మనుషులు ఆక్రమించుకుంటున్నారు. దీని వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనే యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అడవిలోనే ఉండే ఓ వ్యక్తి.. తన అడవితో పాటు జంతువుల సంరక్షణ కోసం ఏం చేశాడనేదే ఈ సినిమా స్టోరీ.

జంతు ప్రేమికుడు, జాతీయ అవార్డ్‌ గ్రహీత ప్రభు సాల్మన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘లైఫ్‌ ఆఫ్‌ పై’, ‘థోర్‌’, ‘బై మోక్ష్‌ బక్షి’ వంటి చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ప్రాణ స్టూడియో ఈ సినిమాకు గ్రాఫిక్స్ చేస్తుంది. ‘త్రీ ఇడియట్స్’‌, ‘పీకే’, ‘పింక్‌’, ‘వజీర్‌’ చిత్రాలకు సంగీతాన్ని అందించిన శాంతను మోయిత్ర ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆస్కార్‌ అవార్డ్‌ విజేత రసూల్‌ పూకుట్టి ఈ చిత్రానికి సౌండ్‌ డిజైనర్.