ప్రతి మేకోవర్ ప్రత్యేకమే.. చెర్రీ బర్త్ డే స్పెషల్

Friday,March 27,2020 - 10:30 by Z_CLU

చిరంజీవి నటవారసుడిగా పరిశ్రమకొచ్చిన రామ్ చరణ్.. యాక్టింగ్, డాన్స్ విషయంలో తండ్రికి తగ్గ తనయుడుఅనిపించుకున్నాడు. సిసలైన మెగాపవర్ స్టార్ గా నిలిచాడు. అయితే అక్కడితో ఆగిపోలేదు చరణ్. కేవలం యాక్టింగ్ లోనే కాకుండా, ఇంకాస్త కొత్తదనం చూపించాలని ప్రయత్నించాడు. కథల ఎంపికతో పాటు లుక్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాడు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చెర్రీ నుంచి వచ్చిన కొన్ని సంథింగ్ స్పెషల్ మేకోవర్స్ ఇప్పుడు చూద్దాం…

 

తన రెండో సినిమాకే అదిరిపోయే మేకోవర్ చూపించాడు రామ్ చరణ్. కాలభైరవ పాత్రలో రామ్ చరణ్ యాక్టింగ్ను ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేరు. అందులో చరణ్ యాక్టింగ్ ఓ ఎత్తైతే, కాలభైరవ పాత్ర కోసం అతడు పడిన కష్టం మరో ఎత్తు. పెర్ ఫెక్ట్ లుక్ కోసం అప్పట్లో దాదాపు 6 నెలలు శ్రమించాడు మెగాపవర్ స్టార్.

‘మగధీర’ లాంటి చరిత్ర సృష్టించిన సినిమా తర్వాత ‘ఆరెంజ్’ మూవీ చేశాడు చరణ్. ఈ సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే ఇందులో చరణ్ లుక్స్ కు మంచి పేరొచ్చింది. మోడ్రన్ అబ్బాయిగా, లవర్ బాయ్ గా చరణ్ ఇందులో మోస్ట్ ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు. ‘ఆరెంజ్’ సినిమా తర్వాత చరణ్ చాలా సినిమాలు చేశాడు. కానీ ఇప్పటికీ ఆరెంజ్ లో రామ్ అంటేనే చాలా మంది అమ్మాయిలకు ఇష్టం. అదీ ఆ మేకోవర్ స్పెషాలిటీ.

 

చరణ్ మేకోవర్స్ విషయంలో ధృవ సినిమాను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఐపీఎస్ ఆఫీసర్ గా నటించాడు ఇందులో. కావాలనుకుంటే పైపైన మేనేజ్ చేసేయొచ్చు. కానీ చరణ్ మాత్రం ఒప్పుకోలేదు. అచ్చమైన పోలీసాఫీసర్ లా తయారయ్యాడు. ఏకంగా సిక్స్ ప్యాక్ సాధించాడు. ఫిజిక్ పరంగా రామ్ చరణ్ బెస్ట్ లుక్ ను ఈ సినిమాలో చూడొచ్చు.

 

అప్పటివరకు రామ్ చరణ్ మేకోవర్స్ అన్నీ ఒకెత్తు. రంగస్థలంలో చరణ్ మేకోవర్ మరో ఎత్తు. చూడ్డానికి చాలా సాదాసీదాగా కనిపిస్తుంది రంగస్థలంలో సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబు లుక్. కానీ అదే సినిమాకు పెద్ద హైలెట్ అయింది. అంత గుబురు గడ్డంలో అప్పటివరకు చరణ్ ను ఎవరూ చూడలేదు. ఈ విషయాన్ని ఓ సందర్భంలో స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావించారంటే, రంగస్థలంలో చరణ్ మేకోవర్ ఏ రేంజ్ లో క్లిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 

ఇలా కథ, క్యారెక్టర్ కు తగ్గట్టు ఎప్పటికప్పుడు మేకోవర్ అవుతున్న మెగాపవర్ స్టార్ ఈసారి ఆర్-ఆర్-ఆర్ లో మరింత కొత్తగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో యంగ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నాడు చెర్రీ. యంగేజ్ లో సీతారామరాజు ఎలా ఉంటాడనేది ఎవరికీ తెలీదు. కాబట్టి చరణ్ ను కొత్తగా చూపించడానికి రాజమౌళికి బోలెడంత స్కోప్ దొరికింది. సో… మెగాపవర్ స్టార్ నుంచి మరో హాట్ మేకోవర్ రాబోతోంది. గెట్ రెడీ.