నా నిర్మాతల్లో నంబర్ వన్ నిర్మాత చరణ్

Monday,September 30,2019 - 01:54 by Z_CLU

కెరీర్ లో 151 సినిమాలు చేశారు. ఎంతోమంది నిర్మాతలతో సినిమాలు చేశారు. వాళ్లలో నంబర్ వన్ ఎవరని అడిగితే మాత్రం సైరా నిర్మాత రామ్ చరణ్ పేరు చెబుతున్నారు మెగాస్టార్. సైరా లాంటి భారీ బడ్జెట్ సినిమా తీయాలంటే గట్స్ ఉండాలని, అందుకే తన దృష్టిలో రామ్ చరణే నంబర్ వన్ ప్రొడ్యూసర్ అని అన్నారు.

“రామ్ చరణ్ ను చూసి గర్వపడుతున్నాను. నా 41 ఏళ్ల కెరీర్ లో ఎంతో మంది నిర్మాతలున్నారు. వాళ్లందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ 300 కోట్ల బడ్జెట్ ఉన్న సైరా సినిమాను నేను చేస్తానంటూ ముందుకొచ్చి, నా కలను నెరవేర్చాడు నా బిడ్డ రామ్ చరణ్. నా నిర్మాతల్లో నంబర్ వన్ నిర్మాత చరణ్. ఇలాంటి సినిమా చేయాలని, ఇలాంటి పాత్ర పోషించాలనేది నా కల. నా జీవితాశయం. నా డ్రీమ్ ను రామ్ చరణ్ నెరవేర్చాడు.”

బెంగళూరులో సైరా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన మెగాస్టార్, ఇలా తన కెరీర్ లో బెస్ట్ నిర్మాత ఎవరనే విషయాన్ని బయటపెట్టారు. ఎంత డబ్బు పెట్టినా తిరిగి రిటర్న్స్ వచ్చే పరిస్థితులు ఇప్పుడున్నాయని, అందుకే పుష్కరం కిందట అనుకున్న సైరాను ఇప్పుడు తెరపైకి తెచ్చామన్నారు.

“12 ఏళ్ల కిందటే సైరాను తెరపైకి తీసుకురావాలనుకున్నాను. ఆ రోజుల్లోనే బడ్జెట్ 80 కోట్లు అంచనా వేశారు. అప్పట్లో నా మార్కెట్ 30-40 కోట్లు ఉండేది. అంత బడ్జెట్ ను మార్కెట్ సపోర్ట్ చేయలేదు. అలాగని కాంప్రమైజ్ చేసి చిన్న సినిమాగా చేయడం నాకిష్టంలేదు. ఇప్పుడు ఆ పరిస్థితులు వచ్చాయి. మంచి కథ మీద ఎంత పెట్టుబడి పెట్టినా తిరిగి రాబట్టగలమనే నమ్మకం వచ్చింది. నా నమ్మకానికి చరణ్ భరోసా ఇచ్చాడు. సైరా ఓ విజువల్ వండర్ గా వచ్చింది.”

ఈ సినిమా స్క్రీన్ ప్లే కోసం సురేందర్ రెడ్డి చాలా కష్టపడ్డాడని… నెల రోజులు కష్టపడి పక్కా స్క్రీన్ ప్లేతో వచ్చాడని.. సురేందర్ రెడ్డి చెప్పిన స్క్రీన్ ప్లే విన్న తర్వాత ఇక ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సినిమాను స్టార్ట్ చేశామన్నారు చిరు.