'రామకృష్ణ -మౌనిక' ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Sunday,March 04,2018 - 10:10 by Z_CLU

‘రంగ‌స్థ‌లం’ ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ సినిమాలో 1980 ఎట్మాస్ ఫియర్ ఎలా చూపిస్తారు.? అసలు ఆర్ట్ డైరెక్టర్ ఎవరై ఉంటారు..? అనే సందేహాలు కలిగాయి. కట్ చేస్తే ఈ సినిమా కోసం ఓ పల్లెటూరి సెట్ వేశారు. ఆ సెట్ తో అందరి ప్రశంసలు అందుకున్నారు ఆర్ట్ డైరెక్టర్స్ రామ కృష్ణ సబ్బాని, మౌనిక నిగోత్రే సబ్బాని. ఆ మధ్య సెట్ లో ఉండే కొన్ని అలనాటి వస్తువులను అలాగే ఆర్ట్ వర్క్ కి సంబందించిన ఫోటోలను రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడం సినిమాలో ఆర్ట్ వర్క్ కి ఉన్న ప్రాధాన్యం తెలియజేశాయి. ప్రస్తుతం తమ వర్క్ తో 80’స్ లోకి తీసుకెళ్లి ఆ జ్ఞాపకాలను నెమరువేస్తూ సినిమాకు హైలైట్ గా నిలవబోతున్న ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ- మౌనిక గారితో ‘జీ సినిమాలు’ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ .  ‘రంగస్థలం’ సెట్  గురించి  వారి మాటల్లోనే…

హైదరాబాదినే…

పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే..  బి.ఎఫ్.ఎ పెయింటింగ్ ఇక్కడే చేశాను. తర్వాత పూణే వెళ్లి అక్కడ ఎఫ్,టి.ఐ లో  ప్రొడక్షన్ డిజైనింగ్ & ఆర్ట్ డైరెక్షన్  కోర్స్ పూర్తి చేశాను. అది పూర్తయ్యాక సబు సిరిల్ , సమీర్ చంద్ర గారి దగ్గర ఆర్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేశాను. తర్వాత సొంతంగా కొన్ని యాడ్స్ చేశాను. అప్పుడే బాలీవుడ్ లో అవకాశం వచ్చింది. హిందీలో రెండు సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశాను. అలా ఆ రెండు సినిమాలు చేశాక హను పరిచయం అయ్యాడు. ఒక స్క్రిప్ట్ చెప్పి షూటింగ్ ఆల్మోస్ట్ ముంబైలో ఉంటుందని చెప్పాడు. ఎందుకో ఆ సినిమా కుదరలేదు. ఆ తర్వాత ఓ సారి ఓ సినిమా చేస్తున్నానని ఈ సినిమాకు మీరే ఆర్ట్ డైరెక్టర్ అని చెప్పాడు. తనతో పనిచేయడం ఎగ్జైట్మెంట్ అనిపించడంతో వెంటనే ఓకే చెప్పాను. ఆర్ట్ డైరెక్టర్స్ గా తెలుగులో మా మొదటి సినిమా ‘అందాల రాక్షసి’. ఆ సినిమాకు గాను మేము చేసిన వర్క్ కి చాలా ప్రశంశలొచ్చాయి. ముఖ్యంగా బాటిల్స్ తో అమ్మాయి రూపం చూపించిన విధానం అందరికీ కొత్తగా నిపించింది.

గుర్తింపు ఆలస్యం… కాని సంతోషమే

తెలుగులో ఆర్ట్ డైరెక్టర్స్ పనిచేసిన మొదటి సినిమా ‘అందాల రాక్షసి’ సినిమాకు   నంది అవార్డు వచ్చింది. కాని అది కాస్త ఆలస్యంగా అందింది.   మా ఆర్ట్ వర్క్ ని గుర్తించి అప్పటి గవర్న్ మెంట్ నంది అవార్డు అందించడం చాలా సంతోషం కలిగించింది. అవార్డనేది టెక్నిషియన్స్ కి ఎంతో ప్రోత్సాహిన్నిస్తుంది. ఆ ప్రోత్సాహం ఎప్పటికీ మరవలేనిది.

అదే పెద్ద అవార్డు

‘సాహసం’ సినిమాలో ఆర్ట్ వర్క్ బాగుందని.. చాలా మంది అభినందించారు. రివ్యూస్ లో కూడా ఆర్ట్ వర్క్ గురించి ప్రత్యేకంగా రాశారు. ఈ సినిమాకు మీకు అవార్డులొస్తాయి అంటూ టీంలో చాలా మంది అంటుండేవారు. కాని ఆ సినిమాకు గాను గ్రాఫిక్స్ కి అవార్డు వచ్చింది. గ్రాఫిక్సో.. ఆర్ట్ వర్కో తెలియనంతగా మా వర్క్ ఉందని ఆనందపడ్డాము. ఆ సినిమాకు గానూ  అభినందనలు ఎన్నో ప్రశంసలు అందుకున్నాం. అదే మాకు పెద్ద అవార్డు.

సుకుమార్ గారితో పరిచయం

‘జ్యో అచ్యుతానంద’ సినిమాలో మేం చేసిన ఆర్ట్ వర్క్ సుకుమార్ గారికి బాగా నచ్చింది.  ఆయన ప్రత్యేకంగా పిలిచి అభినందించారు. అసలు ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకే ఆయనతో పనిచేయాలి. కాని  ఆ టైంలో మేం  అందుబాటులో లేకపోవడంతో ఆ సినిమా చేయలేకపోయాం. ఇప్పుడు ‘రంగస్థలం’ వల్ల ఎట్టకేలకి ఆయనతో కలిసి పనిచేసే ఛాన్స్ వచ్చింది.

‘రంగ‌స్థ‌లం’ స్పెషల్  ఫిలిం 

‘రంగస్థలం’ గురించి సుకుమార్ గారు  చెప్పినప్పుడే మాకిది స్పెషల్ ఫిలిం అవుతుందనుకున్నాం. 1985 లో జరిగే కథతో తెరకెక్కే సినిమా అనగానే ఛాలెంజింగ్ గా అనిపించింది. నిజానికి సినిమా పల్లెటూరిలోనే తీద్దామనుకున్నారు. కాని చరణ్ లాంటి స్టార్ హీరో , సమంత లాంటి హీరోయిన్ తో అక్కడ షూట్ చేయడం కాస్త కష్టమనిపించింది. అక్కడ ప్రేక్షకులను కంట్రోల్ చేయలేకపోవడం వల్లే హైదరాబాద్ లో ఆ ఊరి సెట్ వేయాల్సి వచ్చింది.

రీసెర్చ్ అవసరం 

ఈ సినిమాకోసం చాలా రీసెర్చ్ చేశాం. అప్పట్లో ఎలాంటి డ్రింక్స్ తాగేవారు.. ఎలాంటి వస్తువులు వాడేవారు..అప్పటి ఇల్లు, వాకిలి ఎలా ఉండేవి.. ఇంటి కోసం ఎలాంటి మెటీరియల్స్ వాడేవారు. లాంటివి ఎన్నో రీసెర్చ్ ద్వారా తెలుసుకున్నాం. ఆ రీసెర్చ్ లో భాగంగా ఎన్నో పల్లెటూర్లు సందర్శించాం. అప్పటి కట్టడాలు.. చాలా అరుదుగా కనిపించాయి. 80 లో ఇళ్ళ నిర్మాణాలు వేరేలా ఉండేవి. ఇప్పుడు వాటిని కూల్చేసి కొత్త రీతిలో ఇళ్ళు కట్టుకుంటున్నారు. చివరికి వెతికి.. వెతికి కొన్ని ఇల్లులు చూడగలిగాం. ఈ సినిమా వల్ల తరువాత చూడలేని ఎన్నో వస్తువులు, ప్రదేశాలు చూడగలిగాం అది మా అదృష్టం. నిజానికి ఇలాంటి సినిమాలకు రీసెర్చ్ చాలా అవసరం. ఇప్పటి వస్తువులను చూపిస్తూ అప్పటి వస్తువులంటూ ప్రేక్షకులను మోసం చేయలేం. ఆ రీసెర్చ్ వల్లే సెట్ ఇంత బాగా వేయగాలిగాం. కొన్నేళ్ళ తర్వాత అప్పటి పల్లెటూరు చూడాలంటే ‘రంగస్థలం’ సినిమా చూడాల్సిందే.

 

పల్లెటూరు చూసిందే లేదు

నిజానికి నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే.. చదువు కోసం కొన్నేళ్ళు పూణేలో మరికొన్నేళ్ళు ముంబైలో ఉన్నాను.  నా భార్య కూడా అంతే.. తను కూడా ఇప్పటి వరకూ పల్లెటూరి చూసింది లేదు.  ఇద్దరికీ పల్లెటూరి గురించి ఏమి తెలియదు. మొదటి సారిగా ఈ సినిమా కోసమే రాజమండ్రి సమీపంలో ఉన్న పల్లెటూర్లకు వెళ్ళాం.  నిజానికి పల్లెటూరు ఎలా ఉంటుందో అక్కడ  అట్మాస్ ఫియర్ ఎలా ఉంటుందో తెలియకపోయినా మామీద ఉన్న నమ్మకంతో మాకీ అవకాశం అందించారు దర్శకుడు సుకుమార్ గారు మా నిర్మాతలు. ఈ సందర్భంగా వారికి మా స్పెషల్ థాంక్స్.

ఏమి లేని ప్రదేశంలో

‘రంగస్థలం’ కోసం భూత్ బంగ్లా లో పల్లె టూరి సెట్ వేయలనుకున్నాం. తీరా చూస్తే ఆ ప్రదేశంలో కేవలం మూడు నాలుగు చెట్లు తప్ప ఇంకేమి లేవు. అలా చెట్లు కూడా లేని  ప్రదేశంలో ఓ అందమైన పల్లెని ఆ వాతావరణాన్ని తీర్చిదిద్దడం కాస్త కష్టమనిపించింది. ముఖ్యంగా చెట్లను కూడా క్రియేట్ చేయాల్సి వచ్చింది. అవి ఒరిజినల్ చెట్లు కాదని పట్టుకున్నా తెలియకుండా వాటిని క్రియేట్ చేశాం. అది మాకు పెద్ద చాలెంజింగ్ అనిపించింది.  కొన్ని పల్లెటూర్ల లో కొందరి దగ్గర నుంచి  అలనాటి కొన్ని అమూల్యమైన వస్తువులు సేకరించాం.  నిజానికి ఆ విషయంలో మా నిర్మాత సహకరం మరవలేనిది. మాకు కావాల్సిందల్లా  అందించి సెట్ ఇంత బాగా రావడానికి కారకులైయ్యారు.

రెండు నెలల్లోనే…

రెండు నెలల్లో సెట్ పూర్తి చేశాం. దాదాపు 300 నుంచి 500 మంది వరకూ రాత్రి పగలు సెట్ కోసం పనిచేశారు. సెట్ వేసిన కొన్ని రోజులకే వర్షాలు పడ్డాయి.  వర్షం వల్ల పాడైన కొన్నిటిని మళ్ళీ రీ క్రియేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా అసిస్టెంట్స్  మధు – కిరణ్ మాతో పాటు చాలా కష్టపడ్డారు. వారితో పాటు ఆర్ట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన ప్రతీ ఒక్కరికి థాంక్స్ .

చరణ్ మెస్మరైజ్ అయ్యాడు 

మొదటి రోజు చరణ్ సెట్ చూడగానే మెస్మరైజ్ అయ్యాడు. తనకి సెట్ చాలా నచ్చింది. అందుకే  ఆర్ట్ వర్క్ కి సంబంధించి ప్రత్యేకంగా కొన్నిఫొటోస్ తీసి అప్పుడప్పుడూ ఫేస్బుక్ లో పెట్టేవాడు. చరణ్ సెట్ చూసిన రోజే ప్రత్యేకంగా అభినందించారు.

వాళ్ళ ప్రశంసలు మర్చిపోలేం

ఈ సినిమా షూట్ చూడ్డానికొచ్చిన ప్రతీ ఒక్కరూ సెట్ చూసి మాతో మాట్లాడి వెళ్ళే వారు.  ముఖ్యంగా మెగా స్టార్ చిరంజీవి గారు రాజమౌళి గారు సెట్ చూసి అభినందించడం ఎంతో సంతోషాన్నిచ్చింది.  ‘చరణ్ రోజూ సెట్ గురించి చెప్తున్నాడు అదిరిపోయింది.. గుడ్ వర్క్..’ అని చిరంజీవి గారు ప్రశంసించారు.  రాజమౌళి గారికి కూడా సెట్ బాగా నచ్చింది ఆయన కొన్ని వస్తువులతో ప్రత్యేకంగా ఫోటోలు కూడా దిగి మరీ సంతోషించారు. ఇలా ఒక్కొక్కరూ సెట్ గురించి చెప్తూ అభినందిస్తుంటే చెప్పలేనంత సంతోషం కలిగేది.

ఆ సందర్భంలో కాస్త భాధ కలిగేది.

నిజానికి ‘అందాల రాక్షసి’, ‘సాహసం’ సినిమాలలో ఆర్ట్ వర్క్ చూసి చాలా మంది ఆ సినిమాలకు పనిచేసింది బాలీవుడ్, కోలీవుడ్ టెక్నీషియన్స్ అనుకున్నారు. కాని ఆ సినిమాలకు పనిచేసింది తెలుగోడని తెలిశాక షాక్ అయ్యారు. కొన్ని సందర్భాల్లో మన తెలుగులో మంచి టెక్నీషియన్స్ ఉండరు అనేలా ఉండే మాటలు కాస్త భాధ కలిగించేవి. కాని ఇప్పుడిప్పుడు మన తెలుగులో కూడా మంచి టెక్నీషియన్స్ ఉన్నారని మిగతా వారితో పాటు మన వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. అందుకు సంతోషం.

మిగతా వారి గురించి పట్టించుకోరు

అప్పుడప్పుడూ కొన్ని సినిమాల రివ్యూస్ చదువుతుంటాం.  డైరెక్టర్..మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటింగ్ అంత వరకే అక్కడితో ఆపేస్తారు. మిగతా టెక్నిషియన్స్ గురించి పట్టించుకోరు. కాని సినిమాకు పనిచేసిన ప్రతీ టెక్నీషియన్ గురించి ప్రేక్షకులకు తెలియజేయాలన్నది నా ఉద్దేశ్యం. కొన్ని సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ ఎవరో కూడా ప్రేక్షకులకు తెలియదు. ఏదో పెద్ద సినిమా చేస్తేనే తప్ప టెక్నీషియన్స్ ను పట్టించుకోరు. ఇప్పుడు కాస్త మార్పు వస్తుంది. సోషల్ మీడియా ద్వారా టెక్నిషియన్స్ గురించి వాళ్ళ వర్క్ గురించి ప్రేక్షకులు స్వయంగా తెలుసుకుంటున్నారు.  కేవలం ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించే కాదు. అన్ని డిపార్ట్ మెంట్స్ గురించి ప్రేక్షకులకు తెలియజేయమని వారి వర్క్ బాగుంటే కాస్త ప్రోత్సహించాలని ఒక టెక్నిషియన్ గా  విజ్ఞప్తి చేస్తున్నాం.

చేసింది 50 శాతమే .

నిజానికి ఇప్పటి వరకూ మేము 100 శాతం పని చేయలేదు..కేవలం 50 శాతం మాత్రమే వర్క్ చేశామంతే. నిజానికి ఆర్టిస్ట్ అనే వాడికి ఎంత చేసిన తనివితీరదు. అదొక సముద్రం లాంటిది. ఇంకా ఎంతో పనిచేయాలి.. ఎన్నో నేర్చుకోవాలి అనిపిస్తుంటుంది. ఫ్యూచర్ లో 100 %  వర్క్ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాం.

అక్కడే ఉండిపోతున్నారు 

కొందరు ఆర్ట్ వర్క్ , ప్రొడక్షన్ డిజైనింగ్ నేర్చుకొని కేవలం వాళ్ళిచ్చే జీతం కోసం సాఫ్ట్ వేర్ ఆఫీస్ లోనే ఉండిపోతున్నారు. నిజానికి గదిలో బందిస్తే మన క్రియేటివిటీ అనేది బయటికి రావడానికి స్కోప్ ఉండదు. మన టాలెంట్ ని ఎక్స్పోజ్ చేసుకోవాలి. జే.ఎన్.టి.యు నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా సాఫ్ట్ వేర్ కంపెనీల్లో సెటిల్ అయిపోతున్నారు. కాని బయటికొచ్చి తమ టాలెంట్ నిరూపించుకోవాలి. సినిమాల్లోకి రావడం ఒకప్పుడు కష్టం..ఇప్పుడు టాలెంట్ ఉంటే అవకాశాలొస్తున్నాయి. నెక్స్ట్ జేనేరేషన్ వాళ్ళు కూడా టెక్నిషియన్స్  గా మారాలి. మన తెలుగు వాళ్ళలో కూడా గొప్ప టాలెంట్ ఉందని నిరూపించాలి.

చేసిన సినిమాలు తక్కువే… రీజన్ అదే 

ఇప్పటి వరకూ ‘అందాల రాక్షసి’,’దళం’,’సాహసం’, ‘కేరింత’,’సుబ్రమణ్యం ఫర్ సెల్’,’భలే మంచి రోజు’,’జ్యో అచ్యుతానంద’,’యుద్ధం శరణం’,’ఆనందో బ్రహ్మ’ సినిమాలలతో పాటు మరికొన్ని సినిమాలకు పనిచేశాము. మేము బెస్ట్ ఇవ్వగలిగే సినిమాలే సెలెక్ట్ చేసుకుంటూ ఆర్ట్ వర్క్ కి స్కోప్ ఉన్న సినిమాలు చేస్తూ వచ్చాము. ఇకపై కూడా అలాంటి సినిమాలే చేయాలనుకుంటున్నాం.  అలా సెలెక్ట్ చేసుకొని చేశాం కాబట్టే మా కౌంట్ లో తక్కువ సినిమాలుంటాయి. లేదంటే కనీసం ఇప్పటి వరకూ ఓ 30 సినిమాలుండేవి.

‘ఎన్.టి.ఆర్’ బయోపిక్ కోసం భారీ సెట్స్ 

‘రంగస్థలం’ తర్వాత మళ్ళీ మాకు మరో ఛాలెంజింగ్ సినిమా ‘ఎన్.టి.ఆర్’.. ఆ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి అంటే 1920 అట్మాస్ ఫియర్ క్రియేట్ చేయబోతున్నాం. దానికోసం ఇటివలే రీసెర్చ్ మొదలుపెట్టాం. ఆ సినిమా కోసం ప్రత్యేకంగా కొన్ని భారీ సెట్స్ వేయబోతున్నాం. ఆర్ట్ డైరెక్టర్స్ గా మాకదో పెద్ద ఛాలెంజ్. మార్చ్ నుంచి ఆ సినిమా షూట్ స్టార్ట్ కానుంది.

 ప్రస్తుతం సినిమాలు 

ప్రస్తుతం ‘సవ్యసాచి’ సినిమాకు వర్క్ చేస్తున్నాం. అలాగే వారాహి బ్యానర్ లో కళ్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా, బాలకృష్ణ గారి ‘ఎన్.టి.ఆర్’, వరుణ్ తేజ్ -సంకల్ప్ సినిమా, నాగార్జున- నాని సినిమా చేస్తున్నాం.