రకుల్ బాలీవుడ్ మూవీ పోస్ట్ పోన్

Tuesday,January 09,2018 - 02:25 by Z_CLU

సిద్దార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా అయ్యారీ. ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడా సినిమా చెప్పిన తేదీకి రావడం లేదు. దీనికి కారణం పద్మావతి సినిమా.

దాదాపు నెల రోజుల కిందటే విడుదలకావాల్సిన పద్మావతి సినిమా వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు అన్ని వివాదాలు పరిస్కరించుకొని, సెన్సార్ అడ్డంకులు అధిగమించింది ఈ మూవీ. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయకూడదనే ఉద్దేశంతో.. జనవరి 25న వస్తున్నట్టు ప్రకటించారు. దీంతో రకుల్ సినిమా ఇబ్బందుల్లో పడింది.

జనవరి 25న ఆల్రెడీ ఓ పెద్ద సినిమా ఉంది. అదే అక్షయ్ నటించిన ప్యాడ్ మాన్. ఇప్పుడీ మూవీతో పాటు పద్మావతి కూడా రెడీ అవ్వడంతో.. రకుల్ నటించిన అయ్యారీ సినిమాను వాయిదావేశారు. 2 వారాలు ఆలస్యంగా.. ఫిబ్రవరి 9న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.