కొత్త సినిమా ప్రకటించిన సూపర్ స్టార్

Friday,February 23,2018 - 05:52 by Z_CLU

సూపర్ స్టార్ రజనీకాంత్ మరో సినిమా ప్రకటించారు. 2 సినిమాల్ని రిలీజ్ కు రెడీ చేసిన ఈ స్టార్ హీరో.. తాజాగా మరో సినిమా ఎనౌన్స్ చేసి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ నెక్ట్స్ మూవీ ఉంటుంది. దీన్ని ఒక భారీ బడ్జెట్ సినిమాగా చెప్పుకొచ్చారు సమర్పకుడు కళానిధి మారన్.

ప్రస్తుతం రజనీకాంత్ చేతిలో 2 సినిమాలున్నాయి. శంకర్ దర్శకత్వంలో 2.0, పా రంజిత్ దర్శకత్వంలో కాలా సినిమాలు పూర్తిచేశారు. వీటిలో కాలా సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ అవుతోంది. 2.0 పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత రజనీ సినిమాలు ఆపేస్తారని, పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లిపోతారనే ప్రచారం సాగింది. తాజా ప్రకటనతో ఆ ప్రచారంలో నిజం లేదని తెలిపోయింది.

గతంలో పిజ్జా లాంటి హారర్ థ్రిల్లర్ సినిమాను డైరక్ట్ చేశాడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు. రజనీ-కార్తీక్ కాంబోలో ఇదే ఫస్ట్ మూవీ కాగా.. 2.0 తర్వాత రజనీకాంత్ కెరీర్ లో ఇది రెండో భారీ బడ్జెట్ చిత్రంగా నిలవనుంది. సినిమాకు సంబంధించి మరిన్ని వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తారు.