నలభీముడిగా మారిన రాజేంద్రుడు

Sunday,March 29,2020 - 02:16 by Z_CLU

సెల్ఫ్ క్వారంటైన్ లో భాగంగా నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో చెఫ్ గా మారిపోయారు. ఆయనేం చేస్తున్నారో.. ఆయన మాటల్లోనే చూద్దాం

నేను ఇంట్లో ఏం చేస్తున్నానో తెలిస్తే మీకు మంచి వినోదం అవుతుంది. ఉదయం టిఫిన్‌ నా భార్య చేస్తుంది. మధ్యాహ్నం కూరగాయలు అన్నీ కట్‌ చేసి, నేనే వంట చేస్తున్నా. కృష్ణాజిల్లా పాలకూర చేయడంలో నేను స్పెషలిస్ట్‌.. అందుకే ఎక్కువగా చేస్తున్నాను. ‘వద్దండి.. నాకు బోర్‌ కొడుతోంది, నేను చేస్తా’ అని మా ఆవిడ అంటున్నా, వినకుండా నేనే చేస్తున్నా. బీరకాయ పాలకూర, టమోటా రోటి పచ్చడి, (టమోటాలు కొనే పని కూడా లేదు.. ఇంట్లోనే చెట్లు ఉన్నాయి.. కోయడం చేయడమే).

ఈ విధంగా వంటిల్లుని నేను స్వాధీనపరచుకున్నా.. ఇప్పుడు యోధుణ్ణి నేను. ‘అదేంటండి? అంటుంది’ మా ఆవిడ. పనీ పాటా లేదు. ఏదో ఒక పని చేయకపోతే తిన్నది అరగదు అన్నాను. ‘అయితే పనిమనిషి రాలేదు.. బయట ఊడవండి’ అంది. నేను ఊడవను అన్నాను. సరే.. కారు కడగండి అంది. నన్ను డామినేట్‌ చేసి మా అబ్బాయి బాలాజీ అప్పటికే కారు కడిగేస్తున్నాడు..

సో.. నాకు వంట పని ఒక్కటే కనిపించింది.. చేస్తున్నా. చూడండి మగాళ్లలారా. పని లేదు.. పని లేదు అని ఏడవడం కాదు. నీకు వచ్చిన పనిని సిగ్గు లేకుండా, మొహమాట పడకుండా చేయాలి. నా వ్యక్తిగత అనుభూతి ఏంటంటే వంట చేసేటప్పుడు చాలా రిలాక్స్‌ అయిపోతున్నాను.. ఆ సమయంలో నా ఒత్తిడి అంతా తగ్గిపోతోంది.