రాజేంద్ర ప్రసాద్ ఇంటర్వ్యూ

Monday,November 18,2019 - 04:15 by Z_CLU

సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి పాత్రలు చేస్తూ నటుడిగా దూసుకెళ్తున్న రాజేంద్ర ప్రసాద్ ఈ నెల 22 ‘తోలు బొమ్మలాట’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.

మనిషి జీవితమే ‘తోలు బొమ్మలాట’

మనిషి జీవితమే ఓ తోలు బొమ్మలాట. నిజంగా చెప్పాలంటే మనం తోలు ఉన్న బొమ్మలం. మనతో ఆ దేవుడు ఆట ఆడిస్తాడు. అయితే కొన్ని సందర్భాల్లో మన తల్లి దండ్రులు, గురువు కూడా మనతో తోలు బొమ్మలాట ఆడతారు. అదే ఈ తోలు బొమ్మలాట.

కథ విన్నాక ఆశ్చర్యపోయాను

విశ్వనాధ్ నన్ను కలిసి మీకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే కథ ఉందని చెప్పాడు. ఏదైనా కామెడీ ఫ్లేవర్ తో ఉండే కథ అయి ఉంటుందేమో అని ఊహించాను. కట్ చేస్తే వృద్దాప్యంలో ఉన్న ఒక వ్యక్తి ఆలోచనలు అతని బాధతో కూడిన ఓ ఎమోషనల్ కథ చెప్పాడు. విన్నాక ఆశ్చర్యమేసింది. నీ వయసెంత అడిగాను. ఆ తర్వాత ఈ కథ నువ్వే రాశావా..? నువ్వే తీస్తావా ? అని కూడా అడిగి తెలుసుకున్నాను. నిజంగా ఈ వయసులో అలాంటి కథ రాయడం గొప్ప విషయం. నాకు చెప్పినట్టే మంచి సినిమా సినిమా తీసాడు.


మరో మంచి పాత్ర

ఏ సినిమాలో అయినా నటుడు అనే వాడు కనిపించకుండా పాత్ర కనిపించాలి. అప్పుడే సన్నివేశాలు పండుతాయి. నటుడిగా ఎప్పుడూ అదే ఫాలో అవుతాను. సినిమాలో సోడా రాజు గా కనిపించడానికి కొంత ప్రిపైర్ అవ్వడం జరిగింది. నాకు దొరికిన మరో మంచి పాత్ర. ఊళ్ళో వాళ్ళు సోడాల రాజు దగ్గరికి వెళ్తే టెన్షన్ రిలీఫ్ అవుతుంది రా అనుకునేలాంటి పాత్ర.

ఎమోషన్ తో కూడిన ఎంటర్టైన్ మెంట్

‘తోలు బొమ్మలాట’ ఎమోషన్ తో కూడిన ఎంటర్టైన్ మెంట్ అందించే సినిమా. ఒకప్పుడు మనం పాటించిన పద్దతులు ఇప్పుడు వదిలేయడం గురించి కూడా ఓ చిన్న సందేశం ఉంటుంది. అదేంటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

వెన్నెల కిషోర్ కామెడీ హైలైట్

సినిమా కథ ఎమోషనల్ జర్నీ అయినా కామెడీ కూడా ప్రాదాన్యం ఉంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు హైలైట్. బాగా చేసాడు. ఎప్పటికప్పుడు నన్ను సలహాలు అడుగుతూ ఎంతో చక్కగా ఆ పాత్రను చేసాడు. కిషోర్ పాత్ర అందరినీ బాగా నవ్విస్తుంది.

అదే కారణం

నటుడిగా నలబై ఏళ్ళు పూర్తి చేసుకున్నా ఇంకా కంటిన్యూ అవ్వడానికి నాకు వస్తున్న పాత్రలు పనిచేసే క్రూ నే కారణం. అందుకే ఇప్పటికీ నాకు నటన అంటే బోర్ కొట్టట్లేదు.


ప్రిపరేషన్  ఉండాల్సిందే 

రాజేంద్ర ప్రసాద్ చాలా సీనియర్ కదా ఎప్పటి నుండో ఉన్నాడు అనుకోవడానికి లేదు. ఇప్పటికీ ఏదైనా కథ విన్నాక కచ్చితంగా ఓ రెండు మూడు గంటలు ఆ పాత్ర గురించి ఆలోచిస్తూ ప్రిపేర్ అవుతుంటా. ఆ సమయంలో మా ఇంట్లో వాళ్ళెవరూ నా దగ్గరికి కూడా రారు. ఇక సెట్ కి వెళ్ళాక కూడా ఆ పాత్రలో ఒడిగిపోవడానికి ప్రయత్నిస్తుంటా.

ప్రస్తుతం ఆ రెండు సినిమాలు

ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్నాను. ఆ సినిమాలో మహేష్ నేను టామ్ అండ్ జెర్రీలాగా కనిపిస్తాము. ఇక బన్నీ ‘అల వైకుంఠపురములో’ ఓ పోలిస్ పాత్ర చేస్తున్నాను.