నాన్న ఉంటే ఇంకా బాగుండేది

Tuesday,July 09,2019 - 02:59 by Z_CLU

విలక్షణ నటుడు శ్రీహరి కొడుకు హీరోగా మారాడు. రాజ్ దూత్ సినిమాతో హీరోగా పరిచయమౌతున్న ఈ మేఘాంష్.. నాన్న బతికి ఉంటే తన లాంఛింగ్ ఇంకా బాగుండేదని అంటున్నాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన మేఘాంష్.. రాజ్ దూత్ సినిమాకు సునీల్ కు సంబంధం లేదంటున్నాడు.

“సినిమా టీజర్ లో సునీల్ వాయిస్ ఓవర్ పెట్టాం. అది టీజర్ కే పరిమితం. సినిమాలో సునీల్ లేరు. రాజ్ దూత్ బండికి కూడా ఎలాంటి వాయిస్ ఓవర్ ఉండదు. ఇది కంప్లీట్ గా ఓ కొత్త సినిమా. నా బాడీ లాంగ్వేజ్ కు, డెబ్యూకు సరిగ్గా సరిపోతుందని ఈ సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకున్నాను.”

టైటిల్ చూసి దీన్ని రోడ్ మూవీ అనుకోవద్దంటున్నాడు మేఘాంష్. ఇది రోడ్ మూవీ కాదని.. పైగా సెంటిమెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయని అంటున్నాడు.

“ఇది రోడ్ మూవీ కాదు. కథ బైక్ చుట్టూ తిరుగుతుంది తప్పితే, రోడ్ పై జరగదు. అంతేకాదు.. ఈమధ్య కాలంలో వచ్చిన ఆర్ఎక్స్100 హిట్ అయింది కాబట్టి దీనికి రాజ్ దూత్ అని టైటిల్ పెట్టలేదు. సినిమా కథకు ఈ టైటిల్ అయితేనే కరెక్ట్. అందుకే పెట్టాం.”

ఇంతకంటే ముందు 2 కథలు విన్నప్పటికీ.. రాజ్ దూత్ కథ తనకు బాగా నచ్చిందంటున్నాడు మేఘాంశ్. ఈ సినిమా కోసం యాక్టింగ్, డాన్స్ నేర్చుకొని మరీ ఇండస్ట్రీకి వచ్చానని, అంతా తనను ఆదరించాలని కోరుతున్నాడు. ఈనెల 12న థియేటర్లలోకి రానుంది రాజ్ దూత్ సినిమా.