RRR క్యారెక్టర్స్ ఇవే

Thursday,March 14,2019 - 01:15 by Z_CLU

ఎన్టీఆర్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు.. రామ్ చరణ్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు.. మొన్నటివరకు రౌండ్స్ కొట్టిన గాసిప్స్ ఇవి. కానీ ఇవేం కావు. ఇండిపెండెన్స్ డే కు ముందున్న స్వతంత్ర్య సమరవీరుల కథతో వస్తోంది RRR మూవీ. ఈ మేరకు చరణ్, ఎన్టీఆర్ పాత్రలతో పాటు కీలకమైన నటీనటుల వివరాలు వెల్లడించాడు రాజమౌళి.

ఎన్టీఆర్-కొమరంభీమ్
అవును.. RRRలో కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్నాడు యంగ్ టైగర్. స్వతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించి వీరమరణం పొందిన కొమరం భీమ్ ను సరికొత్త కోణంలో చూపించబోతున్నాడు రాజమౌళి. దీనిపై ఇప్పటికే రీసెర్చ్ వర్క్ పూర్తయింది. కొమరం భీమ్ పాత్రకు కాస్త ఫిక్షన్ జోడించి ఈ సినిమాను తీస్తున్నాడు జక్కన్న.

రామ్ చరణ్ – అల్లూరి సీతారామరాజు
బ్రిటిషర్లను గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. ఈ మేరకు ఇప్పటికే మేకోవర్ కూడా స్టార్ట్ చేశాడు చరణ్. మీసకట్టు, హెయిర్ స్టయిల్ లో మార్పులు కనిపిస్తున్నాయి. యంగ్ ఏజ్ లో ఇల్లు విడిచి వెళ్లిపోయిన అల్లూరి సీతారామరాజు ఇంటికి తిరిగొచ్చిన తర్వాత ఎలా ఉద్యమాన్ని ప్రారంభించాడు లాంటి అంశాలు ఇందులో ఉంటాయి.

అలియాభట్ – సీత
అల్లూరి సీతారామరాజు జీవితంలో సీత కూడా ఉంది. అంటే ఆమె మరదలి పాత్ర అన్నమాట. ఈ క్యారెక్టర్ కోసం అలియాభట్ ను తీసుకున్నాడు రాజమౌళి. ఓ సందర్భంలో ఎయిర్ పోర్టులో అలియా కలవగా అక్కడే ఆమెకు ఈ స్టోరీ, క్యారెక్టర్ చెప్పాడు రాజమౌళి. అలియా భట్ కూడా ఆన్ ది స్పాట్ ఒప్పుకుంది.

డీజియా గార్జోన్ – కొమరం భీమ్ లవ్
చరిత్రలో కొమరం భీమ్ కు ఇద్దరు భార్యలున్నారు. వీళ్లు కాకుండా అతడికి మరో లవ్ యాంగిల్ కూడా ఉంది. ఆ కోణంలో ఈ ఫారిన్ బ్యూటీ సినిమాలో మెరవనుంది. ఎంతోమంది పేర్లను పరిశీలించిన తర్వాత ఫైనల్ గా డీజియాను సెలక్ట్ చేశామని అంటున్నాడు రాజమౌళి.

అజయ్ దేవగన్ – కీలకపాత్ర
అలియాభట్ తో పాటు మరో బాలీవుడ్ ప్రముఖుడు అజయ్ దేవగన్ ను కూడా ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నట్టు రాజమౌళి తెలిపాడు. సినిమాలో చాలా కీలకమైన పాత్ర కోసం అజయ్ దేవగన్ ను తీసుకున్నామని, కథ విన్న వెంటనే దేవగన్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట.

సముత్తరఖని – సినిమాకు బ్యాక్ బోన్
ఇప్పటికే ఎన్నో విలక్షణ పాత్రలతో మెప్పించిన ఈ నటుడు RRRలో కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమాకు ఇతడు బ్యాక్ బోన్ లాంటివాడని స్వయంగా రాజమౌళి ప్రకటించాడు. అంతేకాదు, మూవీ ఫస్ట్ షెడ్యూల్ నుంచి సినిమాలో భాగమయ్యాడు ఈ నటుడు.

ఇలా RRRకు సంబంధించి హీరోయిన్లతో పాటు కీలకమైన నటీనటుల వివరాల్ని రాజమౌళి బయటపెట్టాడు. మిగతా పాత్రల డీటెయిల్స్ ను కూడా ఒక్కొక్కటిగా వెల్లడిస్తామని ప్రకటించాడు.