రాజమౌళిపై శాతకర్ణి ప్రభావం

Monday,January 23,2017 - 09:25 by Z_CLU

బాలయ్య నటించిన వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి, రాజమౌళిపై చాలా ప్రభావాన్ని చూపిస్తోంది. సినిమా థియేటర్లలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక రకంగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను మెచ్చుకుంటూనే ఉన్నాడు రాజమౌళి. విడుదలైన రోజే సినిమా చూసిన రాజమౌళి… దర్శకుడు క్రిష్ తో పాటు టోటల్ యూనిట్ ను మెచ్చుకుంటూ ట్వీట్స్ చేశాడు. ఆ తర్వాత తనే ప్రత్యేకంగా క్రిష్ ను ఇంటర్వ్యూ కూడా చేశాడు. అక్కడితో ఆగకుండా ఇప్పుడు ఏకంగా క్రిష్ కు ఓ ఉత్తరం కూడా రాశాడు రాజమౌళి. అది కూడా శాతకర్ణి స్టయిల్ లోనే రాయడం విశేషం.

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను కేవలం 79రోజుల్లో పూర్తిచేసిన క్రిష్ ను మరోసారి లేఖలో అభినందించాడు రాజమౌళి. అంజనాపుత్ర క్రిష్ అంటూ మొదలుపెట్టిన రాజమౌళి… ఆ లేఖలో ప్రతి ఒక్కరిపై ప్రశంసలు కురిపించాడు. సినిమా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నాడు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకున్నాడు. చివర్లో రాజనందిని పుత్ర రాజమౌళి అంటూ లేఖను ముగించడం విశేషం.

ప్రస్తుతం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా స్టడీగా వసూళ్లు రాబడుతోంది. ఓవర్సీస్ లో ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం… 2 మిలియిన్ డాలర్ మార్క్ కు చేరువలో ఉంది. క్రిష్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రియ, హేమమాలిని కీలకపాత్రలు పోషించారు. చిరాంతన్ భట్ సంగీతం అందించాడు.