'రాహుల్ రవీంద్రన్' ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ

Sunday,July 22,2018 - 11:06 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్న యంగ్ హీరో రాహుల్ రవీంద్రన్ మెగా ఫోన్ పట్టేసాడు.. డైరెక్షన్ మీద ఆసక్తితో వచ్చి హీరోగా మారిన రాహుల్ ‘చిలసౌ’ సినిమాతో త్వరలోనే దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సందర్భంగా సినిమా గురించి తన కెరీర్ ప్లాన్స్ గురించి ‘జీ సినిమాలు’ తో ఎక్స్ క్లూజీవ్ గా మాట్లాడాడు… ఆ విశేషాలు రాహుల్ మాటల్లోనే.

 

పదేళ్ళ కల…

నిజానికి డైరెక్టర్ అవ్వాలనే ఇండస్ట్రీ లో అడుగుపెట్టాను.. కాని అనుకోకుండా హీరో అయ్యాను.. ‘అందాల రాక్షసి’ సినిమా నా రూట్ మార్చేసి యూ టర్న్ తీసుకునేలా చేసింది. ఆ సినిమా తర్వాత వరుసగా హీరోగా ఆఫర్స్ రావడంతో కాస్త కాన్ఫిడెన్స్ వచ్చాక డైరెక్ట్ చేస్తే బాగుంటుందని హీరోగానే కంటిన్యూ అయిపోయాను. పదేళ్లుగా కథను డెవలప్ చేస్తూ వచ్చాను. సో ఫైనల్ గా ఇప్పుడు టైం వచ్చింది. హీరోగా చేసిన కొన్ని సినిమాల అనుభవంతో ఈ సినిమాను హ్యాండిల్ చేయగలననే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎట్టకేలకు ‘చి.ల.సౌ’ తో నా పదేళ్ళ కల నెరవేరింది.

 

నాకెప్పుడో  తెలుసు

చిన్మయి నాకు పరిచయం అయినప్పుడే నా అభిరుచి గురించి తెలుసుకుంది… మ్యారేజ్ కి ముందే నాకు డైరెక్షన్ అంటే ఇంటరెస్ట్ అని తనకు తెలుసు.. సో డైరెక్ట్ చేస్తున్నా అని చెప్పగానే షాక్ అవ్వలేదు. బికాజ్ తనకి ముందు నుండి తెలుసు కాబట్టీ. కానీ ఇంత సడెన్ గా చేస్తానని మాత్రం తను ఊహించలేదు.

రెండు కథలతో…

డైరెక్టర్ అవుదామనుకోగానే రెండు కథలు సిద్దం చేసుకున్నాను.. ఆ కథలతోనే ట్రైల్స్ వేద్దామని ఫిక్స్ అయ్యాను. కానీ ఓ సందర్భంలో ఏదైనా సింపుల్ స్టోరీతో నా అభిరుచికి తగ్గట్టుగా ఒక ఫ్రెష్ సినిమా చేయాలనుందని సుశాంత్ నాతో అన్నాడు. ఆ టైంలో నాదగ్గరున్న రెండు కథలు సరదాగా వినిపించాను. తనకి ఈ కథ బాగా నచ్చడంతో ఇదే ప్రిఫర్ చేసుకున్నాడు. ఇద్దరం కలిసి ఈ సినిమా చేసేద్దాం అంటూ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. అలా ఈ సినిమా మొదలైంది.

 

పర్ఫెక్ట్ అనిపించాడు…

ఎవరినీ ఊహించుకొని ఈ కథ రాయలేదు. కానీ ఈ కథకి సుశాంత్ పర్ఫెక్ట్ అనిపించాడు. అందుకే సుశాంత్ ఈ కథ సెలెక్ట్ చేసుకున్నాడు. చాలా సింపుల్ స్టోరీ కానీ మంచి ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ సినిమాలో వర్కౌట్ అయ్యిందని నమ్ముతున్నాను.


నీకెందుకు ఇవన్నీ అవసరమా…

సుశాంత్ ఓకే అన్నాక అలాగే నిర్మాత కూడా కుదిరాక సినిమా డైరెక్ట్ చేస్తున్నాని కొంత మందికి చెప్పాను. చెప్పగానే వాళ్ళందరూ ఇప్పుడు నీకు అవసరమా.. హ్యాపీ గా సినిమాలు చేసుకోక డైరెక్షన్ ఎందుకు అన్నారు. హీరోగా సినిమాలు చేస్తున్న టైంలో ఇలాంటి రిస్క్ ఎందుకని వాదించారు కూడా.. కానీ నా ఇంట్రెస్ట్ తెలిసాక అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పి ఎంకరేజ్ చేసారు.

టైటిల్ తనే చెప్పాడు

ముందుగా ఈ సినిమాకు చి.అర్జున్ అని పెట్టలనుకున్నాము. సరిగ్గా అప్పుడే అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయింది. ఆ టైం లో ఈ టైటిల్ పెట్టడం ఎందుకో కరెక్ట్ కాదని అనిపించి ఆ టైటిల్ వద్దనుకున్నాం. అయితే ఈ స్క్రిప్ట్ ఏ టైటిల్ పెడితే బాగుంటుంది..అని ఆలోచిస్తుండగా నా ఫ్రెండ్ వెన్నెల కిషోర్ ‘చి.ల.సౌ’ అనే టైటిల్ ను సజిస్ట్ చేసాడు. నాతో పాటు అందరికీ బాగా నచ్చడంతో ఈ టైటిల్ ఫిక్స్ చేసుకున్నాం.

నెల రోజుల్లోనే

ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయిపోయాక చాలా తక్కువ టైంలోనే షూట్ కంప్లీట్ చేయాలని అనుకున్నాం. అలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కేవలం 32 రోజుల్లోనే ఫినిష్ చేసాం. నా టీం వల్లే ఇంత త్వరగా ఫినిష్ చేయగలిగాను. సినిమా చూసాక మరీ ఇంత తక్కువ టైంలో ఎలా అని చాలా మంది అడుగుతున్నారు.

క్లియర్ గా ఉన్నాను

సినిమాలో డైలాగ్స్ అన్నీ నేచురల్ గా మనం మాట్లడుకున్నట్టుగానే ఉంటాయి. అందుకే డైలాగ్స్ నేనే రాసుకున్నాను. నేను రాసాక నా టీం నుండి కొన్ని సజిషన్స్ తీసుకున్నాను. ఈ సినిమా వరకూ మాటలు నేనే రాసుకున్నాను కానీ నెక్స్ట్ సినిమాకు రాయలేకపోవచ్చు. కారణం కథను బట్టే మాటలుండాలి.


అందుకే ఆ ఛాయస్ తీసుకున్నాను

ఈ సినిమాకు ఫ్రెష్ లుక్ కోసం కొత్త అమ్మాయి అయితేనే బెటర్ అని ఫీలయ్యాం… అందుకే రుహాని శర్మ ను తీసుకున్నాం. తన క్యారెక్టర్ కి బెస్ట్ అనిపించుకుంది. సుశాంత్ కి రుహాని కి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. సినిమాలో వీరిద్దరి పెర్ఫార్మెన్స్ గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటారు.

ఇదే మొదటి సారి

చిన్మయి.. సింగర్ గా ఎన్నో పాటలు పాడింది. తను పాడుతుండగా ఎప్పుడు రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళలేదు.. కానీ ఫస్ట్ టైం ఈ సినిమాలో ‘మెల్లగా మెల్లగా’ సాంగ్ పాడుతున్నప్పుడు రికార్డింగ్ స్టూడియో కి వెళ్లాను. చిన్మయి గురించి నేను చెప్తే బాగోదు కానీ.. తన వాయిస్ తో సాంగ్ చాలా పాపులర్ అయింది. ఆల్బం లో నా ఫేవరేట్ సాంగ్ అది. నాకే కాదు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ ఫేవరేట్ అయిపొయింది. నాని కూడా ఆ సాంగ్ గురించి స్పెషల్ ట్వీట్ చేసాడు.. ఈ సందర్భంగా సింగర్ చిన్మయి గారికి స్పెషల్ థాంక్స్ (నవ్వుతూ).

అమేజింగ్ టాలెంట్

ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఈ కథకి ఎవరైతే పెర్ఫెక్ట్ అని ఆలోచిస్తుండగా… అడివి శేష్ ‘వెళ్ళిపోమాకే’ సినిమా ట్రైలర్ చూడమని చెప్పాడు. అందులో ప్రశాంత్ విహారి బాగ్రౌండ్ స్కోర్ విన్నాక శేష్ చెప్పినట్టు నా సినిమాకు తనే పెర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించింది. ఆ తర్వాత ‘మెంటల్ మదిలో’ అనే సినిమాకు కూడా వర్క్ చేసాడు. అమేజింగ్ టాలెంట్. నిజంగా నేను నమ్మినట్టే బెస్ట్ మ్యూజిక్ అందించాడు.

చైతూ..సమంత…వాళ్ళే మొదటి ఆడియన్స్

ఈ సినిమా రెడీ అయ్యాక సమంత సినిమా చూడాలని ఉందని అడిగింది.. తనతో పాటే చైతూ కూడా సినిమా చూసాడు. సినిమా చూసాక వారిద్దరూ బాగుంది అని చెప్పి హాగ్ ఇచ్చారు. నిజానికి వాళ్ళే నా మొదటి ఆడియన్స్.. ఆ తర్వాత చైతూ నాగార్జున గారితో ఈ సినిమా గురించి చెప్తానని అన్నాడు.

 

ఇంతకన్నా ఏం కావాలి

సినిమా పోస్టర్ పై అన్నపూర్ణ స్టూడియోస్ అనే బ్రాండ్ లోగో పడటం ఆనందాన్నిచ్చింది. మొన్న ఫైనల్ చెక్ అప్ చూస్తున్నప్పుడు సిరుని సినీ కార్పోరేషన్ తో పాటు నిర్మాతగా నాగార్జున గారి పేరు చూసి చాలా హ్యాపీ గా ఫీలయ్యాను. ఆ టైంలో ఇంతకంటే ఏం కావాలి అనిపించింది.

‘శ్రీమంతుడు’ తర్వాత వద్దనుకున్నా

‘శ్రీమంతుడు’ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు ఏం ఆలోచించకుండా ఓకే చెప్పేసాను.. సినిమాలో ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ కావడంతో వెంటనే చేసేసాను. ఆ సినిమాలో కనిపించింది కాసేపే అయినా ఓ మంచి సినిమాలో పార్ట్ అయ్యాననే హ్యాపీ నెస్ ఉంది. ఆ సినిమా తర్వాత కూడా కొన్ని పెద్ద సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. కానీ చేయకూడదని ఫిక్స్ అయ్యాను. అందుకే కేవలం హీరోగా మాత్రమే చేస్తూ వచ్చాను.

కష్టం అనిపించలేదు…రీజన్ అదే

హీరోగా కొన్ని గంటలు మాత్రమే వర్క్ చేస్తాం.. కానీ డైరెక్షన్ వర్క్ అలా కాదు. కేవలం కొన్ని గంటలు మాత్రమే పడుకోవాలి.. కొన్ని తినడానికి కూడా టైం దొరకదు. ప్రతీ క్షణం సినిమా అవుట్ పుట్ గురించే ఆలోచిస్తూ పని చేయాల్సి ఉంటుంది. అలా నిద్ర లేని రాత్రులు గడిపినా… సరిగ్గా తినకపోయినా ఎప్పుడూ చిరాకు రాలేదు. రీజన్ డైరెక్షన్ అంటే ఫ్యాషన్ కాబట్టి. ఏ వర్క్ అయినా ఇష్టపడి చేస్తే అస్సలు కష్టం అనిపించదు. ఇంకా చేయాలనిపిస్తుంటుంది.

 

ఆ మూడు సినిమాలు వెరీ స్పెషల్

నా కెరీర్ లో మూడు సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేను… అందులో నా మొదటి సినిమా ‘అందాల రాక్షసి’ ఒకటి ఆ తర్వాత ‘అలా ఎలా’ అలాగే తమిళ్ లో నేను చేసిన ‘విన్మీంగల్’.. ఈ మూడు సినిమాకు నాకు వెరీ స్పెషల్.. ఈ మూడు సినిమాల్లో నాకు చాన్స్ ఇచ్చిన హను కి, అనీష్ కి అలాగే విజ్ఞేశ్ మీనన్ కు నా కృతజ్ఞతలు.

సినిమా చూడాల్సిందే

సినిమా అంతా సుశాంత్ చాలా నేచురల్ గా సింపుల్ కాస్ట్యూమ్ తోనే కనిపిస్తాడు.. సాంగ్ ప్రోమోలో కూడా సుశాంత్ షార్ట్ తోనే కనిపించాడెందుకు అని చాలా మంది అడుగుతున్నారు. వాటన్నిటికీ సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే. అదొక్కటే చెప్పగలను. ఈ సినిమా అందరూ తమ కుటుంబంతో కలిసి చూసేలా  ఉంటుంది. అది మాత్రం గ్యారెంటీ ఇస్తున్నా.

రెండో సినిమా ఆ బ్యానర్ లోనే

ఈ సినిమా రిలీజ్ తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో మరో సినిమా చేయబోతున్నాను.  సైన్ కూడా చేసాను. అయితే అది ఎలాంటి కథతో ఉంటుంది… ఎవరితో చేస్తా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ‘చిలసౌ’ రిలీజ్ తర్వాత ఆ సినిమా గురించి ఆలోచిస్తాను.