పూరి జగన్నాధ్ బర్త్ డే స్పెషల్

Monday,September 28,2020 - 01:39 by Z_CLU

ఇరవై ఏళ్ల క్రితం ‘బద్రి’ సినిమా విడుదలైంది. ఆ సినిమాతో పూరి జగన్నాథ్ అనే దర్శకుడు టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. మార్నింగ్ షో చూసిన మెగా అభిమానులు థియేటర్స్ బయటికొచ్చి ‘నువ్వు నందా అయితే నేను బద్రి..బద్రినాథ్’ అంటూ ఓ డైలాగ్ చెప్తూ సంతోషంతో ఊగిపోయారు. సినిమా చూసి అందులో డైలాగ్ ను అభిమానులు గర్వంగా చెప్పుకున్న ఆ క్షణమే పూరి సినీ విజయ ప్రయాణం మొదలైంది. తొలి సినిమాతోనే గురి తప్పకుండా మంచి హిట్ కొట్టాడు పూరి. ఇంకేముందు వరుసగా ఆఫర్స్ వచ్చి పడ్డాయి. కానీ రెండో ప్రయత్నంగా జగపతి బాబుతో ‘బాచి’ సినిమా తీశాడు. అది ఆడలేదు. ఆ చేదు అనుభవంతో ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు చూడాలనుకుంటున్నారో తెలుసుకున్నాడు. ‘ఇట్లు శ్రావని సుబ్రహమణ్యం’ తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కి అక్కడి నుండి ప్రతీ సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ అతి తక్కువ టైంలోనే టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు.

టాలీవుడ్ లో హిట్స్ గురించి మాట్లాడుకున్నా, సూపర్ హిట్స్ ను తలుచుకున్నా , ఇండస్ట్రీ హిట్ లిస్టు తిప్పి చూసిన అందులో పూరి సినిమాలు కచ్చితంగా ఉంటాయి. అవును ‘బద్రి’, ‘ఇట్లు శ్రావని సుబ్రహ్మణ్యం’,’ఇడియట్’,’అమ్మానాన్న ఓ తమిళమ్మాయి’, ‘శివమణి’, ‘పోకిరి’, ‘దేశముదురు’, ‘చిరుత’, ‘బుజ్జిగాడు’, ‘బిజినెస్ మేన్’, ‘టెంపర్’, ‘ఇస్మార్ట్ శంకర్’ ఇలా పూరి హిట్ సినిమాలు పదిపైనే ఉంటాయి. వీటిలో బాక్సాఫీస్ ను షేక్ చేసిన స్పెషల్ కేటగిరీ కూడా ఉంది.

ప్రతి హీరోను సరికొత్తగా ప్రెజెంట్ చేసే అతి కొద్ది మంది దర్శకుల్లో పూరి ఒకడు. పవర్ ఫుల్ హీరోయిజం చూపించాలన్నా, మాస్ డైలాగ్స్ తో అభిమానులను మెప్పించాలన్నా, ఇప్పటికీ కేరాఫ్ అడ్రెస్ పూరినే. అందుకే “హీరోలందు పూరి హీరోలు వేరయా ! ” అంటుంటారు ప్రేక్షకులు.

మహేష్ ను కంప్లీట్ మాస్ లుక్ లో ప్రెజెంట్ చేసి ‘పోకిరి’ సినిమా తీసి రికార్డు స్థాయిలో 40 కోట్లకు పైగా షేర్ సాధించి ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఘనత పూరికే దక్కుతుంది. ఆ సినిమాతో దర్శకుడిగా ఓ రేంజ్ కెళ్ళాడు పూరి. ‘పోకిరి’ థియేటర్స్ లో ఆడే రోజుల్లో ఎక్కడ చూసినా పూరి గురించే డిస్కర్షన్. సినిమాలో డైలాగ్స్ ను పూరి స్టైల్ రైటింగ్ గురించి తెగ మాట్లాడుకున్నారంతా. తొలి సినిమా నుంచే తన రైటింగ్ తో ఎట్రాక్ట్ చేస్తూ వచ్చాడు పూరి. అందుకే టక్కున ఏదైనా సినిమా డైలాగ్ చెప్పమంటే మనకి పూరి డైలాగులే గుర్తొస్తాయి.

‘పోకిరి తర్వాత కొన్ని సూపర్ హిట్లు కొట్టినప్పటికీ మళ్ళీ పూరి సక్సెస్ ట్రాక్ కి మధ్యలో బ్రేక్ పడింది. ‘టెంపర్’ తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అప్పటి వరకు ఫ్లాపులో ఉన్న తారక్ కూడా ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మళ్లీ సక్సెస్ ఫుల్ జర్నీ స్టార్ట్ చేశాడు. ‘టెంపర్’ తర్వాత కూడా పూరీని మళ్లీ వరుసగా అపజయాలు పలకరించాయి. అయినా అవన్నీ పట్టించుకోకుండా ఏమాత్రం కుంగిపోకుండా ‘ఇస్మార్ట్ శంకర్’ తో ఓ సముద్రపు కెరటంలా దూసుకొచ్చాడు. అవును ఒక్క ఫ్లాప్ వస్తేనే నెక్స్ట్ సినిమా చేయడానికి దైర్యం చాలని రోజులివి. ఎన్ని ప్లాపులొచ్చినా దైర్యంగా తన కెరీర్ ను ముందుకు సాగించి ఇస్మార్ట్ హిట్ తో ‘ఐయాం బ్యాక్’ అంటూ బాక్సాఫీస్ లెక్కలతో గట్టిగా చెప్పాడు ఇస్మార్ట్ డైరెక్టర్.

‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు’. దీనికి చక్కని ఉదాహరణ పూరి. అవును ఎక్కడో నర్సీపట్నం కుర్రాడు సినిమా పిచ్చితో హైదరాబాద్ వచ్చి ఎన్నో ఇబ్బందులు పడి చివరికి ఓ స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడంటే మాటలా..? చెప్పండి. ఎంతో కృషి పట్టుదల ఉంటేనే అది సాధ్యం అవుతుంది. ఆ కృషి ,పట్టుదలతో సినిమానే నమ్ముకొని సినిమాతోనే జీవితమని భావించాడు కాబట్టే ఈరోజు అభిమానుల గుండెల్లో పూరి కంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది.

పూరిని ఆదర్శంగా తీసుకొని దర్శకులవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన కుర్రాళ్ళెందరో. ఇప్పటికే చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ని ఫేవరేట్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్న వేస్తే పూరి పేరే జవాబుగా వినిపిస్తుంది. That Is Puri Ja’Gun’nath.

పూరి సినిమా డైలాగూలే కాదు రియల్ లైఫ్ లో ఆయన మాటలు, చెప్పే విషయాలకు కూడా ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే పూరికి ఓ వీరాభిమాని విగ్రహం కట్టిస్తే , మరో వీరాభిమాని ఏకంగా గుండెలపై ఆయన టాటూ వేయించుకున్నాడు. ఇది ఇంత వరకూ ఏ స్టార్ డైరెక్టర్ కి దక్కని ఓ అరుదైన గౌరవం అని చెప్పొచ్చు. ఇక ఏ సందర్భంలో అయినా ఏంటో మన జీవితం అనిపిస్తే జస్ట్ పూరి మాటలు వింటే చాలు మళ్ళీ ఎనర్జీ వస్తుంది. పోరాడాలి అనే ఉత్సాహం మనలో మొదలవుతుంది. అందుకే కదా వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ కూడా డిప్రెషన్ మూడ్ లో ఉన్నప్పుడు పూరి మాటలే వినాలనుకుంటారు. ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్ మీట్ లో హీరో రామ్ చెప్పినట్టు పూరి ఒక డ్రగ్. అందుకే ఆయనతో కాస్త క్లోజ్ అయితే చాలు ఒక వ్యసనంలా విడిచిపెట్టలేమంటారు హీరోలు.

‘బద్రి’తో దర్శకుడిగా ప్రయాణం మొదలెట్టి ఇస్మార్ట్ శంకర్ తో ఇరవై ఏళ్ల మైలు రాయిని చేరిన పూరి సినీ జీవితం కొత్త దర్శకులందరికీ ఓ స్ఫూర్తి. పూరి మరెన్నో బ్లాక్ బస్టర్స్ అందుకొని ఇలాగే బాక్సాఫీస్ ను ఎప్పటికప్పుడు షేక్ చేస్తూ మనల్ని సరికొత్తగా ఎంటర్టైన్ చేయాలని ఆశిస్తూ జన్మదిన శుభాకాంక్షలు.

-రాజేష్ మన్నె