పూరి జగన్నాధ్ బర్త్ డే స్పెషల్

Saturday,September 28,2019 - 08:52 by Z_CLU

ఎంతో మంది దర్శకులుంటారు. కానీ ట్రెండ్ సెట్టర్స్ చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. టాలీవుడ్ నడకను మార్చే డైరక్టర్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అలాంటి వేళ్లలో ఒకడు పూరి జగన్నాధ్. ఇతడ్ని అంతా ముద్దుగా డాషింగ్ అండ్ డైనమిక్ డైరక్టర్ అని పిలుస్తారు. కానీ టాలీవుడ్ పాథ్ బ్రేకర్ అని పిలిస్తే బెటరేమో. టాలీవుడ్ కింగ్ మేకర్ అని పిలిస్తే
ఇంకా బెటరేమో. అవును.. ఇండస్ట్రీకి హిట్స్ ఇవ్వడమే కాదు, హీరోల్ని స్టార్స్ ను చేసిన ఘనత పూరి జగన్నాధ్ సొంతం.

రవితేజను హీరోగా మలచడం నుంచి ప్రారంభమైంది పూరి జగన్నాధ్ కింగ్ మేకర్ అధ్యాయం. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యంతో రవితేజను హీరోగా మార్చిన పూరి, అతడికి కెరీర్ లో గుర్తుండిపోయే హిట్స్ ఇచ్చాడు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. నాగార్జున, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి హీరోలకు సెపరేట్ మేనరిజమ్ క్రియేట్ చేసిపెట్టాడు. అంతెందుకు మొన్నటివరకు ఒకేలా కనిపించిన రామ్ ను, ఇస్మార్ట్ శంకర్ తో పక్కా మాస్ హీరోగా మార్చిన ఘనత కూడా పూరిదే.

ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం.. రవితేజను హీరోగా మార్చిన మూవీ. చిరుత.. రామ్ చరణ్ డెబ్యూ మూవీ. పోకిరి.. మహేష్ కెరీర్ ను మలుపుతిప్పిన మూవీ. ఇస్మార్ట్ శంకర్.. రామ్ కు మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన మూవీ. టెంపర్.. ఎన్టీఆర్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కించిన మూవీ. ఇలా ఈ హీరోలందరి కెరీర్స్ లో పూరి ఉన్నాడు. ప్రతి హీరో తమ కెరీర్ లో పూరిని
ప్రత్యేకంగా చెప్పుకుంటారు.

ఇక ట్రెండ్ సెట్ విషయానికొస్తే, హీరోలంతా ఉత్తములు అనే బ్రాండ్ నుంచి పక్కకొచ్చి, హీరోలు ఇలా కూడా ఉంటారని చూపించాడు పూరి. ఇడియట్ లో హీరో అంత చిల్లరగా ఉంటాడని ఎవ్వరూ ఊహించరు. శివమణిలో హీరో నాకు మెంటల్ అంటాడని అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు. నేనెంత పెద్ద ఎదవనో నాకే తెలీదనే డైలాగ్ ను మహేష్ నోట ఊహించగలమా. ఇలాంటి పంచ్ డైలాగ్ లు పెట్టడంతో పాటు.. హీరోల్ని నెగెటివ్ గా చూపిస్తూనే పాజిటివ్ సైడ్ తీసుకెళ్లడం పూరి జగన్నాధ్ కే చెల్లింది.

ఇతడి పనైపోయిందనుకునే ప్రతిసారి ఓ హిట్ తో సత్తా చాటుతూనే ఉన్నాడు ఈ డాషింగ్ డైరక్టర్. తాజాగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో తనలో ఇంకా పస తగ్గలేదని ప్రూవ్ చేసుకున్న పూరి, ఇప్పుడు విజయ్ దేవరకొండను మరో డైమన్షన్ లో ప్రజెంట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
హ్యాపీ బర్త్ డే అండ్ ఆల్ ది బెస్ట్ టు పూరి జగన్నాధ్.