భారీ చిత్రాల నిర్మాతకు జన్మదిన శుభాకాంక్షలు

Thursday,August 13,2020 - 12:34 by Z_CLU

ఇండస్ట్రీలో కేవలం డబ్బు సంపాదించుకోవడం కోసమే సినిమాలు నిర్మించే నిర్మాతలుంటారని చాలామంది అనుకుంటారు. డబ్బు పెట్టి ఎంతో ప్రేమతో సినిమాలు తీసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే నిర్మాతలూ ఉంటారు. భోగవల్లి ప్రసాద్ గారు రెండో కేటగిరికి చెందిన నిర్మాత. 1986 లో శోభన్ బాబు తో ఆయన నిర్మించిన ‘దొరబాబు’ నుండి మొన్నవచ్చిన ‘మిస్టర్ మజ్ను’ వరకు ఆయన ప్రయాణం ఆటుపోట్ల మధ్య సాగింది. ఈ ప్రయాణంలో నిర్మాతగా ఆయన భారీ విజయాలు చూసారు అలాగే నష్టాలు చూసారు. రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు కథలను ఆ దర్శకులను నమ్మి ప్రేక్షకుల కోసం సినిమాలు నిర్మిస్తున్నారు. వెంకటేష్ తో తీసిన ‘ఒంటరి పోరాటం’, ‘మకుటం లేని మహారాజు’, ‘చట్టంతో చదరంగం’ సినిమాలు నిర్మాతగా ఆయన అభిరుచిని తెలియజేసేలా ఉంటాయి.

భోగవల్లి ప్రసాద్ గారు నిర్మించిన ‘ఛత్రపతి’ ఆయనకి నిర్మాతగా భారీ గుర్తింపుతో పాటు కాసుల వర్షం కురిపించింది. ఆ సినిమా ఘన విజయం అందుకున్నాక అందరూ ప్రసాద్ గారి పేరుకి ముందు ఛత్రపతి ని చేర్చారు. కొన్నేళ్ళ పాటు ఆయన్ను అందరూ ఛత్రపతి ప్రసాద్ అని పిలిచేలా చేసిందా సినిమా. ఆ తర్వాత రామ్ చరణ్ తో రాజమౌళి తీసిన ‘మగధీర’ కి ఆయన సహ నిర్మాతగా ఉన్నారు. ‘మగధీర’ ఘనవిజయంలో నిర్మాతగా ఆయనకి కూడా భాగం ఉంది. ఇక పవన్ కళ్యాణ్ తో ప్రసాద్ గారు నిర్మించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా భారీ వసూళ్లు తెచ్చిపెట్టి ఆయన ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పడేలా చేసింది. నిజానికి సినిమా విడుదల సమయంలో పైరసీ జరిగింది. ప్రసాద్ గారి స్థానంలో మరో నిర్మాత ఉంటే బెంబేలెత్తిపోయే వాడు. కానీ ఆయన తన సినిమా పైరసీ అయిందని తెలిసి  బాధ పడ్డారే కానీ సినిమా మీద నమ్మకంతోనే ఉన్నారు. ఆ సినిమా మీద ఆయనపెట్టుకున్న నమ్మకమే భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ప్రభాస్ కి ‘డార్లింగ్’, ఎన్టీఆర్ తో ‘నాన్నకు ప్రేమతో’ , వరుణ్ తేజ్ కి ‘తొలి ప్రేమ’ లాంటి విజయాలు అందించారు ప్రసాద్.

ఇక నిర్మాతగా ఆయన భారీ విజయాలతో పాటు కొన్ని అపజయాలు కూడా అందుకున్నారు. గోపీచంద్ తో ఎంతో ‘సాహసం’ చేసి తీసిన సినిమా ఆశించిన ఫలితం అందుకోలేక పోయినా ఆ కథను నమ్మి కావాల్సిన బడ్జెట్ ఇచ్చిన ప్రసాద్ గారిని ఆ సినిమా చూసాక అందరూ అభినందించారు. ఇక మధ్యలో మినిమం రేంజ్ ఉన్న హీరోలతో తీసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అపజయం అందుకున్నా ఆయన ఎప్పుడూ దిగాలు చెందలేదు. సినిమాలు తీయడం ఆపలేదు. ప్రస్తుతం సాయి తేజ్ తో ఆయన నిర్మిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో మళ్ళీ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో సూపర్ హిట్ అందుకోవాలని ఆశిస్తూ భారీ చిత్రాల నిర్మాత ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది జీ సినిమాలు.