నిర్మాత బన్నీ వాస్ ఇంటర్వ్యూ

Sunday,August 19,2018 - 10:00 by Z_CLU

ఇటివలే విడుదలైన ‘గీత గోవిందం’ భారీ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతుంది. ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాస్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.

 

ఊహించలేదు

స్క్రిప్ట్ విన్నప్పుడు, షూట్ జరుగుతున్నప్పుడు సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అనుకున్నాం కానీ ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ ఊహించలేదు. ఈ సక్సెస్ ఊహించి ఉంటే ఏ ఏరియా అమ్మేవాన్ని కాదు(నవ్వుతూ). ఓపెనింగ్ ఈ రేంజ్ లో వస్తాయని కానీ రిలీజ్ డే మార్నింగ్ షోకే బ్లాక్ బస్టర్ టాక్ వస్తుందని కానీ అస్సలు ఊహించలేదు. మూడు రోజులకే ఈ రేంజ్ లో కలెక్ట్ చేయడం నిర్మాతగా ఆనందాన్నిచ్చింది.

 

హీరో క్రేజ్ ఇప్పుడే తెలిసింది

హీరోకి మంచి క్రేజ్ ఉంది కాబట్టి మంచి రెవెన్యూ చేస్తుందని ఊహించం కానీ ఇంత క్రేజ్ ఉందని ఇప్పుడే తెలిసింది. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ కి కొన్ని ఏరియాల్లో ఇంత వరకూ కలెక్ట్ చేస్తుందని ఊహించాం కానీ మేము ఊహించని ఏరియాల్లో కూడా అప్పుడే బ్రేక్ ఈవెన్ అవుతుందని అనుకోలేదు. నిజానికి ఇప్పుడే హీరో క్రేజ్ తెలిసింది.

 

సక్సెస్ కి రీజన్ అదే

‘గీతా 2 పిక్చర్స్’ సక్సెస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండటానికి మెయిన్ రీజన్… ఈ బ్యానర్ లో పనిచేసే ప్రతీ దర్శకుడితో నేను ఓ బ్రదర్ లా కలిసిపోతూ వర్క్ చేయడమే. దర్శకుడికి పూర్తి ఫ్రీడం ఉంటుంది. ఒక సీన్ ఆ దర్శకుడు అనుకున్నట్టు రాకపోతే మళ్ళీ ఇంకోసారి తీసుకునేంత ఫ్రీడం ఉంటుంది. అలా కాబట్టే మా బ్యానర్ లో పనిచేసే ప్రతి దర్శకుడు బెస్ట్ సినిమా డెలివెరీ చేస్తారు.

 

పరశురాం కూడా పార్ట్నర్

ఈ సినిమాకు దర్శకుడు పరశురాం కూడా పార్ట్నర్ గా వ్యవహరించారు. బుజ్జి నువ్వు నేను అరవింద్ గారి ఇన్వెస్ట్ తో ఒక సినిమా చేద్దాం.. నీకెంత వస్తుందో నాకు అంతే వస్తుందని మాట్లాడుకొని స్టార్ట్ అయిన సినిమా ఇది. అందుకే ఆ పాజిటీవ్ నెస్, సింప్లీ సిటీ సినిమాలో కూడా కనబడుతుంది.

 

నమ్మకంతోనే చేసాడు

బుజ్జి కథ చెప్పగానే విజయ్ ఇంప్రెస్ అయ్యాడు. కాకపోతే తను ఈ టైప్ సినిమాలను పెద్దగా ఇష్టపడకపోవడంతో కన్ఫ్యూజన్ లో పడ్డాడు. సో నేను డిఫరెంట్ సినిమాలు చేస్తున్నా కదా ఈ టైంలో ఈ ఎంటర్ టైనర్ సినిమా ఓకే నా అంటూ సజిషన్ అడిగాడు. మమ్మల్ని నమ్మి ఇదొక్కటి చేసేయ్ ఒక బి టౌన్స్ లో ఓపెన్ అవ్వడానికి నీకు ఉపయోగపడుతుందని చెప్పను. తను ఆ నమ్మకంతోనే ఈ సినిమా చేసాను.

కాన్ఫిడెన్స్ ఇచ్చారు

ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే అర్జున్ రెడ్డి షూట్ కూడా జరిగింది. ఆ సినిమాలో విజయ్ రోల్ కి ఇందులో గోవింద్ రోల్ కి కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది. అర్జున్ రెడ్డి రిలీజ్ తర్వాత విజయ్ మేడం మేడం అంటూ సాఫ్ట్ క్యారెక్టర్ లో విజయ్ ను చూసి పర్టిక్లర్ గా క్లైమాక్స్ లో విజయ్ కాళ్ళు పట్టుకోవడం ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా.. అనే సందేహం ఉండేది. ఆ టైంలో విజయ్ – బుజ్జి చూడండి ఇదే కొత్తదవుతుంది.. ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది అని నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నిజంగా ఇప్పుడే విజయ్ క్యారెక్టర్ కి వస్తున్న రెస్పాన్స్ మెసేజులు చూసి ఆ వారిద్దరి నమ్మకమే నిజమైంది అనిపించింది.

 

నో చేంజెస్ ప్లీజ్ అన్నాడు

అర్జున్ రెడ్డి కి వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్ చూసి ఈ కథలో కొన్ని సీన్స్ ఏమైనా మార్చాలా..అనే విషయంపై తర్జన బర్జన పడుతుండగా అప్పుడు విజయ్ ఆ కథను ఏ చేంజ్ చేయనవసరం లేదు…ఎలా ఉందో అలాగే చేద్దాం అంటూ క్లారిటీగా చెప్పేసాడు. ఆ క్షణం విజయ్ నాకు బుజ్జి బాగా నచ్చేసాడు. ఆ ప్లేస్ లో ఎవరైనా హీరో ఉంటే కాస్త బయపడేవారు. కాని విజయ్ దైర్యంగా ఈ సినిమా చేసేసాడు.

 

కోరిక తీరిపోయింది

కొన్ని సినిమాల గురించి స్టార్ హీరోలు సోషల్ మీడియా ద్వారా వారి స్పందన చెప్తూ టీం ను అభినందిస్తే చాలా హ్యాపీ గా ఫీలయ్యేవాన్ని.. మన సినిమాలు కూడా స్టార్ హీరోలు ఇలా ట్వీట్ చేస్తే బాగుంటుంది. అని మనసులో అనుకునే వాణ్ణి. గీతగోవిందం గురించి మహేష్ బాబు గారు అలాగే చరణ్ గారు ప్రత్యేకంగా అభినందిచడం ఎంతో సంతోషాన్నిచ్చింది. సో ఎట్టకేలకు నా కోరిక తీరిపోయింది.

 

నిర్మాత ఆ పనేలా చేస్తాడు..ఆలోచించాలి కదా. 

రిలీజ్ కి ముందే సినిమా మొత్తం లీక్ అవ్వడం చూసి షాక్ అయ్యాం. ఆ టైంలో మైండ్ అస్సలు పనిచేయలేదు. కొందరు కావాలనే హైప్ కోసం మేమే చేసి ఉంటామని విన్నప్పుడు భాదేసేది. హైప్ కోసం అయితే చిన్న క్లిప్ లీక్ చేసే చాన్స్ ఉంటుంది కానీ సినిమా అంతా ఏ నిర్మాత చేస్తాడు..అలా అనడం చాల తప్పు.. ఆలా అనుకునే వాళ్ళు వారికి సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ వీడియో లీక్ అయితే అప్పుడు వారికే తెలుస్తుంది. ఈ కేసును డిల్లీ లో ఉండే కంప్యూటర్ రెస్పాన్స్ టీం టెక్ అప్ చేసారు. అలా ఆ టీం రెస్పాండ్ అయ్యి చేసాక మనం ఉన్నామని తెలిస్తే ఇంకేమైనా ఉందా..? ఈపాటికి మమ్మల్ని తుక్కు తీసేయరూ..? ఇకపై నిర్మాతలే లీక్ చేసి ఉంటారు అనే వారు నిజం తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది.

 

వదిలే ప్రసక్తే లేదు

పైరసీ లీక్ కేసులో కొంతమంది స్టూడెంట్స్ అరెస్ట్ అయ్యారు. అందులో నిందుతులను A,B కేటగిరీలుగా విడదీసాం. A కేటగిరీ లో అన్ని తెలిసి ఈ పనికి చేసిన వారుండగా B కేటగిరీ లో మాత్రం కొంతమంది అత్యుత్సాహంతో తెలియకుండా రెస్పాండ్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. Bకేటగిరీ లో ఉన్న స్టూడెంట్స్ పై కేర్ తీసుకొని శిక్ష వేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ A కేటగిరీ వాళ్ళను మాత్రం వదిలే ప్రసక్తే లేదు.. మేము వదిలినా ఈ కేసు టెక్ అప్ చేసిన టీం మాత్రం అస్సలు వదలరు. బికాస్ వారిపై దొంగతనం కేసులున్నాయి.

 

నరకం చూసాను 

నిజానికి మేము సినిమా విషయంలో అప్రమత్తంగా లేమనే మాట కరెక్ట్ కాదు. ప్రతీ సినిమాకు చాలా కేర్ తీసుకుంటాం. కాకపోతే హార్డ్ డిస్క్ లో అటు ఇతి తిరిగి డెలీట్ అయిన కంటెంట్ ను రికవరీ చేసి ఇదంతా చేసారు. జరిగింది తెలిసుకొని ఆశ్చర్యపోయాను. నిజంగా రిలీజ్ కి ముందు జరిగిన ఆ లీక్ వాళ్ళ నిర్మాతగా నరకం చూసాను. ఆ టైంలో పగవాడికి కూడా ఇలాంటి బాధ ఉండకూడదనిపించింది.

వాళ్ళిద్దరినీ అనుకున్నాం.. కానీ

ఈ సినిమాలో గీత క్యారెక్టర్ కి ముందుగా అను ఇమ్మానుయేల్ అనుకున్నాం.. కానీ ఆ టైమ్ లో అను ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య’ సినిమా చేస్తుండటంతో డేట్స్ కుదరలేదు. ఆతర్వాత లావణ్య త్రిపాటి ని ఫైనల్ చేసి ఫోటో షూట్ చేశాం. కానీ లావణ్య అప్పుడు తమిళ్ సినిమా చేస్తుండడంతో తనకి కూడా డేట్స్ ఇష్యూ వచ్చింది. చివరికి రష్మిక ఈ రోల్ కి అనుకోకుండా సెలెక్ట్ అయింది. అను కి కథ బాగా నచ్చడటంతో ఫస్ట్ ఒక గెస్ట్ అప్పిరియన్స్ ఉంది కదా నేను చేస్తాను అంటూ ఆ రోల్ చేసింది.

ఇండస్ట్రీ లో ఇదే ఫస్ట్ టైం

3 రోజులు కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి. మేము ఊహించిన దానికంటే రెండింతలు ఎక్కువే వచ్చాయి. నేను సంతోష పడింది ఏంటంటే.. ఇండస్ట్రీ లో ఫస్ట్ టైం రెండో రోజే డిస్ట్రి బ్యూటర్స్ అందరూ బ్రేక్ ఈవెన్ అయిపోయారు. ఓవర్సీస్ కూడా రెండో రోజుకే బ్రేక్ ఈవెన్ అయిపోయారు. కన్నడలో మొదటి రోజుకే బ్రేక్ ఈవెంట్ అయింది. తమిళ్ , కేరళ లో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. కేరళలో ఈ టైంలో అసలు కలెక్షన్స్ రావడం చాలా గ్రేట్ .. అందుకే అక్కడ వచ్చిన షేర్ అమౌంట్ ను వారి సహాయార్థం ఇవ్వబోతున్నాం.

అన్ ఎక్స్ పెక్టె డ్…. షాక్ అయ్యాం

తమిళ్ లో మొదటి రోజు ఊహించని విధంగా 1.18 కోట్లు గ్రాస్ వచ్చింది. ఒక్కసారిగా అందరం షాక్ అయ్యాం. అక్కడ మేము అమ్మింది 20 లక్షలకే(నవ్వుతూ).. అది నిజంగా మిరాకిల్ అనిపించింది. అర్జున్ రెడ్డి అక్కడ 32 లక్షలు వసూళ్ళు చేస్తే ఈ సినిమా మాత్రం అదిరిపోయే రేంజ్ లో వసూళ్ళు చేయడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది.

నిడివి వల్లే ..ఇంకా ఉంది

నాగబాబు గారి తో ఇంకా సీన్స్ ఉన్నాయి. కానీ నిడివి ఎక్కువ అవుతున్న కారణంగా ఆ ఫూటేజ్ ని వాడలేకపోయాం. కొన్ని అవసరమైన సన్నివేశాలు మాత్రమే సినిమాలో ఉన్నాయి.

పిలిచి మరీ అభినందించారు

ఈ సినిమా విషయంలో ఎన్నో అభినందనలు అందుకుంటున్నాం. ముఖ్యంగా నిన్న చాలా మంది ఇండస్ట్రీ వ్యక్తులు నన్ను పిలిచి బొకే ఇచ్చి అభినందించారు. ఒక నిర్మాతగా ఆ సమయంలో చెప్పలేనంత ఆనందంగా ఫీలయ్యాను.

నా లైఫ్ లో బెస్ట్ కాఫీ

ఎప్పుడో 20 ఏళ్ల వయసులో మెగా కాంపౌండ్ లో అడుగు పెట్టాను. అప్పటి నుండి ఇప్పటి వరకూ మెగా స్టార్ గారితో ఎక్కువ సమయం గడపలేదు. చెప్పాలంటే గట్టిగా ఒక ఐదు నిముషాలు కూడా మాట్లాడలేదు. కానీ ఈ సినిమా చూసి ఆయన ఇంటికి పిలిచి నాతో ఓ గంట సేపు గడిపారు. ఆ సమయంలో ఆయనతో కలిసి తాగిన కాఫీ నా లైఫ్ లో బెస్ట్ కాఫీ.. అది ఎప్పటికీ మర్చిపోలేని మూమెంట్.

సినిమా సక్సెస్ రేంజ్ చూపించమన్నారు

సినిమా చిరంజీవి గారికి బాగా నచ్చడం ఆయన మమ్మల్ని అభినందించడంతో సక్సెస్ మీట్ కి మీరు వస్తే బాగుంటుదని వెళ్లి అడిగాను. కచ్చితంగా వస్తాను. కాకపోతే ఏ రేంజ్ సక్సెస్ అనేది అక్కడ ఆ ఈవెంట్ లో కనిపించాలి. గ్రాండ్ గా ప్లాన్ చేయండి అంటూ చెప్పారు. ఆయన ఈ సినిమాను ప్రత్యేకంగా అభినందించడం ఎంతో సంతోశాన్నిచ్చింది.