ప్రియ దర్శి ఇంటర్వ్యూ

Thursday,June 20,2019 - 06:40 by Z_CLU

‘పెళ్లి చూపులు’తో నటుడిగా పరిచయమై తక్కువ టైంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగిన ప్రియదర్శి హీరోగా ‘మల్లేశం’ అనే  సినిమా చేసాడు. చింతకింది మల్లేశం బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమా రేపే రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ప్రియదర్శి మీడియాతో మాట్లాడాడు. ఆ విశేషాలు దర్శి మాటల్లోనే…

ఐదేళ్ళ గడువు…

విజువల్ ఎఫెక్ట్స్ కి సంబందించిన ఒక కంపెనీలో పని చేసాను. ఆ సమయంలో ఉద్యోగం పోతుందనగా యాక్టింగ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ముందుగా వీడియో చేసి అవి వైరల్ అయితే ఛాన్సులు వస్తాయని భావించాను. అప్పుడు ఓ ఐదేళ్ళు ప్రయత్నించి వర్కౌట్ అవ్వకపోతే ఇంక ఇండస్ట్రీ ని వదిలేద్దామని గడువు పెట్టుకున్నాను.

పెళ్లి చూపులు , ఘాజీ  హెల్ప్ అయ్యాయి

‘పెళ్లి చూపులు’ కమెడియన్ గా నాకు బ్రేక్ ఇస్తే ‘ఘాజీ’ నాలో మరో యాంగిల్ ఉందని తెలియజేసింది. నటుడిగా మరింత ముందుకు వెళ్ళడానికి ఆ రెండు సినిమాలు నాకు బాగా ఉపయోగపడ్డాయి. ఇప్పటికీ చాలా మంది నా సావు నేన్ సస్తా అంటూ ఆ డైలాగ్ చెప్తూ అన్న కిరాక్ చేసినవ్ అని చెప్తుంటారు.

ఆ రెండు సినిమాలతో నటుడిగా

వైఫ్ ఆఫ్ రామ్, కణం సినిమాలు నటుడిగా నన్ను మరో మెట్టు ఎక్కించాయి. దర్శి కమెడియన్ గానే కాదు మిగతా క్యారెక్టర్స్ కూడా చేయగలడు అనే నమ్మకం కలిగించాయి. ఆ సినిమాల వాళ్ళ నాకు మరిన్ని మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఎప్పుడూ ఒకే గీత మీదుంటే నాకు నచ్చదు. అన్ని క్యారెక్టర్స్ చేయాలనుంది.

చాలా హ్యాపీ గా ఫీలయ్యాను

మల్లేశం సినిమాకు రైటర్ గా పనిచేసిన అజయ్ వేగేశ్న గారు ‘అ’ సినిమా జరుగుతుండగా నన్ను మల్లేశం బయోపిక్ కి హీరోగా అనుకుంటున్నారని చెప్పారు. ఆయన చెప్పగానే చాలా హ్యాపీ గా ఫీలయ్యాను. అరె నిజమేనా ? అనిపించింది.

ఒక నెల మొత్తం స్టడీ చేసారు

రాజ్ రాచకొండ గారు నాతో మల్లేశం సినిమా తీస్తా అని చెప్పినప్పుడు నేను చేయగలనా … అని అడిగాను. మనసులో మాత్రం చేయాలనే తపన ఉంది. నువ్వే హీరో అని చెప్పాక ఆయన నేను చేసిన వీడియోస్ అన్నీ చూసి, నన్ను ఒక నెల పాటు స్టడీ చేసి ఫైనల్ గా షూట్ స్టార్ట్ చేద్దామని చెప్పారు.

ఇలాంటి ప్రేమకథ వినలేదు

మల్లేశం సినిమాలో తల్లి కొడుకుల మధ్య ఒక మంచి ఎమోషన్ ఉంది. నిజానికి తల్లి కొడుకుల మధ్య ఇలాంటి అందమైన ప్రేమ కథ నేను ఇంత వరకూ వినలేదు. ఆ ప్రేమని వెండితెరపై చూసి ప్రతీ కొడుకు తన తల్లి ని గుర్తుచేసుకుంటాడు.

అదే నాకు పెద్ద ఛాలెంజ్

మల్లేశం కి సంబంధించి నాకు అతి పెద్ద ఛాలెంజింగ్ అంటే అది మల్లేశం గారిలా మారడమే. నటుడిగా ఆ ట్రాన్స్ఫర్మేషన్ కష్టం అనిపించింది. అదే నాకు పెద్ద ఛాలెంజింగ్ అది మినహా ఇంకేం కష్టమనిపించలేదు.

టెన్షన్ గానే కలిశాను

ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు మల్లేశం గారిని కలవడం జరిగింది. ఒక గొప్ప వ్యక్తిని కలుస్తున్నాను అనే టెన్షన్ తోనే ఆయనని కలిశాను. కానీ ఆయన చాలా సింపుల్ గా కనిపిస్తూ వెల్కం చెప్పారు. కలిసిన వెంటనే ఆయన్ని కౌగిలించుకున్నాను. ఆ తర్వాత ఆయన మాకెన్నో విషయాలు చెప్పారు. వారి దాంపత్య జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు చెప్పడం జరిగింది. కానీ కొన్ని ఆయన చెప్పిన విధంగా తీయలేకపోయాము. ఆయన చెప్పింది విని మిగతా సన్నివేశాలు ఫిక్షన్ యాడ్ చేసి సినిమా చేయడం జరిగింది.

ఇమేజ్ అదొక శాపం

నిజానికి ఏ నటుడికి ఒకే ఇమేజ్ ఉండకోడదు. అది ఒకరకంగా శాపమే. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేయగలడు అనే గుర్తింపు రావాలి. అప్పుడే నటుడిగా మరింత ముందుకెళ్ళగలమని భావిస్తాను. అందుకే కెరీర్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాను. మల్లేశం నాకు ఇమేజ్ క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నాను.

కథలో స్త్రెంగ్థ్ అదే

కథలో మల్లేశం ఆసు యంత్రం తయారుచేసే విషయంతో పాటు ఆయన జీవన శైలి ఎలా ఉండేదనేది చూపించాం. నిజానికి కథలో స్త్రెంగ్థ్ అదే. ఆ సన్నివేశాలన్నీ మనసుకి హత్తుకునేలా ఉంటాయి.

 

ఆయనే నేర్పించారు

పెద్దింటి అశోక్ గారి డైలాగ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. కొన్ని సందర్భాల్లో తెలంగాణా పదాలను దగ్గరుండి మరీ చెప్పి నేర్పించారు. ఆయన సహకారంతోనే మేమందరం ఆపదాలను అలవోకగా పలికేసాం.

 

బెస్ట్ కాంప్లిమెంట్ అదే 

మల్లేశం సినిమాను ఇప్పటికే కొంత మంది చూసారు. చాలా మంది సినిమాకు సంబంధించి వారి అభిప్రాయం తెలియజేయడం జరుగుతుంది. ఇక చూసిన వారు వెండితెరపై దర్శి కనబడలేదు మల్లేశం కనిపించారు అని చెప్పారు. అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్. సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులందరూ అదే ఫీలయితే నటుడిగా సక్సెస్ అయినట్టే.

నెక్స్ట్ సినిమాలు

ప్రస్తుతం నేను నటించిన ‘బ్రోచేవారెవరురా’ రిలీజ్ కి రెడీ గా ఉంది. శర్వానంద్ హీరోగా ఎస్.ఆర్.ప్రభు నిర్మాణంలో ఓ బైలింగ్వెల్ సినిమా చేయబోతున్నాను. ఇంకా రెండు మూడు సినిమాలు టాక్ లో ఉన్నాయి.