ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ వరకు.. మహేష్ పాతికేళ్ల ప్రస్థానం

Wednesday,May 01,2019 - 01:01 by Z_CLU

ప్రిన్స్ మహేష్ బాబు అని పిలిచేవారు… మొదటి సినిమా ‘రాజకుమారుడు’ టైటిల్ మహేష్ బాబుకు అప్పట్లో పక్కా ఆప్ట్ అనిపించేది. ఓ రకంగా చెప్పాలంటే ఏదో కొత్త హీరో సినిమాల్లోకొచ్చేశాడు అనే కంటే ‘సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడు’ అనే బ్రాండ్ తోనే సినిమా ఆడేసేది. అలాగని మహేష్ బాబు ప్రిపేర్డ్ గా రాలేదు అనడానికి లేదు.. 2 వ సినిమాకే ప్రయోగం… యువరాజు లో ఫాదర్ రోల్ ప్లే చేశాడు. అదే ఏడాది రిలీజైన ‘వంశీ’ లో లవర్ బాయ్ గా నటించాడు. అయినా మహేష్ బాబులోని యాక్టర్ ని ఆడియెన్స్ రియలైజ్ అయింది మాత్రం ‘మురారి’ సినిమా తోనే.

‘మురారి’ తరవాత కూడా మహేష్ బాబు కరియర్ అంత ఈజీగా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత వచ్చిన ‘టక్కరిదొంగ’, ‘బాబీ’, సినిమాలు కూడా సక్సెస్ అందుకోలేకపోవడం మహేష్ బాబుకు పెద్ద చాలెంజ్ నే విసిరాయి. అప్పటికే 6 సినిమాలు… ‘ఏదో ఓ వరసలో సినిమాలొస్తున్నాయి అనిపిస్తున్నాడు కానీ… ఇండస్ట్రీలో నిలబడే కుర్రాడేనా మహేష్ బాబు..?’ అని చిన్నగా అనుమానాలు రేజ్ అవుతున్న టైమ్ లో రిలీజయింది ‘ఒక్కడు’. మహేష్ బాబు కరియర్ లో బిగ్గెస్ట్ హిట్.

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ సారి సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ బౌండరీని దాటి మాస్ ఆడియెన్స్ కి కూడా దగ్గర చేసింది. అక్కడి నుండి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు మహేష్ బాబు. అలాగని ఓ గ్రాండ్ సక్సెస్ అందుకుని అదే మూసలో సినిమాలు చేసుకుంటూ పోలేదు. ‘నిజం’ లో అమాయకుడిలా,  ‘నాని’లో ఎనిమిదేళ్ళ వయసున్న పాతికేళ్ళ కుర్రాడిలా నటించి ఇండస్ట్రీకి కొత్త కాన్సెప్ట్ నే పరిచయం చేశాడు. ఆ తరవాత వచ్చిన ‘అర్జున్’ కూడా కొత్తరకం కథే…

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడిగా పరిచయం అయిన ‘అతడు మహేష్ బాబును ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గర చేసింది. కానీ ఆ తరవాత వచ్చిన ‘పోకిరి’ సక్సెస్ మాత్రం ఇండస్ట్రీని షేక్ చేసి వదిలిపెట్టింది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా నుంచే మహేష్ సూపర్ స్టార్ అయ్యాడు. ఏ హీరో ఫ్యాన్ అయినా మహేష్ బాబుకు కూడా ఫ్యానే అనేంతలా ప్రతి ఒక్కరిని థియేటర్స్ కి రప్పించింది. ఆ తరవాత మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ వచ్చింది ‘దూకుడు సినిమాతోనే. ఈ సక్సెస్ కి ‘బిజినెస్ మెన్ సక్సెస్ కూడా కలిసి రావడంతో అటు ప్రయోగాలు.. ఇటు కలెక్షన్ రెండూ ఒకే ట్రాక్ పై నడుస్తున్నాయనిపించాయి.

మహేష్ బాబు ఫిల్మోగ్రఫీ గమనిస్తే ప్రయోగాలే ఎక్కువ. ‘బిజినెస్ మెన్ తరవాత వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నేనొక్కడినే, ఆగడు… వరసగా కొత్త రకం కథలే. అయితే ‘బిజినెస్ మెన్’ తరవాత ఆ రేంజ్ వైబ్స్ క్రియేట్ చేసింది ‘శ్రీమంతుడు’ సినిమానే.  ఆ తర్వాత వరసగా ‘బ్రహ్మోత్సవం, ‘స్పైడర్, ‘భరత్ అనే నేను’ ఇప్పుడు ‘మహర్షి’…. ఇలా పాతిక సినిమాలు…

ఈ సినిమాలో రిషి ‘మహర్షి గా మారడానికి ఎలాంటి జర్నీ చేశాడన్నది ప్రస్తుతానికి ఇంకా సస్పెన్స్ అయినా, ఈ ‘ప్రిన్స్’.. ‘సూపర్ స్టార్’ గా మారడానికి ఎంత స్ట్రగుల్ అయ్యాడో గమనిస్తే అద్భుతమనిపిస్తుంది.