బన్నీ కోసం కథ రాస్తున్నాను

Monday,October 09,2017 - 11:12 by Z_CLU

చాలా ఏళ్లుగా మెగా కాంపౌండ్ లో కొనసాగుతున్నాడు దర్శకుడు మారుతి. కానీ అల్లు శిరీష్ మినహా మిగతా మెగా హీరోలతో సినిమాలు చేయలేకపోయాడు. మరీ ముఖ్యంగా బన్నీ, చరణ్ తో సినిమాలు చేయాలనే కోరిక అలానే ఉండిపోయింది. తాజాగా మహానుభావుడుతో హిట్ కొట్టిన మారుతి.. ఎట్టకేలకు బన్నీ హీరోగా సినిమా చేసే అవకాశాన్ని అందుకోబోతున్నాడు. ఈ విషయాన్ని మారుతి స్వయంగా ప్రకటించాడు.

బన్నీ కోసం ప్రస్తుతం ఓ కథ రెడీ చేస్తున్నట్టు తెలిపాడు మారుతి. ప్రస్తుతం ఈ స్టోరీ, ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉందని.. నా పేరు సూర్య సినిమా కంప్లీట్ అయిన వెంటనే బన్నీకి ఈ స్టోరీ వినిపిస్తానని అంటున్నాడు మారుతి. ఇప్పటికే నాగచైతన్యతో ఓ సినిమాకు కమిట్ అయిన ఈ దర్శకుడు.. ఆ సినిమా కంప్లీట్ అయిన వెంటనే బన్నీతో చేయాల్సిన సినిమా పనులు ఊపందుకుంటాయని తెలిపాడు.

బన్నీ-మారుతి కాంబినేషన్ వర్కవుట్ అయ్యే అవకాశాలు ఈసారి కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిర్మాత, బన్నీ తండ్రి అల్లు అరవింద్ కూడా మారుతితో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే గీతా ఆర్ట్స్ బ్యానర్ పైనే అల్లు అర్జున్ హీరోగా మారుతి దర్శకత్వంలో సినిమా ఉండొచ్చు.