ఆ వర్మ బాటలో మరో వర్మ

Friday,May 29,2020 - 03:27 by Z_CLU

కరోనా వైరస్ పై ఇప్పటికే ఓ సినిమా ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ. దానికి సంబంధించి ఏకంగా టీజర్ కూడా రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తో మరో సినిమా రాబోతోంది. ఈసారి దర్శకుడు ప్రశాంత్ వర్మ.

‘అ!’, ‘క‌ల్కి’ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకొని ప్రామిసింగ్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న ఆయ‌న ఇప్పుడు త‌న మూడో చిత్రాన్ని వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిస్తున్నారు. ప్రపంచం మొత్తాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఈ సినిమా రాబోతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ తెలుగులో రాని జాన‌ర్‌లో ఈ చిత్రం రూపొందుతోంది.

వెన్ను జ‌ల‌ద‌రించే విజువ‌ల్స్‌, భ‌య‌పెట్టే బీజీఎంతో ప్రి-లుక్ పోస్ట‌ర్‌, మోష‌న్ పోస్ట‌ర్ ఒక‌వైపు ఆస‌క్తినీ, ఇంకోవైపు ఉద్వేగాన్నీ క‌లిగిస్తున్నాయి.

లాక్‌డౌన్ విధించ‌క ముందే ఈ చిత్రానికి సంబంధించి 40 శాతం చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. ఈ చిత్రానికి ప‌నిచేస్తోన్న తారాగ‌ణం, సాంకేతిక నిపుణులతో పాటు ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.