పవర్ 'ఫోక్' సాంగ్స్

Wednesday,April 19,2017 - 07:00 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జానపదాలంటే ఎంతిష్టమో అతడి సినిమాలు చూస్తే అర్థమైపోతుంది. ఇప్పటికే చాలాసార్లు జానపదాలతో ఎంటర్టైన్ చేసిన పవన్… మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో ఫోక్ సాంగ్ ట్రై చేస్తున్నాడట. మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్, పవన్ కోసం అదిరిపోయే ఫోక్ బీట్ రెడీ చేశాడని టాక్.

 

నిజానికి పవన్ కెరీర్ ఆరంభం నుంచే తన ప్రతీ సినిమాలో ఏదో ఒక చిన్న ఫోక్ బిట్ ఉండేలా జాగ్రత్త తీసుకునే వాడు.. ఇక తమ్ముడు సినిమాలో ‘ఏం పిల్ల మాట్లాడవా- ఓ పిల్లా పిల్లా’ అంటూ పవన్ పాడిన చిన్న జానపదం ఫాన్స్ లో ఎంతో జోష్ నింపింది..

తమ్ముడు సినిమాలో ఒకానొక సందర్భంలో మల్లికార్జునరావుని ఆటపట్టించే సిచ్యువేషన్ లో ‘తాటి చెట్టెక్కలేవు తాటికళ్ళు తెంపలేవు’ అంటూ పవన్ ఓ చిన్న బిట్ ఫోక్ సాంగ్ తో థియేటర్స్ లో హంగామా చేశాడు…

‘ఖుషి’ సినిమాలో అలీతో కలిసి భాధపడుతూ ‘బై బైయ్యే బంగారు రమణమ్మ’ అంటూ పవన్ పాడిన ఫోక్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ పాట కోసం మళ్లీ మళ్లీ సినిమా చూసిన వాళ్లు చాలామంది ఉన్నారు. థియేటర్లలో ఈ పాటకు ఒకటే ఈలలు, కేకలు.

పవన్ దర్శకత్వం వహించిన జానీ సినిమాలో కూడా ‘నువ్వు సారా తాగుడు మానురన్నో’ అంటూ సాగే ఓ ఫోక్ సాంగ్ పాడి కాసేపు ఎంటర్టైన్ చేశాడు పవన్..

గుడుంబా శంకర్ సినిమాలో ఓ సెపరేట్ ఫోక్ సాంగ్ తో అదుర్స్ అనిపించాడు పవర్ స్టార్. ‘కిల్లి కిల్లి’ అంటూ జోష్ ఫుల్ గా సాగే ఫోక్ సాంగ్ తో అప్పట్లో ఆడియన్స్ ను ఉర్రూతలూగించాడు..

ఇక ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ‘కాటమరాయుడా’ అనే ఫోక్ సాంగ్ తో పవన్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. సరదాగా బ్రహ్మానందంను ఆటపట్టించే సందర్భంలో వచ్చే ఈ సాంగ్ సినిమాకు స్పెషల్ హైలైట్ గా నిలిచింది.

లేటెస్ట్ గా పవన్ నటించిన ‘కాటమరాయుడు’ సినిమాలో కూడా ‘జివ్వు జివ్వు’ అనే సరదా ఫోక్ సాంగ్ ఫ్యాన్ లో ఖుషీ నింపింది. ఇలా తన ప్రతీ సినిమాలో ఏదో ఒక ఫోక్ సాంగ్ తో ఫాన్స్ ఎంటర్టైన్ చేసే పవన్.. తన కొత్త సినిమాలో కూడా జానపదానికి చోటిచ్చాడట.