"అలా" అమూల్యగా మారాను.. పూజా హెగ్డే ఇంటర్వ్యూ

Wednesday,January 15,2020 - 03:57 by Z_CLU

త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో అమూల్య పాత్రలో ప్రేక్షకుల్ని అలరిస్తోంది పూజా హెగ్డే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తన ఆనందాన్ని పూజా హెగ్డే మీడియాతో పంచుకుంది.

‘ఆలా వైకుంఠపురములో..’ ని మీ క్యారెక్టర్ కు మీరే డబ్బింగ్ చెప్పుకోవడం ఎలా అనిపిస్తోంది?
చాలా కష్టం. ఎందుకంటే తెలుగు నా ఫస్ట్ లాంగ్వేజ్ కాదు. ఇంగ్లీష్ పదాల్ని తెలుగులో చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఏదేమైనా నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకోవడం నా పర్ఫార్మెన్స్ మరింత ఎలివేట్ కావడానికి ఉపయోగపడుతోంది. డబ్బింగ్ కు సమస్య కాకుండా సీన్స్ తీసేటప్పుడు డైలాగ్ ఎలా చెప్పాలో నేర్చుకున్నా. ‘అల..వైకుంఠపురములో’ ని అమూల్య పాత్ర తో నేను మరింతగా తెలుగమ్మాయిని అయిపోయాను. బాలీవుడ్ జనాలు నన్ను హైదరాబాద్ అమ్మాయిననే అనుకుంటున్నారు.

‘అరవింద సమేత’కు కూడా మీరే డబ్బింగ్ చెప్పుకున్నారు కదా? అప్పటికీ ఇప్పటికీ మీ డబ్బింగ్ లో వచ్చిన మార్పేమిటి?
తెలుగు లైన్స్ ను అర్థం చేసుకొని వాటిని ఎలా చెప్పాలో తెలుసుకుంటున్నా. ఓవర్ యాక్టింగ్ చెయ్యడం నాకిష్టం ఉండదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పడం వల్ల ఒక్కోసారి మనం ఓవర్ యాక్టింగ్ చేసినట్లు అనిపిస్తుంది. నేను పర్ఫార్మ్ చేసిన దానికి ఆ డబ్బింగ్ డిఫరెంట్ గా ఉన్నట్లు ఫీలవుతాను. కొంతమంది మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్స్ మన పర్ఫార్మెన్స్ ను తమ డబ్బింగ్ తో మరింత ఎలివేట్ చేస్తారు. వాళ్లను నేను గౌరవిస్తాను. ‘అరవింద సమేత’ రిలీజయ్యాక ఒకరు “ఈ సినిమాకు మీకెవరు డబ్బింగ్ చెప్పారు? నేను కూడా చెప్పించుకుందామని అనుకుంటున్నా” అని మెసేజ్ పెట్టారు. అది నా డబ్బింగ్ కు లభించిన పెద్ద కాంప్లిమెంటుగా భావిస్తాను. అంటే ఒక తెలుగు అమ్మాయిలా అందులో మాట్లాడగలిగానని సంతోషం వేసింది.

తెలుగు నేర్చుకోవడానికి ట్యూటర్ ని ఎవరినైనా పెట్టుకున్నారా?
లేదు. నా మేనేజర్ తో, నా స్టాఫ్ తో నేను తెలుగులోనే మాట్లాడుతాను. కోచింగ్ కు ఎవర్నీ పెట్టుకోలేదు. ఇలాంటి ఇంటర్వ్యూల్లో తెలుగులో మాట్లాడాలంటేనే నాకు కొంచెం భయం వేస్తుంటుంది.

మూడోసారి కూడా మిమ్మల్ని రిపీట్ చెయ్యాలనిపిస్తోందని అల్లు అర్జున్ చెప్పిన దానికి మీ స్పందన?
మేం ఇప్పటి దాకా రెండు సినిమాలు కలిసి చేశాం. దాంతో మామధ్య సెట్స్ పై కంఫర్ట్ లెవల్ పెరిగింది. అది తెరపై కెమిస్ట్రీ రూపంలో కనిపించింది. అందుకే మామధ్య కెమిస్ట్రీ బాగుందని అందరూ అంటున్నారు. అందువల్లే అల్లు అర్జున్ ఆ మాట అన్నారు. ఆయన అన్నట్లుగానే ఇద్దరం కలిసి మరో సినిమా చెయ్యాలని ఆశిస్తున్నా.

అల్లు అర్జున్ గారితో డాన్స్ చెయ్యడం కష్టమనిపించేదా?
ఈ మూవీలో నాకు డ్యాన్సింగ్ ఎక్కువ లేదు. అన్నీ సింపుల్ స్టెప్సే. రిహార్సల్స్ కూడా చెయ్యలేదు. కాబట్టి బన్నీతో మ్యాచ్ కావడానికి నేను కష్టపడలేదు. నేను కెరీర్ మొదట్లోనే హృతిక్ రోషన్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి గ్రేట్ డాన్సర్స్ తో చేశాను. ఇప్పుడు మళ్లీ హిందీలో హృతిక్ రోషన్ తో చేస్తున్నా. వాళ్లందరితో నేను డాన్సుల్లో మ్యాచ్ అయ్యానని అనుకుంటున్నా.

 

సినిమాలో మీ ఫేవరేట్ సీన్ ఏమిటి?
నిజానికి సినిమాలో ‘బుట్టబొమ్మ’ సాంగ్ లీడ్ సీన్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే బోర్డ్ రూమ్ సీన్ కూడా ఇష్టం. ఆ రెండూ చాలా ఫన్నీగా ఉంటాయి.

 

చాలామంది హీరోలతో పనిచేసినా బన్నీకి ఫ్యాన్ అని చెప్పారు. ఎందుకని?
నేను అతని వర్క్ కు అభిమానిని. అతనితో కలిసి పనిచెయ్యడాన్ని ఎంజాయ్ చేస్తాను. అలాగే ప్రభాస్ తో పనిచెయ్యడాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నా.

ఒకేసారి మూడు నాలుగు సినిమాలు చేస్తుంటే, కష్టమనిపించడం లేదా?
నాలుగు సినిమాలు ఒకేసారి చెయ్యగల కెపాసిటీ నాకుంది. ఇప్పుడు తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాను కాబట్టి ఇంకో రెండు సినిమాలు హిందీలో చెయ్యగలను. ఇండియన్ స్టార్ కావడం నా లక్ష్యం. ఏదో ఒక భాషకే పరిమితం కావాలని నేననుకోవట్లేదు. నన్ను ఎవరు యాక్సెప్ట్ చేస్తే, అక్కడ సినిమాలు చెయ్యాలనుకుంటున్నా.