Weekend Release - పెద్దన్న, మారుతి మధ్యలో ఎనిమి

Wednesday,November 03,2021 - 01:42 by Z_CLU

Peddanna, Manchi Rojulochaie, Enemy releases this Weekend

ఈ వీకెండ్ ముచ్చటగా 3 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. దేన్నీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. హిట్టవ్వడానికి అన్ని సినిమాలకు ఈక్వెల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకీ ఆ 3 సినిమాలేంటి?

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది మంచి రోజులు వచ్చాయి సినిమా. ఇందులో హీరో సంతోష్ శోభన్ స్టార్ కాదు, కానీ ఈ సినిమాపై అంచనాలున్నాయి. దీనికి కారణం దర్శకుడు మారుతి. ఈ డైరక్టర్ తీసిన సినిమాలు కచ్చితంగా ఎంటర్ టైనింగ్ గా ఉంటాయి. ఫుల్ లెంగ్త్ కామెడీతో పైసా వసూల్ అనిపిస్తాయి. అందుకే మంచి రోజులు వచ్చాయి సినిమాపై అన్ని అంచనాలు. ఆ అంచనాలకు తగ్గట్టే ట్రయిలర్ పెద్ద హిట్టయింది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది.

రజనీకాంత్ నటించిన 168వ సినిమా పెద్దన్న. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. తెలుగులో ఈ సినిమాను నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు కలిసి రిలీజ్ చేస్తున్నారు. ఇదొక బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్ సినిమా. సినిమాలో రజనీకాంత్ చెల్లెలిగా కీర్తిసురేష్ నటించింది. రజనీకాంత్ సరసన హీరోయిన్ గా నయనతార నటించగా.. ఇతర కీలక పాత్రల్లో ఖుష్బూ, మీనా నటించారు. సెంటిమెంట్ తో పాటు.. మాస్-యాక్షన్ థమాకా ఈ సినిమా.

మారుతి, రజనీకాంత్ సినిమాలకు పోటీగా వస్తోంది ఎనిమి. ఇదొక మల్టీస్టారర్. విశాల్-ఆర్య హీరోలుగా నటించారు. యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. వాడు-వీడు సినిమా తరువాత మరోసారి ఎనిమీ అంటూ ఈ ఇద్దరూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌కు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గద్దలకొండ గణేష్ ఫేమ్ మృణాళిని రవి హీరోయిన్‌గా నటించగా.. ప్రకాష్ రాజ్, మమత మోహన్ దాస్ కీలక పాత్రల్లో నటించారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ట్రయిలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ 3 సినిమాలతో పాటు హాలీవుడ్ యాక్షన్ మూవీ ఇటర్నల్స్ కూడా థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాల్లో దీపావళి హిట్ గా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics