పవర్ స్టార్ మరోసారి మైక్ అందుకుంటాడా..?

Tuesday,July 11,2017 - 11:15 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి మైక్ అందుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదేదో పొలిటికల్ స్పీచ్ కోసం అందుకునే మైక్ కాదు. ఓ మంచి పాట పాడడం కోసం మైక్ అందుకోబోతున్నాడట పవన్ కల్యాణ్. అన్నీ అనుకున్నట్టు జరిగితే ప్రస్తుతం నటిస్తున్న సినిమాలోనే పవన్ ఓ పాట పాడే ఛాన్స్ ఉంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు పవన్ కల్యాణ్. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాలో కథాపరంగా వచ్చే ఓ సిచ్యుయేషన్ లో పవన్ వాయిస్ తో ఓ సాంగ్ పెడితే బాగుంటుందని త్రివిక్రమ్, అనిరుధ్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి అనిరుధ్ ఇప్పటికే ట్యూన్ లాక్ చేశాడట. ఇక పవన్ ఓకే చేయడమే ఆలస్యం.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే బల్గేరియాలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ చివరినాటికి షూటింగ్ కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి ఖుష్బూ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.