Pawan-Prakash Raj - కాంట్రవర్సీ క్లియర్

Tuesday,April 06,2021 - 10:06 by Z_CLU

ఓవైపు వకీల్ సాబ్ సినిమా షూటింగ్ నడుస్తోంది. మరోవైపు పవన్ కల్యాణ్ పై ప్రకాష్ రాజ్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఓ టీవీ ఛానెల్ లో మాట్లాడుతూ.. పవన్ తరుచుగా మాటలు మారుస్తారని, ఊసరవెల్లిలా వ్యవహరిస్తున్నారంటూ చాలా పెద్ద పదమే వాడారు.

అప్పట్లో దీనిపై పవన్ ఫ్యాన్స్ తో పాటు నాగబాబు లాంటి కొంతమంది చాలా ఫైర్ అయ్యారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం రియాక్ట్ అవ్వలేదు. ఇన్నాళ్లకు ప్రకాష్ రాజ్ పై స్పందించడానికి పవన్ కు ఓ వేదిక దొరికింది. అప్పట్లో ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై పవన్ రియాక్ట్ అయ్యారు.

“కొన్ని సార్లు ఓ బలమైన నటుడు మన ఎదురుగా ఉంటే పెర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది. వకీల్ సాబ్ కోసం మరో లాయర్ గా ప్రకాష్ రాజ్ ను తీసుకోవడం నాకు బాగా హెల్ప్ అయింది. ప్రకాష్ రాజ్, నేను రాజకీయంగా విభిన్నమైన దారుల్లో ఉండొచ్చు కానీ సినిమా పరంగా మేమంతా ఒకటే. ఆ మధ్య ఛానెల్స్ లో ప్రకాష్ రాజ్ నా గురించి ఏదో మాట్లాడారు. నేను ఇబ్బంది పడలేదు. అది ఆయన అభిప్రాయం. నేను గౌరవిస్తాను. సినిమాల పరంగా వస్తే మాత్రం ప్రకాష్ రాజ్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి.”

ఇలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల్ని తేలిగ్గా తీసుకుంటున్నట్టు ప్రకటించారు పవన్. వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడిన పవన్.. సీఎం సీఎం అంటూ అరుస్తున్న అభిమానులకు కూడా క్లారిటీ ఇచ్చారు.

“ముఖ్యమంత్రి పదవి అనేది జరగాలి. అది మనం కోరుకుంటే వచ్చేది కాదు. నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఆ టైమ్ లో ఉన్నతమైన స్థానం వస్తే సంతోషం. అభిమానుల గుండెల్లో ఉన్న స్థానం కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. నేను ఏదీ ఆశించను. సమాజం కోసం పనిచేసే వ్యక్తిని నేను.”

తనకు బాగా పొగరని కొందరు భావిస్తారని, కానీ తనకు పొగరు లేదంటున్నారు పవన్. తనదైన ప్రపంచంలో తను బతుకుతుంటానని, దాన్ని చూసి కొంతమంది పొగరుగా భావిస్తుంటారని చెప్పుకొచ్చారు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics