ప్రేక్షకుల 'ఖుషి' కి 20 ఏళ్లు!

Tuesday,April 27,2021 - 02:15 by Z_CLU

2001 సంవత్సరం ఏప్రిల్ 27…. థియేటర్స్ అన్నీ కిక్కిరిసిపోయాయి. కౌంటర్ దగ్గర టికెట్టు దొరికిన జనాలు పూనకమొచ్చినట్టు ఊగిపోతున్నారు. అప్పటికే సూపర్ డూపర్ హిట్టైన పాటలు పాడుకుంటూ థియేటర్స్ లో ప్రేక్షకులు ‘ఖుషి’ అవుతుంటే సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ తెగ సంబరపడిపోతున్నారు. టికెట్టు కొన్న ప్రేక్షకుడిని , సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్ ని, ఫైనల్ గా నిర్మాతను విపరీతంగా సంతోషపెట్టిన ఆ సినిమానే ‘ఖుషి’.

అప్పటికే మెగా బ్రదర్ అనే బ్రాండ్ నుండి పవర్ స్టార్ అనే ఇమేజ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ తో ఏ.ఎం.రత్నం ఓ సినిమా చేయాలనుకున్నారు. ‘చెప్పాలని ఉంది’ అనే టైటిల్ తో సినిమా మొదలు పెట్టారు. ఫస్ట్ షెడ్యుల్ తర్వాత కొన్ని స్టిల్స్ కూడా బయటికొచ్చాయి. కానీ ఎందుకో ఆ సినిమా షూటింగ్ దశలోనే ఆగిపోయింది. ఈ సారి పవన్ తో ఎట్టి పరిస్థితుల్లో సినిమా చేయాలనుకున్న నిర్మాత ఏ.ఎం.రత్నం కళ్ళ ముందు తను తీసిన ‘ఖుషి’ తమిళ్ సినిమా కనిపిస్తుంది. తమిళ్ లో సూపర్ హిట్టైన ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని పవన్ ని ఓ షూటింగ్ లో కలిసి చెప్పారు రత్నం. వెంటనే పవన్ కోసం తమిళ్ సినిమా స్పెషల్ షో వేశారు. కాలేజీ బ్యాక్ డ్రాప్ , లవ్ స్టోరీ , ఎమోషన్ అన్నీ పవన్ కి నచ్చేశాయి. సినిమా చూసిన అనంతరం వెంటనే చేసేద్దాం అంటూ రత్నం గారితో అనేసి ఇంటికెళ్ళిపోయాడు పవన్.

pawan kushi movie 20 years zeecinemalu

ఈ రీమేక్ కోసం తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం లేని ఎస్.జే.సూర్య ను దర్శకుడిగా ఎంచుకున్నారు ఏ ఎం రత్నం. మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మ ని తీసుకున్నారు. పవన్ పక్కన హీరోయిన్ గా భూమిక ని ఓకే చేశారు. ఇలా తెలుగు రీమేక్ పనులన్నీ చక చకా జారిపోయాయి. రత్నం ఈ రీమేక్ సినిమాతో పెద్ద సాహసమే చేస్తున్నాడే అంటూ ఓ వైపు… తెలుగు సినిమాకి అరవ దర్శకుడిని తీసుకున్నారు అతనికి మన ప్రేక్షకుల గురించి ఏం తెలుసని ? అంటూ ఇంకో వైపు… ఇలా ఎవరికి తోచింది వారు మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా తమిళ్ కంటే తెలుగులో సినిమా పెద్ద హిట్టవుతుందని మాత్రమే నమ్మి నిర్మాత ఏ ఎం రత్నం ముందుకుసాగిపోయారు.

షూటింగ్ పూర్తయింది. సినిమా బాగా వచ్చింది. ఏ ఎం రత్నం …హీరో పవన్ …దర్శకుడు సూర్య మిగతా టీం అంతా హ్యాపీ. ఎట్టకేలకు సినిమా థియేటర్స్ లోకొచ్చింది. వచ్చిన రోజు ఏం జరిగిందో..? రోజు రోజుకీ పెరిగిన కలెక్షన్స్ తో నిర్మాత , డిస్ట్రిబ్యూటర్స్ లను సినిమా ఎంతలా ఖుషి చేసిందో కలెక్షన్స్ సాక్షిగా అందరికీ తెలిసిందే. సినిమా విడుదలైన రోజు నుండి కాలేజీలో విద్యార్థుల ఎటెండెన్స్ తగ్గిపోయింది. కాలేజీలకని ఇంటినుండి బయలుదేరిన కుర్రకారు థియేటర్స్ లో మళ్ళీ మళ్ళీ ఎగబడి సినిమా చూస్తూ ఖుషి అవుతుంటే అసలీ సినిమాలో ఏముంది? అంటూ ఫ్యామిలీస్ రాక కూడా పెరిగింది. రిలీజ్ కి ముందే వాక్ మెన్ లో పెట్టుకొని పదే పదే వినే మణిశర్మ పాటల నుండి సినిమాలో వచ్చే క్లైమాక్స్ వరకూ ఈ సినిమా పంచిన సంతోషం ఇంతా అంతా కాదు. కథ పరంగా ‘ఖుషి’ జస్ట్ సింపుల్ అనిపించినా స్క్రీన్ ప్లే మాత్రం సినిమాను బ్లాక్ బస్టర్ రేంజ్ కి తీసుకెళ్ళింది.

pawan kushi movie 20 years zeecinemalu

సిద్దు పాత్రలో పవన్ నటన , మేనరిజమ్స్, హై వోల్టేజ్ ఎనర్జీ యూత్ కి కిక్ ఇచ్చాయి. పవన్ మీద మరింత అభిమానం పెంచేలా చేసిన సినిమాల్లో ఖుషి ఒకటి. మధుమిత పాత్రలో భూమిక కుర్రాళ్ళకి బాగా నచ్చేసి వారి గుండెల్లో గూడు కట్టేసుకుంది. పవన్ -భూమిక కెమిస్ట్రీ ఈ లవ్ స్టోరికి మరింత బలం చేకూర్చింది. ఇక సినిమాలో వచ్చే నడుము సీన్ ఇప్పటికీ మర్చిపోలేరు ప్రేక్షకులు. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ సీన్. అందుకే ఖుషి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆ సీనే. సినిమాలో అదో ఐకానిక్ సీన్ అయ్యింది. లవ్ సీన్స్, పవన్, ఆలి ల కామెడీ ట్రాక్ , మ్యూజిక్ , క్లైమాక్స్ లో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ ఇలా ప్రతీది టికెట్టు కొని సినిమాకొచ్చిన ప్రేక్షకుడిని ఖుషి చేశాయి. ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ‘ఖుషి’ గా చెప్పుకుంటున్నామంటే మనల్నీ ఈ సినిమా ఎంతలా ‘ఖుషి’ చేసిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే తెలుగు ప్రేమకథల్లో ‘ఖుషి’ ఓ బెస్ట్ సినిమాగా చెప్పుకుంటారు.

-రాజేష్ మన్నె

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics