మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవన్

Monday,January 20,2020 - 12:26 by Z_CLU

అభిమానుల కల నెరవేరింది. పవన్ మరోసారి ముఖానికి రంగేసుకున్నారు. కెమెరా ముందుకొచ్చారు. అవును.. ఈరోజు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ షురూ అయింది. పింక్ తెలుగు రీమేక్ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో పవన్ కల్యాణ్ జాయిన్ అయ్యారు.

అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన ప్రత్యేకమైన కోర్టు సెట్ లో ఇవాళ్టి నుంచి పవన్ పై సన్నివేశాలు తీస్తున్నారు. దాదాపు 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ నడుస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణుశ్రీరామ్ దర్శకుడు. బోనీ కపూర్ సహ-నిర్మాత.

హిందీలో అమితాబ్ బచ్చన్, తమిళ వెర్షన్ లో అజిత్ పోషించిన పాత్రను తెలుగులో ఇప్పుడు పవన్ కల్యాణ్ పోషిస్తున్నాడు. తాప్సి పోషించిన పాత్రలో నివేత థామస్ కనిపించనుంది. మరో 2 కీలక పాత్రల్లో అనన్య, అంజలి కనిపించబోతున్నారు.

తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది సమ్మర్ తర్వాత సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.