Kalapuram Movie - పవర్ స్టార్ చేతుల మీదుగా ట్రయిలర్ లాంచ్

Sunday,August 14,2022 - 12:38 by Z_CLU

‘పలాస 1978’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ లాంటి సినిమాలు తీసిన దర్శకుడు క‌రుణ కుమార్. ఈసారి ఈ డైరక్టర్, తన పంథాకు భిన్నంగా కామెడీ డ్రామా కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మే ‘కళాపురం’. ‘ఈ ఊరిలో అందరూ కళాకారులే’ అనేది క్యాప్షన్. ఆగస్ట్ 26న సినిమా రిలీజ్ అవుతోంది. జీ స్టూడియోస్‌, ఆర్ 4 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ర‌జనీ తాళ్లూరి.. కళాపురం సినిమాను నిర్మిస్తున్నారు. స‌త్యం రాజేష్‌, చిత్రం శ్రీను, ర‌క్షిత్ అట్లూరి త‌దిత‌రులు న‌టించారు.

ఇప్ప‌టికే విడుద‌లైన క‌ళాపురం సినిమా ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్, పోస్ట‌ర్స్, సాంగ్‌ అన్నీ సినిమాపై ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచాయి. ఇప్పుడీ అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచేలా మేక‌ర్స్ క‌ళాపురం సినిమా ట్రైల‌ర్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి సినిమా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని చిత్ర యూనిట్‌ను అభినందించారు.

నిమిషం 57 సెక‌న్ల నిడివి ఉన్న ఈ ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. సినిమాలో ప్ర‌తి క్యారెక్ట‌ర్‌.. ఆ క్యారెక్ట‌ర్ ఛాలెంజెస్ ఏంటి అనే విష‌యాల‌ను కామెడీ కోణంలో ఆవిష్క‌రించారు. ఓ దర్శ‌కుడు, నిర్మాత క‌లిసి ఒక సినిమాను చేయాల‌నుకుంటారు. అయితే తాను ఉంటున్న క‌ళాపురం గ్రామంలో కొంత సినిమా షూటింగ్ చేయాల‌నే కండీష‌న్ మీద నిర్మాత సినిమాను స్టార్ట్ చేస్తాడు. అయితే డ‌బ్బు కోసం మ‌ధ్య‌లో పోలీసులు, విల‌న్ ఎంట్రీ ఇస్తారు. అలాంటి ప‌రిస్థితుల్లో ద‌ర్శ‌కుడు, నిర్మాత క‌లిసి సినిమాను ఎలా పూర్తి చేశార‌నేదే సినిమా. స‌త్యం రాజేష్ ఇందులో డైరెక్ట‌ర్ పాత్ర‌ను పోషించాడు.

ట్రైల‌ర్ చూస్తుంటే విజువ‌ల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క‌రుణ కుమార్ సినిమాలోని పాత్ర‌ల‌ను చూపించిన తీరు, దాని వ‌ల్ల వ‌చ్చే కామెడీ ప్రేక్ష‌కుల‌కు ఫన్ అందిస్తుందేమో చూడాలి.

స‌త్యం రాజేష్‌, చిత్రం శ్రీను, ర‌క్షిత్ అట్లూరి త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న క‌ళాపురం చిత్రానికి, మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.