అఫీషియల్: గీతా ఆర్ట్స్ లో మూడో సినిమా

Monday,December 24,2018 - 05:21 by Z_CLU

ప‌రశురామ్… ఈత‌రం ద‌ర్శ‌కుల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు. చేసింది త‌క్కువ సినిమాలే అయినా.. వాటితోనే ప్ర‌త్యేక‌మైన‌ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది గీత‌గోవిందంతో సంచ‌ల‌నం సృష్టించాడు ప‌రశురామ్. ఇప్పటివరకు పరశురాం చేసిన సినిమాలు ఒకెత్తు. గీత‌గోవిందం మ‌రో ఎత్తు. విజ‌య్ దేవ‌రకొండ హీరోగా వ‌చ్చిన ఈ చిత్రం 100 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ప‌రశురామ్ ను స్టార్ డైరెక్ట‌ర్ గా మార్చేసింది.

ఇప్పుడు ఈయ‌న కోసం చాలా మంది యంగ్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. గీతా ఆర్ట్స్ లోనే వ‌ర‌స‌గా మూడో సినిమా చేయ‌బోతున్నాడు ప‌రశురామ్. ఈ బ్యాన‌ర్ లో వ‌ర‌స‌గా మూడు సినిమాలు చేస్తున్న తొలి ద‌ర్శ‌కుడు ప‌రశురామే కావడం విశేషం. అంత ఈజీగా ఎవ‌రికీ మూడో అవ‌కాశం ఇవ్వ‌ని అల్లు అర‌వింద్.. ఈ ద‌ర్శ‌కుడి టాలెంట్ తెలిసి మ‌రో ఆఫ‌ర్ ఇచ్చేసాడు.

గీతా ఆర్ట్స్ లోనే పరశురాం సినిమా చేస్తున్నాడంటూ ఇప్పటికే గాసిప్స్ వచ్చాయి. ఆ విషయాన్ని ఈరోజు గీతాఆర్ట్స్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసింది. ప్ర‌స్తుతం క‌థ సిద్ధం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు పరశురామ్. లీడింగ్ హీరోతో త్వ‌ర‌లోనే పెద్ద సినిమా చేయ‌బోతున్నాడు.