ఓం నమో వేంకటేశాయ సెన్సార్ పూర్తి

Wednesday,February 01,2017 - 06:14 by Z_CLU

కింగ్ నాగార్జున నటించిన భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ. ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది. సినిమాకు సెన్సార్ బోర్డ్ క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. సినిమాలో నాగార్జునకు మరదలిగా ప్రగ్యా జైశ్వాల్ నటించగా.. ఓ కీలక పాత్రలో అనుష్క మెరవనుంది.

వేంకటేశ్వర స్వామికి పరమభక్తుడైన హథీరాం బాబా జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. చాలామంది తెలుగువాళ్లకు హాథీరాం బాబా జీవితం గురించి తెలియదు. ఆ మహా భక్తుడి జీవితాన్ని తెలుగు వాళ్లకు అందించే ప్రయత్నమే ఓం నమో వేంకటేశాయ. ఈ సినిమాలో వేంకటేశ్వర స్వామిగా సౌరభ్ జైన్ నటించాడు. కీరవాణి కంపోజ్ చేసిన పాటలకు ఇప్పటికే మంచి ఆదరణ దక్కింది. ఈ ఏడాది నాగార్జున నుంచి వస్తున్న మొదటి చిత్రం ఇదే.

om-namo-venkatesaya-2

భక్తిరస చిత్రాల కేటగిరీలో నాగార్జున-రాఘవేంద్రరావుది సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. అదే కోవలో ఇప్పుడు ఓం నమో వేంకటేశాయ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందంటున్న నాగ్… భారీ స్థాయిలో సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.