Nuvve Kavali - 20 ఏళ్ల స్నేహం-ప్రేమ

Tuesday,October 13,2020 - 09:40 by Z_CLU

2000 సంవత్సరం… అక్టోబర్ 13

కొత్తవాళ్లు నటించిన ఓ ప్రేమకథ థియేటర్స్ లోకొచ్చింది. రిలీజ్ రోజు పెద్దగా జనం లేరు. దాంతో ఎక్కడా సందడి లేదు. కానీ తొలి రోజే సూపర్ హిట్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి మెల్లగా జనాల రాక పెరిగింది. మూడో రోజు నుంచి టికెట్లు లేవంటూ హౌస్ ఫుల్ బోర్డులెట్టడం మొదలెట్టారు. అక్కడి నుండి సినిమా ఎవరూ ఊహించని విధంగా ఇండస్ట్రీ హిట్ రేంజ్ కెళ్లింది. మళ్లీ మళ్లీ చూడ్డానికి ప్రేక్షకులకు బెస్ట్ లవ్ స్టోరి కావాలి. సరిగ్గా అదే టైంలో వచ్చింది ‘నువ్వే కావాలి’. చిన్న బడ్జెట్ సినిమా, పైగా డెబ్యూ హీరో ఏంటీ వసూళ్ల సునామీ..? అంటూ ఇండస్ట్రీలో అనుభవమున్న వారు కూడా షాక్ తిన్నారు. కుర్రకారు థియేటర్స్ లోనే పాగా వేసి మళ్లీ మళ్లీ చూస్తుంటే, కుటుంబాలు కూడా ఈ లవ్ స్టోరిని ఆదరించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించారు.

nuvve kavali 20 years Tarun richa

 

అప్పటి తరం యువతకి ఇప్పుడు ‘నువ్వే కావాలి’ అన్న సౌండ్ వినబడితే చాలు థియేటర్స్ లో సందడి చేసిన రోజులు, బాగా కనెక్ట్ అయిన ఆ ప్రేమ సన్నివేశాలు ముఖ్యంగా ఓ ఊపు ఊపేసిన పాటలు ఇలా అన్ని కళ్ళముందు కనబడుతూ సినిమా ఆడే రోజులు గుర్తొస్తాయి. కొన్ని ప్రేమకథలు ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయి బెస్ట్ లవ్ స్టోరీస్ కేటగిరిలో కెళ్లిపోతాయి. ఆ లిస్టులో, ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికి ప్రధమ స్థానంలో పదిలంగా ఉంటుందీ ప్రేమకథ.

నువ్వే కావాలి

‘నువ్వే కావాలి’ రీమేక్ సినిమా అన్న సంగతి చాలా మందికి తెలియదు. అవును ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ లవ్ స్టోరి మళయాళంలో సూపర్ హిట్ అయిన ‘నిరమ్’ అనే సినిమాకు రీమేక్.

మళయాళం లో ‘నిరమ్’ సినిమా చూసిన నిర్మాత స్రవంతి రవికిశోర్ పట్టుబట్టి మరీ పోటీ మధ్య 5 లక్షల రూపాయలతో రీమేక్ రైట్స్ తీసుకొని రామోజీ రావు గారితో కలిసి ఈ సినిమా నిర్మించారు. నిజానికి పూర్తి బడ్జెట్ పెట్టింది రామోజీ రావు గారే. రవి కిషోర్ గారు ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ గా నిర్మాణ బాధ్యతలు దగ్గరుండి చూసుకున్నారు. అందుకు గానూ లాభాల్లో 20 శాతం వాటాను అందుకున్నారు. విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు త్రివిక్రమ్ సంభాషణలు అందించాడు. అప్పటికే ‘స్వయంవరం’ తో సూపర్ హిట్ కొట్టిన విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ ఈ రీమేక్ కోసం రెండో సారి కలిసి పనిచేశారు.

నువ్వేకావాలి

చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసిన తరుణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది. నటి రోజారమణి తనయుడిగా ‘నువ్వే కావాలి’ తో హీరోగా పరిచయమైన తరుణ్ ఈ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు. ఎక్కడికెళ్లినా ఎగబడి ఆటోగ్రాఫులు, ఫోటోగ్రాఫ్స్ తీసుకునే స్టార్ డమ్ అందుకున్నాడు. మా కథకి నువ్వే కావాలి అంటూ తరుణ్ వెంటపడిన దర్శక నిర్మాతలెందరో. ఈ సినిమా తర్వాత హీరోగా తరుణ్ లెక్కలేనన్ని ఆఫర్స్ అందుకున్నాడు. డెబ్యూ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఘనమైన రికార్డు ఇప్పటికీ తరుణ్ దే.

ఈ రీమేక్ కి ముందుగా కొందరు హీరోలను అనుకున్నారు. కానీ ఈ క్లాసిక్ సినిమాతో తరుణ్ లాంచ్ అవ్వాలని రాసున్నప్పుడు మరో హీరో ఎలా చేస్తాడు చెప్పండి. అందుకే కథ మళయాళం నుండి వెతుక్కుంటూ నేరుగా తరుణ్ ని చేరింది. అలాగే హీరోయిన్ గా రిచాను ఆడిషన్స్ లో సెలెక్ట్ చేశారు. ఏ ప్రేమకథ కయినా హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ పండాలి. లేదంటే కథ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వదు. సినిమాకు తరుణ్-రిచా కెమిస్ట్రీ పెద్ద ప్లస్ పాయింట్. కొన్ని సన్నివేశాల్లో నటించమంటే ఇద్దరూ జీవించేశారు. అందుకే కదా వెండితెర ప్రేమజంటల్లో తరుణ్- మాధవి (రిచా పాత్ర పేరు) లకు మన మదిలో ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాగే సింగర్ రామకృష్ణ గారబ్బాయి సాయి కిరణ్ ఈ సినిమాతోనే నటుడిగా పరిచయం అయ్యాడు.

నువ్వే కావాలి

ఇక సునీల్ పంచులు, ఎమ్మెస్ నారాయణ, కోవై సరళ, అన్నపూర్ణమ్మ కామెడీ కూడా సినిమాలో మంచి వినోదం పంచాయి. ముఖ్యంగా కోవై సరళ షుక్రియా కామెడీ ట్రాక్ థియేటర్స్ లో బాగా పేలింది. కమెడియన్ గా సునీల్ కి కూడా సినిమా మంచి పేరు తెచ్చింది. ఇక హీరోయిన్ ప్రేమ ఓ గెస్ట్ రోల్ లో కనిపించగా కాలేజ్ లో వచ్చే స్పెషల్ సాంగ్ లో మరో హీరోయిన్ లైలా డాన్సులతో ఆకట్టుకుంది.

విజయ్ భాస్కర్ తన స్క్రీన్ ప్లే , టేకింగ్ తో తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఈ ప్రేమకథను తెరకెక్కిస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు థియేటర్స్ లో క్లాప్స్ కొట్టించాయి.

*”గొంతులో ఉన్న మాట అయితే నోటితో చెప్పగలం, కానీ మనసులో ఉన్న మాటను కళ్ళతోనే చెప్పగలం”,

*”వంట దూరంగా ఉంటే వేడి తెలీదు, మనిషి దగ్గరగా ఉంటే ప్రేమ తెలీదు” ,

*”ఇష్టపడితే భయపడకు, భయపడితే ఇష్టపడకు, ఇష్టపడి భయపడితే బాధ పడకు”

*”అన్నదమ్ములు విడిపోవాలంటే ఆస్తి పంపకాలున్నాయి, మొగుడు పెళ్ళాం విడిపోవాలంటే విడాకులున్నాయి, కానీ స్నేహితులు విడిపోవాలంటే చచ్చిపోవాలి అంతే”… లాంటి త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ థియేటర్స్ లో బాగా పేలాయి.

అలాగే “ప్రేమకి స్నేహం కన్నా మంచి పునాది ఏముంటుంది” అంటూ ఒకే డైలాగ్ తో సినిమా కథాంశాన్ని అందంగా చెప్పాడు. ఈ డైలాగ్ ను సినిమాలో రెండు సందర్భాల్లో వాడాడు త్రివిక్రమ్.

సాలూరి కోటేశ్వరావు అలియాస్ కోటి సమకూర్చిన పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాలా… “ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది.” అంటూ పాట రాగానే ఇప్పటికీ ఆటోమేటిక్ గా సౌండ్ పెంచేస్తాం అది చాలదూ ఈ సాంగ్ మన గుండెల్లో ఏ స్థానంలో ఉందో చెప్పడానికి. ఇక “అనగనగా ఆకాశం ఉంది”, “షుక్రియా”, “కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు” సాంగ్స్ కూడా పెద్ద హిట్ అయ్యి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ సందర్భంలో సిరివెన్నెల సీతారామ శాస్ట్రీ గారిని అలాగే భువన చంద్ర గారిని కూడా గుర్తుచేసుకోవాలి. కోటి ట్యూన్స్ కి తమ సాహిత్యంతో మరింత అందం తీసుకొచ్చి మ్యూజిక్ లవర్స్ కి బెస్ట్ సాంగ్స్ అందించారు.

సినిమాలో కొన్ని సన్నివేశాల గురించి ప్రస్తావిస్తే…

మాధవి ఓ డ్రామా వేయడం కోసం తరుణ్ ని విడిచిపెట్టి కాలేజ్ ఫ్రెండ్స్ తో బెంగుళూర్ వెళ్తుంది. చిన్నతనం నుండి కలిసి పెరిగిన ఇద్దరు ఆ సమయంలో ఒకరినొకరు బాగా మిస్ ఆవుతుంటారు. మాధవి లేకపోవడంతో తరుణ్ ఒంటరి వాడైయినట్టు ఫీలవుతాడు. అప్పటి వరకూ సరదాగా సాగిన ఈ ప్రేమకథతో అక్కడి నుండి అసలు కథ మొదలవుతుంది. మాధవి ను ప్రేమిస్తున్నాని తెలుసుకున్న ఆ విషయం బయట పెడితే ఎక్కడ మధు తన ఫ్రెండ్షిప్ వదులుకుంటుందో అని భయపడి తన ప్రేమను దాచేస్తూ లోలోపలే కుమిలిపోతుంటాడు తరుణ్ . ఆ క్షణం నుండి మనం చూస్తున్నది వెండితెరపై ఓ ప్రేమకథని మర్చిపోయి తరుణ్ ఎప్పుడెప్పుడు మధుకి తన ప్రేమ సంగతి చెప్తాడా అంటూ చివరి వరకు ఎదురుచూసాం.

సినిమాలో ప్రేక్షకులను హత్తుకున్న రెండు సన్నివేశాల గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. బాస్కెట్ బాల్ కోర్ట్ లో “తరుణ్…నేను మధు కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి ఒక ఐదు నిమిషాలు నువ్వు” అంటూ ప్రకాష్ తరుణ్ కి చెప్పడం, అలాగే మరో సందర్భంలో ‘టికెట్స్ ఇద్దరికే బుక్ చేశా’ అంటూ ప్రకాష్ తరుణ్ ని థియేటర్ నుండి వెనక్కి పంపేయడం…మధు ప్రకాష్ లవ్ ను యాక్సెప్ట్ చేశాక వచ్చే ఈ రెండు సన్నివేశాలకు ప్రేక్షకుల గుండెలు బరువెక్కాయి. అక్కడ నుండి తరుణ్ క్యారెక్టర్ మీద ఆడియన్స్ కి సింపతీ కలుగింది.

ఇక ప్రీ క్లైమాక్స్ లో “ప్రకాష్ కంటే ముందే నన్ను నువ్వెందుకు లవ్ చేయలేదురా నేను నీకు నచ్చలేదా” అంటూ మధు తరుణ్ ని ప్రశ్నించడం, ఆ వెంటనే తరుణ్ మధుని కౌగిలించుకొని ఏడవడం, క్లైమాక్స్ కి ముందు వచ్చే “కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు” సాంగ్ పిక్చరైజేషన్ ప్రేక్షకుల కళ్ళలో నీళ్లు తెప్పించాయి.

సినిమాలో ఓ సందర్భంలో తరుణ్ తండ్రి పాత్ర పోషించిన గిరిబాబు” గత పదేళ్ళలో ఎప్పుడు చూడని సీన్ చూసే సరికి తట్టుకోలేకపోయా”అంటాడు. సరిగ్గా థియేటర్ లో ప్రేక్షకులు ఇలాగే ఫీలై గత పదేళ్ళలో ఇలాంటి ప్రేమకథ చూడలేదని క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు చూస్తూ తట్టుకోలేకపోయారు.

కేవలం కోటి ఇరవై లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిన్న సినిమా ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర 24 కోట్లు కలెక్ట్ చేసి టాలీవుడ్ చరిత్రలో బెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. చిన్న సినిమాల్లో ఇప్పటికీ నువ్వే కావాలి ది ఓ అరుదైన రికార్డు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఒడియన్ లోనే దాదాపు కోటి రూపాయల షేర్ రాబట్టి అరుదైన రికార్డు నెలకొల్పింది. అంటే సినిమా బడ్జెట్ కేవలం ఒక్క థియేటర్ లోనే వచ్చేసిందన్నమాట. ఇది మామూలు విషయం కాదు.

27 కేంద్రాల్లో 175 రోజులాడిన ఈ సినిమా 22 కేంద్రాల్లో 200 రోజులు దాటి ఆడింది. హైదరాబాద్ ఒడియన్ థియేటర్ లో 275 రోజులు ప్రదర్శించబడి కోటి,యాభై లక్షల గ్రాస్ రాబట్టి టాప్ 10 గ్రాసర్ రికార్డులో మంచి స్థానం దక్కించుకుంది. చాలా ఏరియాల్లో ఇప్పటికీ రికార్డుల లిస్టులో ఈ సినిమాకో ప్రత్యేక స్థానం ఉంటుంది.

ఈ చిత్ర రజతోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై యూనిట్ కి షీల్డులు అందించి అభినందించారు.

ఇరవై ఏళ్ళు గడుస్తున్నా ప్రేమకథ చూడాల్సి వస్తే… ‘నువ్వే కావాలి’ అంటూ ఈ సినిమానే వెతుక్కుంటామంటే ఈ లవ్ స్టోరి మన హృదయాల్లో ఏ స్థానంలో ఉందో చెప్పనక్కర్లేదు.

-రాజేష్ మన్నె