ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ అదుర్స్

Thursday,July 05,2018 - 07:26 by Z_CLU

బాలయ్య హీరోగా, క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ ఇవాళ్టి నుంచి సెట్స్ పైకి వచ్చింది. అన్నపూర్ణ స్టుడియోస్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఇది కూడా విశేషం. షూటింగ్ స్టార్ట్ అయిన మొదటి రోజే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది యూనిట్. అవును.. ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజైంది.

మ‌న‌దేశం సినిమాలో ఎన్టీఆర్ గెట‌ప్ ని గుర్తు చేస్తూ, యాజ్ ఇటీజ్ అదే వేష‌ధార‌ణ‌లో ఉన్న బాల‌య్య‌ని ఫస్ట్ లుక్ స్టిల్ కింద విడుదల చేశారు. మ‌న‌దేశంతోనే ఎన్టీఆర్ తెలుగు చ‌ల‌న చిత్ర‌సీమ‌కు పరిచయమయ్యారు. అంతేకాదు, నటసార్వభౌముడు షూటింగ్ చేసిన మొట్టమొదటి రోజు కూడా ఈరోజే. అందుకే ఈరోజు ఎన్టీఆర్ బయోపిక్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. మనదేశంలో ఎన్టీఆర్ లుక్ తో బాలయ్య స్టిల్ రిలీజ్ చేశారు.

తాజా స్టిల్ తో పాటు ఎన్టీఆర్ తన స్వదస్తూరితో రాసుకున్న వాక్యాల్ని కూడా విడుదల చేసి, క్రిష్ తన మార్క్ చూపించాడు. ఇవాళ్టి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను కొనసాగించబోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ లా నటించడమే కాకుండా, ఈ మూవీకి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు బాలయ్య. సినిమాలో బాలయ్య సరసన విద్యాబాలన్ హీరోయిన్ గా నటించనుంది.