అవి లేకుంటే ఈ సినిమా లేదు..

Monday,September 11,2017 - 01:23 by Z_CLU

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మాణంలో బాబీ దర్శకత్వంలో ‘జై లవ కుశ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెల 21న థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఎమోషనల్ గా మాట్లాడుతూ ఫాన్స్ ను ఆకట్టుకున్నాడు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ ” నిజానికి నేను నటించిన గత సినిమాలే ఈ సినిమా వరకూ నన్ను నడిపించాయి. అపజయాలు పలకరిస్తున్నప్పుడు ‘టెంపర్’ నాకు ఓ కొత్త ఉత్సాహానిచ్చింది. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు ఆద్యం పోసింది ‘టెంపర్’ అయితే, ‘జనతా గ్యారేజ్’ కి ఆద్యం పోసింది ‘నాన్నకు ప్రేమతో’, ఇప్పుడు ‘జై లవ కుశ’ సినిమాకు ఆద్యం పోసింది  ‘జనతా గ్యారేజ్’. ఆ సినిమాలు లేకపోతే  ఈ సినిమా లేదు. ఇలా నేను నటించిన ఒక్కో సినిమా నన్ను మరో రేంజ్ సినిమాకు తీసుకెళ్ళడం, అభిమానులు వాటిని ప్రోత్సహించి ఆదరించడం చాలా సంతోషంగా ఉంది. జనతా గ్యారేజ్ తర్వాత అన్న నేను కలిసి సినిమా చేయాలనీ డిసైడ్ అయ్యాం. మా ఇద్దరి కలయికలో వచ్చే సినిమా అభిమానులకు, మన అమ్మ నాన్నలకు ఓ బహుమతి లా ఉండాలి… అనుకుంటున్న సమయంలో దేవుడే మా మాట విని పంపించినట్టుగా బాబీ ఈ కథతో మా దగ్గరికి వచ్చాడు. అలా కుదిరిన సినిమా ‘జై లవ కుశ’. కచ్చితంగా అభిమానులు సినిమా చూశాక ఏం తీసార్రా అన్నదమ్ములు అనుకునేలా ఈ సినిమా ఉంటుంది..” అంటూ సినిమా పై తనకున్న నమ్మకాన్ని వ్యక్తపరిచాడు తారక్.