నవంబర్ బాక్సాఫీస్ రివ్యూ

Monday,December 03,2018 - 06:01 by Z_CLU

టాలీవుడ్ కు నవంబర్ సీజన్ కాదు. అందుకే ఈ నెలలో పెద్ద సినిమా రిలీజ్ లు పెట్టుకోరు. కానీ ఈ సెంటిమెంట్ కు 2018 మినహాయింపు. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ లోనే రిలీజైంది. నవంబర్ బాక్సాఫీస్ పై జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

నవంబర్ ఫస్ట్ వీక్ లో అరడజను సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో అందర్నీ ఆకర్షించిన మూవీస్ మాత్రం రెండే. అవే సవ్యసాచి, సర్కార్. నాగచైతన్య-నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నవంబర్ బాక్సాఫీస్ కు ఓ ఊపు తీసుకొచ్చింది. చైతూ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవకపోయినా, అతడి కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది.

ఇక విజయ్ నటించిన సర్కార్ సినిమా కూడా తెలుగులో ఓ మోస్తరుగా ఆడింది. ఈ 2 సినిమాలతో పాటు వచ్చి మిగతా మూవీస్ అన్నీ  ఫ్లాప్ అయ్యాయి. రవిబాబు తీసిన అదుగో మూవీతో పాటు కర్త కర్మ క్రియ, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ తెలుగు వెర్షన్లు ఫ్లాప్ అయ్యాయి.

ఇక నవంబర్ రెండో వారంలో భారీ అంచనాల మధ్య విడుదలయ్యాయి అమర్ అక్బర్ ఆంటోనీ, టాక్సీవాలా సినిమాలు. రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ పెద్దగా మెప్పించలేకపోయింది. విజయ్ దేవరకొండ చేసిన టాక్సీవాలా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. మొదటి రోజే బ్రేక్-ఈవెన్ సాధించి సంచలనం విజయం సాధించింది. ఈ సక్సెస్ తో విజయ్ దేవరకొండ తన స్టార్ డమ్ ను మరింత పెంచుకున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు అదే వారం విజయ్ ఆంటోనీ నటించిన రోషగాడు సినిమా కూడా థియేటర్లలోకి వచ్చింది. కానీ ఫ్లాప్ అయింది.

నవంబర్ మూడో వారంలో శరభ, లా, రంగు, 24 కిస్సెస్ అనే 4 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో ఏ ఒక్కటి మెప్పించలేకపోయింది. ఆదిత్ అరుణ్, హెబ్బా హీరోహీరోయిన్లుగా నటించిన 24 కిస్సెస్ సినిమాపై ఓ సెక్షన్ ఆడియన్స్ దృష్టిపెట్టినప్పటికీ, అది కూడా ఆకట్టుకోలేకపోయింది. ఇక మిగతా సినిమాల సంగతి సరేసరి.

నవంబర్ లో అప్పటివరకు విడుదలైన సినిమాలన్నీ ఒకెత్తు. నవంబర్ లాస్ట్ వీక్, 29న విడుదలైన ఒకే ఒక్క సినిమా మరో ఎత్తు. అదే 2.O. రజనీకాంత్-శంకర్ కాంబినేషన్ లో 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ ను ఓ ఊపు ఊపుతోంది. హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ తో, అద్భుతమైన విజువల్స్ తో 2.O సినిమా అందర్నీ కట్టిపడేస్తోంది. టాక్సీవాలా తర్వాత నవంబర్ లో సాలిడ్ హిట్ అంటే అది 2.O మాత్రమే. ఈ సినిమా ప్రభావం డిసెంబర్ మంత్ పై కూడా ఉంటుంది.

ఇలా నవంబర్ లో దాదాపు 15 సినిమాలు విడుదలైతే, అందులో టాక్సీవాలా, 2.O మాత్రమే మెరిశాయి.