'స్పైడర్' లీక్ అవ్వలేదు: క్లారిటీ ఇచ్చిన యూనిట్

Monday,September 04,2017 - 08:01 by Z_CLU

నిన్నంతా టాలీవుడ్ లో ఒకటే టెన్షన్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు లీక్ అయ్యాయనే న్యూస్ బయటకొచ్చిన వెంటనే టోటల్ ఇండస్ట్రీ అంతా షాక్ కు గురైంది. రిలీజ్ కు కొన్ని రోజుల ముందు ఇలా సినిమాలో కొన్ని సీన్స్ లీక్ అయితే అది ఎంత ప్రమాదమో, సినిమాకు ఎంత నష్టమో తెలిసిందే. దీంతో యూనిట్ తో పాటు పరిశ్రమకు చెందిన పెద్దలు కూడా కలవరపడ్డారు.

న్యూస్ బయటకు వచ్చిన వెంటనే ఎలర్ట్ అయింది స్పైడర్ యూనిట్. లీక్ అయిన క్లిప్స్ గా భావిస్తున్న సన్నివేశాల్ని పరిశీలించింది. ఆ సన్నివేశాలతో స్పైడర్ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం పుకార్లు పుట్టించేందుకే ఇలాంటి వీడియోలు సృష్టించారని నిర్థారణకు వచ్చింది. దీనిపై వెంటనే ఓ అఫీషియల్ స్టేట్ మెంట్ విడుదల చేసింది. స్పైడర్ లీకేజ్ పుకారు మాత్రమే అని తెలిసిన తర్వాత టాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది.

తెలుగు-తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది స్పైడర్ సినిమా. మహేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు మురుగదాస్ దర్శకుడు. ఈమధ్యే మూవీకి సంబంధించి ఆఖరి షెడ్యూల్ కంప్లీట్ చేశారు. దసరా కానుకగా ఈనెల  27న థియేటర్లలోకి రాబోతోంది స్పైడర్.