జీ స్పెషల్: టార్గెట్ మిస్సయినట్టేనా?

Sunday,April 05,2020 - 01:15 by Z_CLU

ఈ ఏడాది మూడు సినిమాలతో ఎంటర్టైన్ చేయడానికి స్కెచ్ రెడీ చేసుకున్నారు కొందరు యంగ్ హీరోలు. వరుసగా మూడు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకొని రాత్రి పగలు కష్టపడాలని డిసైడ్ అయ్యారు. కానీ కరోనా వారి ఆశలపై నీళ్ళు చల్లింది.

గతేడాది ‘జెర్సీ’,’గ్యాంగ్ లీడర్’ సినిమాలు రిలీజ్ చేసిన నాని ఈ ఇయర్ మూడు సినిమాలు ప్లాన్ చేసుకున్నాడు. ముందుగా తన 25వ సినిమా ‘V’ తో పలకరించి ఏడాది మధ్యలో ‘టక్ జగదీశ్’ గా రావాలనుకున్నాడు. ఇక చివర్లో అంటే డిసెంబర్ లో ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాతో ముగింపు ఇవ్వాలని భావించాడు.

అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. మార్చిలో విడుదల కావాల్సిన ‘V’ సినిమా పోస్ట్ పోన్ అయింది. ‘టక్ జగదీష్’ షూటింగ్ కూడా పోస్ట్ పోన్ అయింది. ఇక ‘శ్యామ్ సింగ రాయ్’ ఇప్పుడే సెట్స్ పైకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. అంటే ఈ ఏడాది నాని నుండి రెండు సినిమాలు రిలీజ్ పక్కా కానీ మూడో సినిమా డౌట్ కొడుతోంది.


నాని తర్వాత నితిన్ కూడా మూడు సినిమాలు ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే ‘భీష్మ’ గా వచ్చి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. సమ్మర్ లో ‘రంగ్ దే’ తో మేజిక్ చేయాలనుకున్నాడు. ప్రస్తుతం ‘రంగ్ దే’ షూటింగ్ ఫినిషింగ్ స్టేజికి చేరుకుంది. అంతలోనే కరోనా వల్ల షూటింగ్ పోస్ట్ పోన్ అయింది. దీని ప్రభావం చంద్రశేఖర్ ఏలేటి సినిమాపై కూడా పడింది. ఈ లెక్కన చూసుకుంటే నితిన్ నుండి కూడా మూడో సినిమా రావడం అనుమానమే.

శర్వానంద్ పరిస్థితి కూడా ఇంతే. ఇప్పటికే ‘జాను’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శర్వా సమ్మర్ లో ‘శ్రీకారం’ సినిమాతో థియేటర్స్ సందడి చేయాలనుకున్నాడు. కానీ ఈ సినిమా సమ్మర్ లో రావడం కష్టమే. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ వల్ల షూటింగ్ ఆగింది. సో.. మిగిలిన షూట్ పూర్తి చేసి మళ్ళీ ఏదైనా డేట్ ఫిక్స్ చేసుకోవాలి. ఇక బైలింగ్వెల్ సినిమా కూడా షూటింగ్ స్టేజిలోనే ఉంది. అది కూడా ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మరి ఈ ఏడాది శర్వా నుండి మూడు సినిమాలు రిలీజ్ అవుతాయా అనేది చూడాలి.