సొసైటీ కోసం అర్జున్ సురవరం: నిఖిల్ ఇంటర్వ్యూ

Thursday,November 28,2019 - 03:25 by Z_CLU

అర్జున్ సురవరం సినిమాతో రేపు థియేటర్లలోకి రాబోతున్నాడు నిఖిల్. ఈ సినిమా తన కెరీర్ లోనే స్పెషల్ అంటున్నాడు. సొసైటీ కోసం పనికొచ్చే సినిమా ఇన్నాళ్లకు చేశానంటున్న నిఖిల్.. అర్జున్ సురవరంకు సంబంధించి ఎన్నో డీటెయిల్స్ ను మీడియాతో షేర్ చేసుకున్నాడు.

నిద్ర లేని రాత్రులు గడిపాను
ఓ సినిమా వాయిదాపడితే ఎవరికైనా అది మెంటల్లీ, ఫిజికల్లీ ఎఫెక్ట్ అవుతుంది. ప్రతి సినిమాను బేబీలా ఫీల్ అవుతాం. ఎప్పుడైనా ఆ బేబీ డేంజర్ లో ఉన్నాడంటే భయం వేస్తుంది. భయంతో పాటు నేను చాలా ఫీల్ అయ్యాను కూడా. మే 1న రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. ఆల్ మోస్ట్ ఇంటికెళ్లి ఏడ్చినంత పనిచేశాను. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నేను చేసిన 17 సినిమాల్లో ఎప్పుడూ ఇలా అవ్వలేదు.

సగం పారితోషికమే తీసుకున్నా
సాధారణంగా ఏ సినిమానైనా ఆర్థిక కష్టాలతో ఆగిపోతుంది. కానీ అర్జున్ సురవరం సినిమాకు ఆ సమస్య లేదు. మరికొన్ని ఇతర కారణాల వల్ల ఇది ఆగిపోయింది. నిజానికి సినిమాకు సంబంధించి నా పని అయిపోయింది. నేను తప్పుకోవచ్చు. కానీ ఇది మంచి సినిమా. నేను అలా చేయలేకపోయాను. ఎంత చేయాలో అంతా చేశాను. ఇంకా చెప్పాలంటే నా రెమ్యూనరేషన్ కూడా అడగడం మానేశాను. నిర్మాత ఎంతిస్తే అంత తీసుకున్నాను. దాదాపు నా సగం పారితోషికం నేను తీసుకోలేదు. ఎందుకంటే నా ప్రొడ్యూసర్ ముందు సేఫ్ లో ఉండాలి.

సొసైటీకి పనికొచ్చే సినిమా
జనాలకు చెప్పాల్సిన కథ ఇది. మంచి సందేశం ఉన్న సినిమా ఇది. నేను ఎన్నో సినిమాలు చేశాను. కానీ ఇది నాకు స్పెషల్. ఎందుకంటే, ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా నేనెప్పుడూ చేయలేదు. స్వామిరారా, కార్తికేయ సినిమాల వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు. కానీ అర్జున్ సురవరం సినిమాలో థ్రిల్ తో పాటు చిన్న మెసేజ్
కూడా ఉంటుంది. సొసైటీకి పనికొచ్చే సినిమా ఇది. అందుకే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను.

కెరీర్ లో స్లో అవ్వలేదు
అర్జున్ సురవరం వల్ల నా కెరీర్ స్లో అవ్వలేదు. నెక్ట్స్ కార్తికేయ-2 చేయబోతున్నాను. గీతాఆర్ట్స్-2లో వీఐ ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. వీటితో పాటు హనుమాన్ అనే మరో మూవీ చేయబోతున్నాను. ఈ సినిమాలన్నీ కొత్త కొత్త పాయింట్స్ తో వస్తున్నాయి. ప్రేక్షకులకే కాదు, నాక్కూడా చాలా కొత్త. అందుకే కాస్త స్లో
అయినట్టు కనిపిస్తోంది తప్ప, నేను స్లో అవ్వలేదు. లైనప్ అయితే ఉంది. మెల్లగా ఏడాదికో సినిమా చేసుకుందామనే ఆలోచన ఉంది.

ఇది స్టూడెంట్స్ సినిమా
అర్జున్ సురవరం అనేది కేవలం నకిలీ సర్టిఫికేట్ల మీద ఉండదు. ఇది కేవలం సినిమాలో చిన్న పాయింట్. ఇది విద్యార్థుల సమస్య మీద తీసిన సినిమా. ఏటా 15 లక్షల మంది స్టూడెంట్స్ యూనివర్సిటీల నుంచి బయటకు వస్తున్నారు. కేవలం 6లక్షల మందికే ఉద్యోగాలు వస్తున్నాయి. మిగతా 9 లక్షల మందికి ఎందుకు ఉద్యోగాలు రావడం లేదనే విషయాన్ని ఈ సినిమాలో చర్చించాం. ఇష్యూతో పాటు పరిష్కారం కూడా చూపించాం.

ఆ సినిమా కథ నచ్చలేదు
శ్వాస సినిమా ఆగిపోయిన మాట నిజమే. అది నాకు నెరేట్ చేసినప్పుడు ఒకలా ఉంది. డెవలప్ చేసే టైమ్ కు అది వేరే సినిమా అయింది. సో.. నాకు, డైరక్షన్ టీమ్ కు సింక్ అవ్వలేదు. ఎందుకో శ్వాస నాకు సూట్ అవ్వదు, చేయకూడదు అనిపించింది. అదే వాళ్లకు చెప్పేశాను. అడ్వాన్స్ వెనక్కు ఇస్తానన్నాను. నిర్మాత ఒప్పుకోలేదు. ఆ నిర్మాతకే హనుమాన్ అనే సినిమా చేస్తున్నాను.

ఎంటర్ టైన్ మెంట్ యాడ్ చేశాం
ముందు ముద్ర అనే టైటిల్ అనుకున్నాం. వేరే వాళ్లు ఆ టైటిల్ పెట్టారని మాకు తెలీదు. వెంటనే టైటిల్ మార్చేశాం. అర్జున్ సురవరం అనే టైటిల్ ఫిక్స్ చేశాం. ముద్ర కంటే ఈ టైటిల్ కే ఎక్కువమంది కనెక్ట్ అయ్యారు. ఇది రీమేక్ అయినప్పటికీ చాలా మార్పులు చేశాం. ఒరిజినల్ వెర్షన్ చాలా సీరియస్ గా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు అంత సీరియస్ మూవీ చూడరు. అందుకే దీన్ని ఎంటర్ టైనింగ్ గా మార్చాం. వెన్నెల కిషోర్, సత్యను యాడ్ చేశాం. నాతో సమానంగా వాళ్ల పాత్రలుంటాయి.

రానాతో సినిమా అలా మిస్
రానాతో ఓ సినిమా మిస్ అయ్యాను. డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేకనే ఆ సినిమా వదిలేశా. హాతీ మేరా సాథీ అనే సినిమా అది. నాకు జంతువులంటే చాలా ఇష్టం. ఆ సినిమా చేయాలనుకున్నాను కానీ మిస్ అయ్యాను.

అప్ కమింగ్ మూవీస్
కార్తికేయ-2 షూటింగ్ డిసెంబర్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది. నిజానికి నవంబర్ లోనే స్టార్ట్ అవ్వాలి. అర్జున్ సురవరం ప్రమోషన్స్ వల్ల లేట్ అయింది. కార్తికేయ-2తో పాటు మిగతా 2 సినిమాలు కూడా స్టార్ట్ అవుతాయి. ప్రస్తుతానికైతే కార్తికేయ-2 షెడ్యూల్స్ సెట్ అయ్యాయి. వచ్చే ఏడాది కనీసం 2 సినిమాలు రిలీజ్ చేస్తా.

చిరంజీవి రావడం మాకు చాలా ప్లస్
మా ఫంక్షన్ కు చిరంజీవి రావడం చాలా ప్లస్ అయింది. అంత పెద్ద స్టార్ మా సినిమాను గుర్తించడమే ఎక్కువ. చిరంజీవి రాకుంటే ఈ సినిమాకు ఇంత బజ్ వచ్చేది కాదేమో. నిఖిల్ సినిమా వస్తుందనే బజ్ కామన్ గా ఉంటుంది. కానీ అదే సినిమా డిలే అయితే ఎవ్వరూ పట్టించుకోరు. చిరంజీవి వచ్చిన తర్వాత అర్జున్ సురవరం సినిమాపై బజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లింది.

ఇదే నా చిట్టచివరి రీమేక్
నా కెరీర్ లో అర్జున్ సురవరం లాస్ట్ రీమేక్. ఇక నేను రీమేక్స్ చేయను. చాలా రీమేక్స్ వస్తున్నాయి. చేయనని చెప్పేశాను. ఈ సినిమా పాయింట్ ఎక్కడో టచ్ చేసింది. అందుకే రీమేక్ అయినప్పటికీ చేశాను. ఇకపై రీమేక్స్ టచ్ చేయను. సీక్వెల్స్ మాత్రం చేస్తాను. ఇప్పుడు కార్తికేయ-2, త్వరలోనే స్వామిరారా సీక్వెల్ కూడా చేస్తాను.