పెళ్లికూతురిగా మారిన నిహారిక

Thursday,August 13,2020 - 03:21 by Z_CLU

మెగా డాటర్ నిహారిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. గుంటూరులో ఓ పెద్ద కుటుంబానికి చెందిన చైతన్య అనే వ్యక్తిని త్వరలోనే ఆమె పెళ్లాడబోతోంది. ఆమె పెళ్లికి ఇంకా టైమ్ ఉంది. కానీ ఇంతలోనే నిహారిక పెళ్లికూతురైంది. కూతుర్ని చూసిన నాగబాబు భావోద్వేగానికి లోనయ్యారు.

అయితే ఇదంతా ఓ నాన్-ఫిక్షన్ కార్యక్రమంలో భాగంగా జరిగింది. జీ తెలుగు ఛానెల్ తో నాగబాబు టై-అప్ అయిన సంగతి తెలిసిందే. “అదిరింది” అనే కామెడీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగబాబు.. ఆ ఛానెల్ లో వచ్చే ఇతర కార్యక్రమాలకు కూడా అప్పుడప్పుడు ప్రత్యేక అతిథిగా వెళ్తుంటారు.

వినాయక చవితి కోసం ఇలాంటిదే ఓ స్పెషల్ ప్రొగ్రామ్ చేసింది జీ తెలుగు. అందులో నిహారికను పెళ్లికూతుర్ని చేశారు. పల్లకిలో ఊరేగిస్తూ స్టేజ్ పైకి తీసుకొచ్చారు. ఆమెతో కొన్ని పెళ్లి పాటలకు డాన్స్ కూడా చేయించారు. ఇవన్నీ చూసిన నాగబాబు బాగా ఎమోషనల్ అయ్యారు.

ఒక దశలో తన పాకెట్ లో ఉన్న మొబైల్ తీసి, ఆ మూమెంట్స్ ను రికార్డ్ కూడా చేసుకున్నారు. ఇలా కూతురు పెళ్లి మూమెంట్ ను ముందుగానే అనుభూతి చెందారు నాగబాబు.