“నెక్ట్స్ నువ్వే” నిర్మాత బన్నీ వాసు ఇంటర్వ్యూ

Monday,October 30,2017 - 01:01 by Z_CLU

ఆది హీరోగా నటించిన నెక్ట్స్ నువ్వే సినిమాతో నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు బన్నీ వాసు. వి4 మూవీస్ బ్యానర్ పై ఈ నిర్మాత నిర్మించిన నెక్ట్స్ నువ్వే సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రానుంది. ఓ 2 గంటల పాటు మనసారా నవ్వుకునేలా సినిమా ఉంటుందంటున్నాడు బన్నీ వాసు

ప్రభాకర్ కు ఇవ్వడానికి కారణం

దర్శకుడు ప్రభాకర్ ఈ సినిమా కంటే ముందే ఓ కథ చెప్పాడు. ఆ కథ నచ్చకపోయినప్పటికీ దాన్ని నెరేట్ చేసే విధానం చూసి అతడు మంచి దర్శకుడు అనే విషయం అర్థమైంది. ఆ తర్వాత అనుకోకుండా ఈ కథ రావడం, అప్పటికే అతడిపై మంచి అభిప్రాయం ఉండడంతో ఈ ప్రాజెక్టును ప్రభాకర్ చేతిలో పెట్టాం.

ఓన్లీ ఎంటర్ టైన్ మెంట్

ఈ సినిమాలో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు అందరూ నవ్వుకుంటారు. ఈ కథను నేను ప్రొడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. ఈ సినిమాకు పర్ఫెక్ట్ హీరో ఆది. ఎవరితో ఎలా ఉండాలనేది అతడికి బాగా తెలుసు. చాలా పద్ధతి కలిగిన అబ్బాయి. చాలా ప్రొఫెషనల్. షూటింగ్ టైమ్ చెబితే చెప్పిన టైమ్ కు వచ్చేస్తాడు. నెక్ట్స్ నువ్వేతో ఆదికి మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను.

బ్యానర్ పెట్టడం వెనక రీజన్

నిర్మాత వంశీ, నేను 15 ఏళ్లుగా ఫ్రెండ్స్. మరో నిర్మాత జ్ఞానవేల్ ఆరేళ్లుగా పరిచయం. జ్ఞానవేల్, నేను కలిసి ఆల్రెడీ తమిళ్ లో ఓ సినిమా నిర్మించాం. మేం ముగ్గురుం చాలా క్లోజ్. అందుకే బ్యానర్ ప్రారంభించాలనుకున్నాం. మేం ఏ పని తలపెట్టినా అల్లు అరవింద్ తో కచ్చితంగా చర్చిస్తాం. ఆయన్ను కూడా భాగస్వామిగా చేరమని కోరాం. వెంటనే ఒప్పుకున్నారు. అల్లు అరవింద్ 60 ఏళ్ల టీనేజర్. వయసు పెరిగే కొద్దీ చిన్నోళ్లతో ఫ్రెండ్ షిప్ చేస్తుంటారాయన. ఇప్పటితరం ఆలోచనలకు దగ్గరగా ఉంటారు. ఆయన బిజినెస్ సీక్రెట్ అదే.

తొలి ప్రయత్నం కలిసి చేద్దామనుకున్నాం

ఇది జ్ఞానవేల్ ద్వారా వచ్చిన సినిమా. ప్రభాకర్, జ్ఞానవేల్ కలిసి చేద్దామనుకున్నారు. మాకు ప్రభాకర్ ముందే తెలుసు కాబట్టి జ్ఞానవేల్ వచ్చి మమ్మల్ని అడిగారు. అలా నేను, వంశీ, జ్ఞానవేల్ కలిసి ఈ సినిమా చేద్దామనుకున్నాం. అరవింద్ గారిని కలిసి చెప్పి కోరడంతో ఆయన కూడా చేరారు. అలా వి4 మూవీస్ బ్యానర్ ప్రారంభమైంది.

ప్రభాకర్ పెద్ద దర్శకుడు అవుతాడు

ప్రభాకర్ వర్కింగ్ స్టయిల్ బాగా నచ్చింది. నెక్ట్స్ నువ్వే సినిమాను అతడు చక్కగా తీశాడు. అందుకే వెంటనే మారుతికి చెప్పాను. అలా మారుతి బ్యానర్ లో ప్రభాకర్ మరో సినిమా చేస్తున్నాడు. అది ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉంది. నాకు తెలిసి ఓ సినిమా రిలీజ్ కాకముందే ఓ కొత్త దర్శకుడికి మరో సినిమా ఆఫర్ రావడం నిజంగా గ్రేట్. ప్రభాకర్ మూడో సినిమా కూడా మాతోనే చేస్తాడు. వి4 బ్యానర్ పైనే ఉండొచ్చు.

కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడమే లక్ష్యం

వి4 మూవీస్ బ్యానర్ ప్రారంభించడానికి మెయిన్ రీజన్ కొత్త టాలెంట్ ను ప్రోత్సహించాలని అనుకోవడమే. గీతాఆర్ట్స్ లో పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలొస్తాయి. అదే విధంగా జ్ఞానవేల్ కూడా పెద్ద సినిమాలు తీస్తున్నారు. యూవీ క్రియేషన్స్ లో కూడా భారీ సినిమాలొస్తున్నాయి. ఈ బ్యానర్లపై కొత్త దర్శకులతో, కొత్త కథలతో, కొత్త నటీనటులతో ప్రయోగాలు చేయలేం. అందుకే వంశీ, నేను, జ్ఞానవేల్, అరవింద్ గారు కలిసి వి4 బ్యానర్ పెట్టాం. దీనిపై కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తాం. వి4లో వాళ్లు నిరూపించుకుంటే.. అప్పుడే వాళ్లకు పైన చెప్పిన పెద్ద బ్యానర్లలో అవకాశాలిస్తాం. కేవలం దర్శకులే కాదు.. 24 విభాగాలకు చెందిన ఏ కొత్త టాలెంట్ నైనా ప్రోత్సహిస్తాం. ఇక నెక్ట్స్ నువ్వే సినిమా చూస్తే ఇందులో 60 శాతం మంది నటీనటులు, టెక్నీషియన్లు కొత్తవాళ్లు.

పేరుకే రీమేక్.. మార్పులు చాలా చేశాం

వి4 మూవీస్ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా ఈ సినిమానే చేయడానికి ఓ రీజన్ ఉంది. ఇదొక రీమేక్ సినిమా. ఆ సినిమా ఒరిజినల్ వెర్షన్ ను మూడేళ్ల కిందట నేను, వంశీ చూశాం. రోజంతా నవ్వుకున్నాం. ఆ తర్వాత అదే రీమేక్ ను జ్ఞానవేల్, ప్రభాకర్ మా దగ్గరకు తీసుకొచ్చారు. వెంటనే ఒప్పుకున్నాం. పేరుకు ఇది రీమేక్ అయినప్పటికీ చాలా మార్పులు చేశాం. ఒరిజినల్ వెర్షన్ ను చాలా తక్కువ బడ్జెట్ లో చేశారు. మాకు బడ్జెట్ సమస్య లేదు కాబట్టి రిచ్ గా తీశాం. ఇక క్లయిమాక్స్ కూడా పూర్తిగా మార్చేశాం. తెలుగు నేటివిటీ తీసుకొచ్చాం.

బన్నీ నుంచి పూర్తి సహకారం

అల్లు అర్జున్ నుంచి మాకు పూర్తి సహకారం ఉంటుంది. మేం చేసే ప్రతి పని బన్నీతో డిస్కస్ చేస్తాం. కాకపోతే ఎక్కువగా ఆయన్ని డిస్టర్బ్ చేయం. కీలకమైన విషయం ఏదైనా చర్చిస్తాం, మంచి సలహాలు ఇస్తారు.

అందరికీ నచ్చుతుంది.. తప్పక చూడండి

మా బ్యానర్ పై తొలి ప్రయత్నంగా చేసిన నెక్ట్స్ నువ్వే సినిమా ఈనెల 27న విడుదల అవుతుంది. సినిమా తప్పుకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఓన్లీ వినోదాన్ని పంచే ఉద్దేశంతోనే ఈ సినిమా చేశాం. దర్శకుడు ప్రభాకర్, హీరో ఆది, హీరోయిన్లకు ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుంది.