శతమానంభవతికి నేషనల్ అవార్డు

Friday,April 07,2017 - 01:06 by Z_CLU

టీవీ రేటింగ్స్ లో ఇప్పటికే సంచలనం సృష్టించిన శతమానంభవతి చిత్రం ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. 64వ జాతీయ ఫిలిం అవార్డుల్లో.. బెస్ట్ పాపులర్ ఫిలింగా శతమానంభవతి చిత్రానికి అవార్డు దక్కింది. చిన్నాపెద్దా తేడాలేకుండా అందర్నీ ఎట్రాక్ట్ చేసిన హోల్ సం ఎంటర్ టైనర్ గా శతమానంభవతి చిత్రాన్ని గుర్తించింది అవార్డుల కమిటీ.

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఉగాది కానుకగా మార్చి 26న జీ తెలుగులో ప్రసారమైన ఈ సినిమా రేటింగ్స్ లో సరికొత్త రికార్డులు సృష్టించింది. తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అత్యధిక రేటింగ్స్ సాధించిన అతికొద్ది చిత్రాల్లో శతమానంభవతి కూడా ఒకటిగా నిలిచింది.

ఈ సినిమాకు అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ అవార్డు రావడం తెలుగుదనానికి దక్కిన అపురూప గౌరవంగా భావించాలి. కుటుంబ బంధాలు, బాంధవ్యాలు… తగ్గిపోతున్న మానవ విలువలు, తెలుగు పల్లెలు, సంప్రదాయాల్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. ప్రకాష్ రాజ్, జయసుధ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు.