జీ స్పెషల్: భక్తిరస దృశ్యకావ్యం 'అన్నమయ్య'

Friday,May 22,2020 - 01:40 by Z_CLU

కొన్ని కథలు సంచలన విజయం సాధించడానికే పుట్టుకొస్తాయి. అలాగే కొన్ని పాత్రల కోసమే కొందరు పుడతారు కూడా….ఇది కొన్ని సినిమాల విషయంలో జరిగే అద్భుతం అనుకోవచ్చు. మనల్ని మంత్రముగ్దుల్ని చేసే పాత్రలు చూసిన సందర్భంలో అసలీ నటుడి కోసమే ఈ పాత్ర పుట్టిందా అనిపించక మానదు. ఇప్పుడు మనం చెప్పుకునేది అలాంటి ఓ సంచలనం సృష్టించిన సినిమా, అందులోని పాత్ర గురించే. 23 క్రితం సరిగ్గా ఇదే రోజు (మే 22) ఓ భక్తిరస దృశ్య కావ్యం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

సినిమా పేరు ‘అన్నమయ్య’… కాదు కాదు ‘నాగార్జున అన్నమయ్య’. ఈ సినిమా టైటిల్ కి ముందు నాగార్జున పేరెందుకు చేర్చాలో అందరికి తెలిసిందే. ఆ పాత్రకు వెండితెరపై ప్రాణం పోసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘అన్నమయ్య’గా గుడి కట్టేసుకున్నాడు నాగార్జున.

 

తాళ్ళపాక అన్నమాచార్యులు…. అప్పటి వరకూ వేద పండితులకు, వెంకన్నను నిత్యం కొలిచే భక్తులకు మాత్రమే ఆయన పాటల రూపంలో పరిచయం. అలా రచనలతో కొందరికి మాత్రమే తెలిసిన ఆ మహా భక్తుడ్ని సినిమా ద్వారా కోట్ల మందికి తెలియజేసారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. అన్నమయ్య జీవిత చరిత్రతో జే.కె.భారవి రచించిన ఈ భక్తిరస కథను దర్శకేంద్రుడు ఎంతో భక్తి శ్రద్ధలతో సినిమాగా తెరకెక్కించి వెండితెరపై ఓ అద్భుత దృశ్య కావ్యంలా ఆవిష్కరించారు. నిజానికి ఓ భక్తిరస చిత్రంతో ప్రేక్షకులందరిని మెప్పించి భక్తిభావం కలిగించడం అనేది కత్తి మీద సాములాంటి వ్యవహారం. ఏమాత్రం తేడా వచ్చినా ప్రేక్షకులు నిరుత్సాహ పడిపోతారు. సినిమా డమాల్ అవుతుంది. అందుకే రాఘవేంద్రరావు ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొన్నారు. కొన్ని సన్నివేశాల్ని ఆయన తెరకెక్కించిన విధానం గమనిస్తే కచ్చితంగా ఆయనలో ఉన్న గొప్ప దర్శకుడు కనిపిస్తాడు. దర్శకుడిగా ఆయనెన్ని సూపర్ హిట్లు , బ్లాక్ బస్టర్ హిట్లు తీసినా ఆయనకు ‘అన్నమయ్య’ తీసుకొచ్చిన గౌరవం వేరు. దర్శకేంద్రుడికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు అందించిందీ సినిమా.

నిజానికి కొన్ని సినిమాలు ఏదో అద్భుత శక్తి ప్రోత్బలంతో మొదలవుతాయి, పూర్తవుతాయి. అవును ‘అన్నమయ్య’ విషయంలో సరిగ్గా అదే జరిగిందని భావించాలి… అసలు సంకీర్తనలతో పేరుగాంచిన అన్నమయ్య కథను వెండితెరపై చూపించాలన్న ఆలోచన ముందు ఎవరికి కలిగిందనేది పక్కన పెడితే, అన్నమయ్యే తన భక్తిను వెండితెర ద్వారా జనాలకి తెలియజేయలనుకొని మనిషిలో ఆలోచన పుట్టించారని, దానికి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తోడ్పడ్డాడని నమ్మాల్సిందే. ఎందుకంటే ఇది ఓ దశాబ్దంలో జరిగిన చరిత్ర. ఓ చరిత్ర కథగా మారి ఆ పై సినిమాగా రావాలంటే మనుషుల కృషి ఎంతున్నా ఏదో కనిపించని అద్భుత శక్తి వెనకుండి నడిపించాలి. లేదంటే కథ కాదు కదా ఇంకే పని ఇంచు కూడా కదలదు. నాగార్జున విషయంలో కూడా అదే జరిగిందని వేరుగా చెప్పనక్కర్లేదు. వెండితెరపై అన్నమయ్యను ఆవిష్కరింపగలగాలంటే నటుడిగా ఒక్క నాగార్జునే ఉన్నారన్నట్టుగా ఎంపిక జరిగింది. అన్నమయ్యగా నాగార్జున ని కాకుండా మరో నటుడు మన ఊహకు కూడా రాలేదు. అంతలా పాత్రలో ఒదిగిపోయి భక్తి భావం ప్రదర్శించాడు నాగ్. ప్రేక్షకులు కూడా కళ్ళ ముందు ఉన్నది అక్కినేని హీరో అని మరిచిపోయి అన్నమయ్యగా చూసుకున్నారు. ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాడు కింగ్. ముఖ్యంగా క్లైమాక్స్ కోసం గెటప్ మార్చి వృద్దుడిగా కనిపించాడు. అందుకే థియేటర్స్ లో అభిమానుల హర్షధ్వానాలు అందుకొని నటుడిగా ఎంతో ఎత్తుకెళ్ళాడు నాగార్జున.

 

 

సినిమాలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా సుమన్ ను ఎంపిక చేయడం మరో వింత. అవును అప్పటికే హీరోగా ఎన్నో కమర్షియల్ సినిమాలు చేసిన సుమన్ ను సినిమాలో దేవుడి క్యారెక్టర్ కి అనుకోవడం పెద్ద సాహసమే, సంప్రదించిన వెంటనే ఆయన కూడా అమ్మో నేను చేయగలనా..? మీసాలు తీసేయాలా..? అసలు నేనా పాత్రకు సూటవుతానా..? అంటూ సందేహ పడుతూ ఆలోచించుకోవడానికి సమయం తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనకి తిరుపతి క్షేత్రం కలలోకి రావడం వెంటనే సినిమాకు ఒకే చెప్పడం ఓ అద్భుతంలా జరిగిపోయాయి. ఆ పాత్ర కోసం దాదాపు నలభై రోజులకు పైగా కటిక నేలపై పడుకుంటూ, మాంసాహారం మానేసి ఎంతో నిష్ఠగా ఉంటూ ఆ పాత్రను చేశారు కాబట్టే వెండితెరపై సుమన్ వెంకటేశ్వర స్వామిగా ఎంట్రీ ఇవ్వగానే థియేటర్స్ లో ప్రేక్షకులు చేతులు జోడించి మరీ దణ్ణం పెట్టుకున్నారు. కలియుగ దైవం శ్రీ వెంకన్న అనగానే మనకెప్పటికీ సుమనే గుర్తొస్తారంటే అతిశయోక్తి కాదు. అదీ ‘అన్నమయ్య’ క్రియేట్ చేసిన ఇంపాక్ట్. ఇక మోహన్ బాబు కూడా వెంకన్న భక్తుడి పాత్రతో ఆకట్టుకున్నారు. మిగతా నటీ నటులందరూ ఈ క్లాసిక్ చిత్రంలో తమ వంతు పాత్ర పోషించి విజయంలో భాగం అందుకున్నారు.

1997 , మే 22 నుండి ‘అన్నమయ్య’ చిత్రంతో థియేటర్లన్నీ పుణ్య క్షేత్రాలను తలపిస్తే, ప్రేక్షకులు భక్తులుగా మారిపోయారు. చిన్నా, పెద్దా, ముసలి, ముతక అందరు ఈ భక్తిరస చిత్రాన్ని చూసేందుకు రోజు థియేటర్ల ముందు క్యూ కట్టి తమ జేబులో డబ్బును టికెట్ కౌంటర్ లో వేసారు. అదీ ‘అన్నమయ్య’ చిత్రం సాధించిన ఘన విజయం తాలుకూ పరిమళాలు. అందుకే తెలుగు చిత్ర చరిత్రలో టాప్ 10 భక్తి రస చిత్రాల్లో ఈ సినిమా ముందు వరుసలో ఉంటుంది.

రాఘవేంద్ర రావు డైరెక్షన్ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కీరవాణి సంగీతం గురించి. అవును ‘అన్నమయ్య’ కీర్తనలతో సినిమాకు పాటలు కంపోజ్ చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు ఆల్బం ద్వారా ఓ గొప్ప బహుమతి అందించారాయన. ఇప్పటికీ అన్నమయ్య పాటలు వింటుంటే తెల్లని పాలవలె ఎంతో స్వచ్ఛంగా హృద్యంగా అనిపిస్తూ భక్తి భావం కలిగిస్తాయి. “తెలుగు పదానికి జన్మదినం”… ,”వినరో భాగ్యము విష్ణు కథ”, “కలగంటి కలగంటి”, “బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే” ఇలా ఒకటా రెండా పాటలన్నీ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించి శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో అలాగే శనివారం ఇంట్లో పూజా సమయంలో తప్పనిసరిగా ఈ చిత్ర పాటలు వినిపిస్తుంటాయి. ఇప్పటి వరకూ అత్యధిక ఆడియో క్యాసెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా ‘అన్నమయ్య’ పాటలకో ప్రత్యేకమైన రికార్డు కూడా ఉంది. విన్సెంట్ ఛాయాగ్రహణం కూడా సినిమాకు కలిసొచ్చింది. మిగతా సాంకేతిక నిపుణులందరూ వారి వారి విభాగంలో మంచి అవుట్ పుట్ అందించారు.

సినిమా కథ గురించి అందులో మనల్ని రంజింప జేసిన సన్నివేశాల గురించి ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది. తెలుగు ప్రేక్షకులు కళ్ళారా చూశాక. అందుకే సన్నివేశాల గురించి కంటెంట్ గురించి ఇక్కడ ప్రస్తావించదలచలేదు.

అబ్బే ఈరోజుల్లో ఇలాంటి భక్తిరస సినిమాను జనాలు చూస్తారా..? అనుకున్న అందరికీ సినిమా సాధించిన ఘన విజయమే సమాధానం చెప్పింది. భక్తిరస చిత్రాల్లో ‘అన్నమయ్య’ ది అరుదైన రికార్డు. విడుదలైన అన్ని సెంటర్లలో 50 రోజులాడిన ఈ చిత్రం 41 కేంద్రాల్లో 100 రోజులు పూర్తిచేసుకుంది. 22 కేంద్రాల్లో 125 రోజులు దాటి నిర్మాత దొర స్వామిరాజు కి ఊహించని రీతిలో వసూళ్లు తీసుకొచ్చిందీ సినిమా.

అంతే కాదు స్పెషల్ బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నాగార్జునకి నేషనల్ అవార్డు( స్పెషల్ జ్యురీ) తెచ్చిపెట్టిందీ సినిమా. అలాగే సినిమాకు సంబంధించి 8 నంది అవార్డ్స్, 3 ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి.అప్పట్లో పార్లమెంట్లో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. అది కూడా అన్నమయ్య చిత్రానికి దక్కిన ఓ అరుదైన గౌరవమని చెప్పొచ్చు.


శ్రీ తాళపాక అన్నమయ్య పుట్టినరోజు విడుదలైన ఈ చిత్రం సరిగ్గా ఆ పాత్ర పోషించిన నాగార్జున పుట్టిన రోజుకి వంద రోజులు పూర్తిచేసుకోవడం మరో విశేషం. 23 ఏళ్ల తర్వాత కూడా మనం ఈ సినిమా గురించి ఇంకా గొప్పగా మాట్లాడుకుంటున్నాం అంటే అదీ ‘అన్నమయ్య’ ఘనత.

– రాజేష్ మన్నె